ఒకనాడు మధ్యాహ్నం అమ్మ దర్శనార్థం వెళ్ళాను. గదిలో అమ్మ మంచం మీద కాకుండా తూర్పువైపు నేలపై పడుకొని ఉన్నది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గదిలో మరెవరూ లేరు. లోపలకి వెళ్ళాలా వద్దా అనే సంశయంలో పడ్డాను. అది గమనించి రమ్మని అమ్మ సంజ్ఞ చేసింది. అమ్మకు దగ్గరగా బాసింపీట వేసుకుని కూర్చున్నాను. అమ్మను చూస్తూ ఉంటే మహదానందంగా ఉన్నది.
ఇంతలో అమ్మ తన పావన పాదద్వయాన్ని నా ఒడిలో పెట్టింది. త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ’ అని ప్రార్ధించటమూ చేతకాదు. కుసుమ సుకుమార పాదపద్మాలను అంత చేరువలో చూస్తూ అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నాను. బ్రహ్మ కడిగిన పాదాలు అవి; వాటిని ‘అమ్మ’ దయతో నా చేతుల్లో పెట్టింది.
అంతలో సోదరి వనజ అమ్మగదిలోకి వచ్చింది; వనజను ఒకగిన్నెతో నీళ్ళు గ్లాసు తెమ్మని అమ్మ ఆదేసించింది. వనజ అలాగే తెచ్చింది. అమ్మ నావైపుచూసి “ఆ నీళ్ళు పాదాలపై పోయి” అని అనుమతించింది. నేను మెల్లగా గ్లాసుతో నీళ్ళు తీసుకుని ధారగా అమ్మ పాద ద్వయంపై పోశాను. నీళ్ళు అయిపోయాయి. వనజ మళ్ళీ నీళ్ళు తెచ్చింది. అవీ అయిపోయాయి. ఈసారి బిందెతో పట్టుకురా అని చెప్పింది అమ్మ.
బిందె ఖాళీ అవుతూ ఉండేది, దానిని వనజ నింపుతూ ఉన్నది. అలా రెండు గంటల సేపు సాగింది – అభిషేక ప్రక్రియ. అలా ప్రత్యక్షంగా అభిషేకం చేసుకోవడం మహద్భాగ్యంగా భావించాను, ఆనందించాను, ఆ సంతోషం మాటలలో వర్ణించలేను. అందులో అంతరార్ధం పరమార్ధం ఏమైనప్పటికీ అంత సమయం ఏకాంతంగా సేవచేసుకోవటం వలన జన్మ ధన్యమైంది.
డిశెంబరు 2020లో నేను జిల్లెళ్ళమూడి వెళ్ళాను. దానికి కొన్నాళ్ళ ముందు అమ్మ నా కలలో కనిపించి “నా పాదాలపై నీళ్ళు పొయ్యి, నాన్నా!” అన్నది. నేను ఎంతో సంబరపడి, జిల్లెళ్ళమూడిలో ఉన్న సమయంలో అమ్మ (మూల విరాట్కి) పాదాలపై నీళ్ళు పోద్దామనుకున్నాను. కాని కొన్ని కారణాలవల్ల వీలు పడలేదు. అయినా సంతోషదాయకమూ ఆశ్చర్యకరమూ అయిన సంగతి అమ్మ మళ్ళీ గతాన్నీ మధురానుభూతిని మరల గుర్తుచేసి నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వ కనికరించడం.
అమ్మ- కోరనిదే వరాలిచ్చే దేవత.
అమ్మ మనతో లేదని ఎవరు అనగలరు?
అమ్మ అకారణ కారుణ్యానికి మనస్సులోనే సహస్రాధిక సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తున్నా.