వైజాగ్ మందిరంలో అమ్మ వంక చూస్తున్నప్పుడు ఎక్కువగా కేశవశర్మగారే గుర్తుకు వస్తున్నారు. ఇంక ఆయన కనబడరు. ఈ విషయాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టం. నాకు తెలిసినంత వరకూ అహర్నిశలు అమ్మ గురించి ఆలోచించేవారిలో ఆయన ఒకరు. మొన్న కె.బి.జి. గారిది, పొత్తూరి వారి పుస్తకాలు చదివాను. అందరూ మహానుభావులే. అందరూ అమ్మ సేవలో మునిగినవారే. ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర.
రాచర్లవారు అయితే గుళ్ళు గోపురాలు అద్భుతమైన నిస్వార్థసేవ. అమ్మ ఆయనకు ఆ విధంగా అవకాశమిచ్చింది. రామకృష్ణ అన్నయ్య విద్యాలయాలు పి.యస్. ఆర్. కు విశ్వజనని సంపాదకుడిగా- వ్రతాలు పూజలు చేయించే విధంగా, ధర్మసూరి, రామూ భక్తులకు కావలసిన అవసరాలను పరిరక్షించటం, నాదెళ్ళ లక్ష్మణరావుగారి దంపతులు పూర్తిగా అక్కడే స్థిరనివాసమేర్పరచింది. రాజగోపాలరావుగారు హాస్టల్ కట్టడాలు, చక్కా శ్రీమన్నారాయణచేత జిల్లెళ్ళమూడిలో అనేకులకు గృహాలు. అలా జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పినట్లు 7వ మైలు రాయి వరకూ విస్తరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందరూ మహానుభావులే అంతా అమ్మ మాయాజాలంలో వారే.
సద్గురు శివానందమూర్తిగారు చెప్పినట్లు “అమ్మ ఆదిశక్తి కాళీ అవతారం. ప్రేమస్వరూపిణి. మనని ప్రేమించి, లాలించి మనకి జన్మరాహిత్యం ప్రసాదించటానికే ఆవిడ జిల్లెళ్ళమూడి కార్యక్షేత్రంగా ఎంచుకుంది. ఇది సత్యం. ఆమెను కొలిచిన ప్రతివారికి అసలైన సుఖాలు ప్రసాదిస్తోంది. కోరికలు నెరవేరుస్తోంది. ఇంక హైమక్క సంగతి చెప్పనే అక్కరలేదు. తలచినంత మాత్రానే రెక్కలు కట్టుకు వాలిపోతుంది.
ఏరోజుకారోజు ఒక వింత. ఆశ్చర్యం. మా మందిరంలో రోజూ ఎంతోమంది వస్తూనే వుంటారు. కొందరు ప్రదక్షిణలు, కొందరు పారాయణలు. మరికొంతమంది బయట నుంచే నమస్కరించేవాళ్లు. అందరి కోరికలను ఆమె తీరుస్తుంది. కష్టాల కొలిమి నుంచీ బయట పడవేస్తుంది. అనేకమంది కాలేజీ సీట్లు, పెళ్ళిళ్ళు, ఒకటేమిటి అనేక కోరికలను నెరవేరుస్తుంది. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన.
మందిరానికి దగ్గరగా వృద్ధాశ్రమము వుంది. అందులో చాలామంది పిల్లలు విదేశాల్లో వుండటంవల్ల వీరు ఆశ్రమంలో నివాసం. చాలామందిది ఇదే కథ. ఆ ఆశ్రమంలో పనివాళ్ళను సప్లయి చేసే కంపెనీలు. వారి ఇంట్లో పనిచేయటానికి కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కంపెనీకి 6 వేలు కడితే 3 వేలు ఆ పనిపిల్లకి ఇస్తారు. ఒక వేళ ఆమె రాకపోయినా మళ్ళీ ఇంకొకళ్ళని పంపిస్తారు. అలా పనిచేసే ఒక అమ్మాయి రోజు మందిరానికి వచ్చి అమ్మకు దణ్ణం పెట్టుకొని పనికి వెళ్తుంది. ఆమెకు తండ్రి లేడు. ఈమె పంపే 3 వేలే తల్లికి ఆధారం. ఆపిల్లకు అవసరమైన మందులు ఇస్తుంటాను.
