మే 5 న అమ్మ కల్యాణం వైభవంగా జరుపు కున్నాము. జూన్ 12 అన్నాభిషేకం ప్రతి ఫంక్షన్కు రాజేష్ వాళ్ళ అమ్మ కరుణ, ఆమె స్నేహితురాలు విజయలక్ష్మి, గౌరీసిల్కు పార్వతి అలంకరణ అన్ని ఏర్పాట్లువాళ్ళు చూసుకునేవారు. రాజేష్కు బెంగూళూరులో ఉద్యోగం వచ్చింది. తను ముందుగా వెళ్ళి జాయిన్ అయ్యాడు. కరుణ, కోడలు సత్య జూన్ 11వ తారీఖున వెళ్ళిపోయారు. విజయలక్షి మూడు నెలల క్రితమే పి.ఎమ్. పాలెం వెళ్ళిపోయారు. ఇంక మిగిలింది. నేను, నా భార్య కుసుమ.
జూన్ 12వ తారీఖున దూరమయినా ఉదయమే విజయలక్ష్మి వచ్చింది. ప్రొద్దున్నే కుంభవృష్టి మొదలైంది. ఆవర్షంలోనే గాజువాక నుంచీ భవానీ ప్రసాద్ గారు, ఉమాదేవిగారు వచ్చారు. కామేశ్వరావుగారు మేము శ్రీసూక్త పారాయణలో అన్నాభిషేకం చేసుకున్నాం. అమ్మ పంచలోహ విగ్రహం గర్భగుడి బయట పెట్టి వచ్చిన అందరిచేతా కూడా అన్నాభిషేకం చేయించాము. చాలా తృప్తిగా జరిగింది.
12 గం.ల కు వర్షం తెరిపి ఇచ్చింది. కూర్మన్న పాలెం నుంచీ మా మరదలు రాజ్యం కోడలు, స్వామీజీ శిష్యురాలైన శ్రీదేవి, కూతురు విలాసినితో వచ్చి అమ్మకు అభిషేకం చేసుకున్నారు. మొత్తానికి అమ్మకు ఇష్టమైన ప్రసాద వితరణకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా భోజనాలు అశోక్ హౌస్లో తృప్తిగా జరిగాయి.
ఆ సందర్భంలో గోదావరి పుష్కరాలకు విశాఖ అధ్యయన పరిషత్ తరుపున ఒక రోజు అమ్మ ప్రసాద వితరణకు 22వేలు ఇద్దామన్న నిర్ణయం జరిగింది. కవిరాయని కామేశ్వరరావుగారు 5000/- చెక్కు ఇచ్చారు. ఇంతలో ఆయన స్నేహితులు అమ్మకు మొక్కుకున్నానని 10,000/- ఇచ్చారు. జగన్నాథం 2000/- V.V.SR తిలక్ గారి భార్యలక్ష్మిగారు 1000/- ఇచ్చారు. మిగిలింది వేసి 22వేలు పంపించాము.
అన్నాభిషేకానికి అంకురార్పణ చేసింది సద్గురు శివానందమూర్తిగారు. జిల్లెళ్ళమూడిలో శ్రీసూక్తపారాయణ చేస్తుండగా వారి స్వహస్తాలతో అమ్మకి అన్నాభిషేకం చేసారు. ఆరోజు నుంచి మన సంస్థకు పుష్కలంగా కలెక్షన్స్ రావటం మొదలైంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. గురువుగారు సరిగ్గా జూన్ 10 తారీఖున శివసాయుజ్యం పొందారు. అదే రోజు విశాఖ లలితాపీఠం మేనేజర్ వాడ్రేవు సుబ్బారావుగారి భార్య మధురవాణిగారు అమ్మలో ఐక్యమయ్యారు. ఎప్పుడు లలితపీఠంకు వెళ్ళి నా ప్రేమ, అప్యాయాలతో పలకరించి తప్పక కాఫీ ఇచ్చేవారు. సడన్ గా ఈ వార్తలు వినడంతో మనస్సు కలవరపడింది.
ఇంతలో మరో దుర్వార్త. మా ఆప్తమిత్రుడు మచిలీపట్నంలో పుట్టి వైజాగ్ మెడికల్ కాలేజిలో చదివి వైజాగ్లోనే సెటిలై డాక్టరుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. డా|| నందివాడ శ్రీనివాసరావు. స్వామివారి పుష్కరోత్సవ కమిటీలో కార్యవర్గ సభ్యుడుగా ఎంతో ఉత్సాహంతో పనిచేసి స్వామివారి కృపకు పాత్రుడైన అదృష్టవంతుడు. అతను అదే నెలలో కాలం చేసాడు.
మరోవార్త మా అధ్యయన పరిషత్ ప్రసిడెంట్ గా పనిచేసి అమ్మకు, అమ్మ సంస్థకు ఎంతో సేవ చేసిన శ్రీ A.V.V ప్రసాదరావు గారి రెండవ కుమారుడు శివకుమార్ రైల్వేలో ఉద్యోగం చేసి ఈ మధ్యే రిటైర్డ్ అయ్యాడు. అతను టి.వి. చూస్తూ హార్టుఎటాక్తో అమ్మలో ఐక్యమైపోయాడు. అన్నింటి కంటే దురదృష్టం అతని అన్నగారైన ఆదిత్యగారి కూతురు అల్లుడు చెన్నైనుంచి శివకుమార్ అంత్యక్రియలకు వచ్చారు. భార్యాపిల్లల్ని ఇక్కడే వుంచి అతనికి సెలవులేకపోవటంతో 10వ రోజుకువస్తానని బస్ లో చెన్నైకి బయలుదేరాడు. సరిగా సింగారాయ కొండదగ్గర బస్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ బస్సులో 42మంది ప్రయాణీకులతో ఉన్న బస్సులో లాప్టుసీటులో కూర్చున్నాడు. బస్సు డివైడర్ను గుద్దటంతో అద్దం పగిలి అతను బయటపడి మరణించటం మనసు కలచివేసింది.
తిరిగి జూలై నెలలో అన్నీ శుభవార్తలు. యస్. కోటలో భాస్కరశర్మ, కస్తూరి వాళ్ళు మాతృశ్రీ సేవాసమితిని జూలై 12 న ప్రారంభించటం ఎంతో వైభవంగా జరగటం ఆనందదాయకం. జగన్నాథం పూర్వవిద్యార్థి. ప్రస్తుత శ్రీవిశ్వజననీ పరిషత్ మెంబరు. అతని కూతురికి పాండిచేరి యూనివర్శిటీలో సీటు రావడం ఫీజుకట్టి చేర్పించడం జరిగిపోయాయి. ఏది ఆగదు. రాజు బావపాట ప్రతిరోజూ మందిరంలో వింటూనే వుంటాను. నాకు చాలా ఇష్టం. జననమీవు, మరణమీవు, జన్మలకారణమీవు, కరుణను కురిపించినావు జన్మనిచ్చి మాపైన, కరుణించుము మోక్షమిచ్చినేడైనా రేపైనా. అక్షరాలా నిజం ప్రతిరోజూ ఏదో శుభవార్త, ఎదో దుర్వార్త, అమ్మ చెప్పనే చెప్పింది. సృష్టినాది అనాది.” “అంతా అమ్మకు సహజమే కదా! జగన్నాటక సూత్రధారి అమ్మ. రాసుకుపోతుంటే ఇంకా అనేకం ఉన్నాయి.