1. Home
  2. Articles
  3. Mother of All
  4. కొండపల్లి బొమ్మ

కొండపల్లి బొమ్మ

A.Hyma
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 12
Month : July
Issue Number : 3
Year : 2013

మనిషి స్వతంత్రునిగా కనిపించే, అనిపించే అస్వతంత్రుడు. మనిషి స్వతంత్రునిలా అడుగులు వేయగలడా? ‘లేడు’ అని అంటారు ఫ్రెంచి తత్వవేత్త Rousseau – Man is born free but everywhere in chains – అంటూ. పోనీ నియంత్రణ ఐనా ఉన్నదా? ‘లేదు’; “Man has freedom, but that of a tethered dog” – అని విశదీకరించారు బహుముఖ ప్రజ్ఞాశాలి నానీఫాల్కీ వాలా.

అంటే మనిషికి స్వేచ్ఛ ఉన్నది; కానీ అది గుంజకి కట్టివేయబడ్డ పశువుకి ఉన్న స్వేచ్ఛ వంటిది. అది ఒక వృత్తాకార పరిధిలో ప్రదేశంలో తిరుగాడుతుంది. ఆ పరిమితిలో ఏవైనా బండలు, ముళ్ళు, గోతులు ఉంటే అవి దాని స్వేచ్ఛకి అవరోధాలే. ఆ చట్రానికి వెలుపల ఉన్న గడ్డి లేక ఆహారాన్ని చూసి ఎంత గుంజుకున్నా పెనుగులాడినా ప్రయోజనం లేదు.

వనజభవుండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబో, కొంచెమొ, విను! మరుభూమి కేగిన లభించును, మేరువు చేరబోయినన్ ధన మధికంబు రాదు – అనే సుభాషితం అక్షరసత్యం.

మరొక కోణంలోంచి చూస్తే – మన భాష, వేషధారణ, అలవాట్లు, కట్టు బొట్టు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు… అన్నీ నియంత్రించబడుతున్నాయి. ‘నా ఇష్టం నాది’ అంటూ మాట్లాడినా, దుస్తులు ధరించినా, సంచరించినా సాటి మనుషులే తప్పుపడతారు, దండిస్తారు, వెలివేస్తారు.

‘అతను’, ‘ఎత్తుకు రా’ మాటలకి ప్రాంతాన్ని బట్టి అర్థాలు వేరు. పాంటు చొక్కాలతో దేవాలయ ప్రవేశం నిషేధం. సభ్య సమాజంలో మగపిల్లవానికి ఉన్న స్వేచ్ఛ, గౌరవం ఆడపిల్లకి లేవు. భార్య చనిపోతే మగాడు అనతికాలంలో మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. మరి భర్త చనిపోతే స్త్రీ మరొక మగవాణ్ని చూసుకుంటుందా? చేసుకుంటుందా? కన్యాదాన సమయంలోనే మామగారు అల్లుని పాదాలు కడుగుతాడు; పిమ్మట అల్లుడే ఎన్నడైనా మామగారి పాదాలకి నమస్కారం చేస్తాడు.

సంస్కారవంతమైన సంఘంలో హక్కులూ ఉంటాయి; కానీ అవి ఇతరులు స్వేచ్ఛకి భంగం కలిగించరాదు. హోటళ్ళో, సినిమాహాల్లో, ‘Thanks for not smoking’ అని హెచ్చరిస్తారు. కొన్ని దేశాల్లో కన్నబిడ్డ మీద కానీ, పనిమనిషి (Servant maid) మీద కానీ చెయ్యి చేసుకుంటే జరిమానా వేసి, జైలుశిక్ష విధిస్తారు.

నేటి సంక్లిష్ట సామాజిక వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకి ముక్కుతాళ్ళు వేసే సంస్థలు, నియమ నిబంధనలు, న్యాయపరమైన అంశాలు కోకొల్లలు. దేశం, భాష, జాతి, ప్రాంతం, కులం, మతం, గురువులు పరంగా సాటి మనుష్యుల్ని వెలివేస్తున్నారు. ద్వేషిస్తున్నాను, కత్తులు దూస్తున్నారు. ఎక్కడ ఉన్నది స్వేచ్ఛ??

ఇక వ్యక్తిపరంగా చూస్తే – ప్రస్తుత యాంత్రిక యుగంలో ‘a mindless, monotonous, mechanical life’. There is no time to stand and stare. ఏ వ్యక్తికీ ముఖ్యంగా యువతరానికి నిలబడటానికి, తల ఎత్తి చూడటానికి, అన్నపానీయాల్ని తీసికోవటానికి వ్యవధి లేదు. మనిషి శ్వాసిస్తున్నాడు. అంతే; జీవించటం లేదు. అనంతంగా కోరికలు కాళ్ళకి చక్రాల్ని కట్టి పరుగెత్తిస్తాయి. వాస్తవంగా తన లక్ష్యం, గమ్యం ఏమిటో తెలియదు. పదార్థవాదం అనే మత్తులో పడి కొట్టుకుపోవటమే. ఈ సంగతినే T.S.Eliot అనే కవి ‘The Waste Land’ అనే గ్రంథంలో:

– When lovely woman stoops to folly and walks up and down her room again, alone, she smooths her hair with an automatic gesture and puts a record on the gramophone – అన్నారు.