ఒక రోజు ఆ పిల్ల మందిరంలో విచారంగా కూర్చుంది. ఎందుకు అలావున్నావంటే ఇక్కడ నేను పని చేస్తున్న ముసలాయన చనిపోయారు. ఆమె పిల్లల దగ్గరకు వెళ్ళిపోతుందని నన్ను వేరే చోట చూసుకోమన్నారు. ఇంక అమ్మను దర్శించుకోవటానికి వీలవదని చాలా బాధపడింది. ఒక నెల గడువు ఇచ్చారని చెప్పింది. హైమక్క నామం చేసుకోమన్నాను. హైమక్క తప్పక ఆమె సమస్యకు పరిష్కారం చూపిస్తుందని నా ధృఢ విశ్వాసం.
గడువు అయిపోవటంతో ఆ అమ్మాయిని వేరే చోటికి పంపించేసారు. శెలవురోజు వచ్చి అమ్మను దర్శించుకొని మందులు తీసుకువెళ్లేది. ఒక రోజు అకస్మాత్తుగా వచ్చేసి జిల్లెళ్ళమూడి వెళ్లాలని వుంది. ఎలా వెళ్ళాలని ఆరా తీయటం మొదలుపెట్టింది. ఏమిటి విషయం ? అని నా ప్రశ్న. తను పనిచేసిన పాతవాళ్ళు బ్రతిమిలాడి మళ్ళీ పనిలో పెట్టుకున్నారని, జీతం పెంచారని ఆమె వున్నంత వరకూ ఆమె దగ్గరే వుంచుకుంటారని అమితమైన సంతోషం వెలిబుచ్చింది. ఇంత సడన్గా ఈ మార్పు ఎలా వచ్చిందని అడిగాను. మొన్న మధ్యాహ్నం 1 గంట అమ్మ దగ్గర ఒక్కతే కూర్చుని మొరపెట్టుకుందిట. మర్నాడే అనేక కబుర్లు, పోన్లు చేసి ఆ అమ్మాయిని రమ్మని, ఆ పిల్లలేకుండా ఆ పెద్దావిడ వుండలేకుండా వున్నారని. అంతా అమ్మదయ అని సంబరపడింది. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే కేశవశర్మగారే గుర్తుకు వచ్చారు.
మరి అమ్మ ఆయన కోరిక తీర్చటానికి ఎందుకు జాప్యం చేస్తోంది. పంచాయతనం, శ్రీ చక్రం అమ్మ గుళ్ళో పెట్టాలని ఆయన చిరకాల వాంఛ. ఆ ఒక్క కోరికా తీర్చలేదా? అమ్మ ఆదిశక్తి అని మనందరికీ తెలుసు. హైమక్కకి అమ్మ శక్తిపాతం చేసిందంటే “నాశక్తి ఒకరికిస్తే తరిగేది కాదని” అమ్మే స్పష్టం చేసింది కదా! ఆ విగ్రహానికి అనేక పూజలు చేస్తాం ? అనేక అలంకరణలు చేస్తాం. సర్వశక్తిమయీ అని పారాయణలు చేస్తున్నాం. ఆ గుడిలో పంచాయతనం పెట్టటం వల్ల అమ్మకేమి నష్టం ? అమ్మకు శక్తిని ఇవ్వగలవాళ్ళం, తీసివేసేవాళ్ళం మనమా ? అంతా మన భ్రమ. అమ్మా ! చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఆ శర్మగారి చిరకాలవాంఛను తీర్చి ఆయన ఆత్మకి శాంతిని చేకూర్చమ్మా! ఆయన నీ ఒడిలోనే ఆడుకుంటున్నాడు. నీ గుడిలో పంచాయతనం ఏర్పాటు చేసుకో తల్లీ! మేమందరం సంతోషిస్తాం. ప్లీజ్… జయహోమాతా !