నిజజీవితంలో కొందరు ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారు; కొందరు మార్గమధ్యంలో చతికిలపడతారు, కొందరు జారి పడిపోతారు. కాగా అందరి మనసుల్ని తాకే సత్యం ఒకటి ఉంది. జయాపజయాలకి ఎన్నో హేతువులుంటాయి. పనులు జరగటానికి జరగకపోవటానికి, కార్యం సిద్ధించటానికి సిద్ధించకపోవటానికి కారణం ఒక బలవత్తరమైన శక్తి ప్రభావం; వ్యక్తిగతశ్రమ – పట్టుదల లోపించి కాదు అనేది. దానిని : అదృష్టం – దురదృష్టం అనవచ్చు; failures are stepping stones to success ; errors are evidences of learning సమాధాన పడవచ్చు. ఈ వాస్తవాన్ని అమ్మ సరళంగా సుందరంగా “చేతలు చేతుల్లో లేవు” అని స్పష్టం చేసింది.

‘మనిషి స్వతంత్రుడేనా.’ అనే ప్రస్తుతాంశంపై మరొక్కసారి దృష్టి సారిద్దాం. “కాళ్ళు నడుస్తున్నాయ్ కనుక మనమే నడుస్తున్నాం అనుకుంటాము. కాని నడిపిస్తున్న శక్తి అర్థం కావటంలేదు. ప్రేరణ అర్థం కాదు. ప్రయత్నం అర్థం అవుతుంది. (Thought) ఆలోచన వచ్చిందని వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చిందీ తెలియదు” అని సార్వకాలికమైన సత్యాన్ని ఆవిష్కరించింది అమ్మ.

ఆకలివేస్తే అన్నం తింటాం; దాహం వేస్తే నీళ్ళు త్రాగుతాం. కానీ తర్వాత అవి జీర్ణం కావటానికి, రక్తంలో కలియటానికి, విసర్జింపబడటానికి మన ప్రమేయం, పాత్ర, అధికారం, స్వేచ్ఛ లేవు. కలుములె కల్గునో, వెతలే కల్గునొ, జీవితమందు సౌఖ్యమే కల్గునొ, ఏమని చెప్పనేరు? లోపలికిం పీల్చుగాలి విడువంబడునో, తెగి అంతరించునో – తెలియదు.

ఎడ్ల బండిని తోలేవాడు కాడి తెచ్చి ఎడ్ల మూపురాలకు ఆనించి కొరడా ఝళిపించగానే మారుమాట లేకుండా ఆ మూగజీవులు వడివడిగా సాగుతాయి. వస్తుతః ఆ జంతువుల స్థితికి మాటలు నేర్చిన మనిషి స్థితికి పెద్ద తేడా లేదు. ఒక విధంగా అవే పైమెట్టులో ఉన్నాయి.

నా దృష్టిలో మనిషి, దేవుడు చేసిన కొండపల్లిబొమ్మ. జీవకళ ఉట్టిపడుతూ, వివిధ వర్ణాలతో సౌందర్యరాశిలా కనువిందు చేస్తూ, నాట్యశాస్త్రంలోని వివిధ భంగిమలను అలుపు సొలుపు లేక రసరమ్యంగా ప్రదర్శిస్తూ, తన కళాత్మక దృష్టికి అంకితభావానికి తానే పరవశిస్తూ కనిపించే నర్తకి బొమ్మ dancing girl doll మనందరికీ సుపరిచితమే. మన ఇళ్ళల్లో fridge పైనో, టి.వి. పైనో ఉంచుతాం. దానికి తల, మొండెము, కాళ్ళు చేతులు మూడు బాగాలు నామమాత్ర ఆధారంగా అలరారుతాయి. చిరుగాలి వేస్తే సుందర నృత్యం చేస్తుంది; చెట్ల ఆకు కూడా కదలని వాతావరణంలో నిర్వికార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా సాక్షీభూతంగా కళ్ళు వప్పగించి చూస్తుంది; తీవ్రంగా గాలి వీస్తే పట్టు దప్పి అష్టావక్రుని దర్శనం చేయిస్తుంది – క్రింద పడితే ముక్కలు ముక్కలు అవుతుంది.

మనిషి అంతే. అమ్మ (దైవ) సంకల్పం అనే గాలికి గంతులు వేస్తూ, పల్టీలు కొడుతూ, నవ్వుతూ – నవ్విస్తూ, విచారిస్తూ – విచారింప చేస్తూ నవరసభరితంగా లీలాకల్పిత విశ్వమానవ రంగస్థలిపై నృత్యం చేస్తాడు. ఈ సందర్భంగా జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు

“నను మెడబట్టి గెంటితివి నాటకరంగముపైకి చేతకా

దని బతిమాలుకొన్న వినవైతివి – కన్నులు విప్పి సభ్యులన్ 

కనుగొనినంత కాళ్ళు వడకం దొడగెన్ – సరికొత్త నర్తనం

 బనుకొని చప్పటుల్ చరిచి రందరు – చాల్ తెరదింపు మమ్మరో!”

అని ఆ నృత్యరీతిని అభివర్ణించారు.

“Is there any fate or preordination?’ అని అడిగితే అమ్మ, “It is there whether you accept it or reject it” – అని అన్నది.

సర్వతంత్ర స్వతంత్ర అమ్మ మాత్రమే; మనిషి స్వతంత్రునిలా కనిపించే అస్వతంత్రుడు – అనేది అనుభవైకవద్యేం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!