మా విశాఖమందిరంలో కూర్చున్నంత సేపూ అమ్మతో గడిపిన మధురక్షణాలు, మాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఒక సందర్భంలో చొరవ తీసుకొని “వైజాగ్ రా అమ్మా” అని అభ్యర్థించాను. “వస్తా నాన్నా!” అన్నది అమ్మ. నేను “ప్రామిస్” అన్నాను. అమ్మ ‘ప్రామిస్’ అన్నది. తర్వాత ఎన్ని సందర్భాలలో ఆ ప్రస్తావన తెచ్చినా అమ్మ వద్ద నుండీ సమాధానం లేదు.
అమ్మ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ విషయమై పూర్ణానందస్వామివారిని సంప్రదించాం. దానికి వారు “వారి ఆర్తి, ఆవేదనలకే అమ్మ వేంచేసింది. విగ్రహ ప్రతిష్ఠ మీరే చేసుకొని నిత్యం చేసే పూజలు, పారాయణలు చేసుకోమని” ఆదేశం. అమ్మ ఆ చిన్నమందిరంలో వచ్చి కూర్చుంది. అక్కడ ప్రతినిత్యం ఏదో ఒక వింతే. పాతవారు మందిరం చుట్టుప్రక్కల వున్నవారు రాలేకపోతున్నారు. మందిరం దగ్గర్లో వున్న వాళ్ళు మరీ దూరమవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో గాజువాక, మర్రిపాలెం చాలా దూరాల నుంచీ వచ్చిన వాళ్ళు వారి అనుభవాలు చెప్తుంటే ఒళ్లు పులకరించి పోతుంది.
వృద్ధాశ్రమంలో ఒరిస్సా అమ్మాయిని అమ్మ అనుగ్రహించిన తీరు రాశాను కదా ! మధ్యలో 2 నెలలు ఆ అమ్మాయి కనిపించలేదు. మళ్ళీ మొన్న సాయంత్రం ప్రత్యక్షమయింది. ఆ పిల్లని ఆ ఇంటి ఆమె బొంబాయిలో వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తూ తీసుకు వెళ్లిందిట. ఆ రెండు నెలల బొంబాయిలో హాయగా గడిచిపోయిందిట. ఆ పిల్ల ఎప్పుడూ అమ్మ ఫోటోను బాగ్ లో పెట్టుకొని అమ్మ, హైమక్కల నామం చేస్తూనే వుంటుంది.
బొంబాయికి షిర్డీ దగ్గరే కదా అని ఆ పిల్ల బస్సులో షిర్డీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని తిరిగి బొంబాయి వచ్చేసింది. అప్పుడు రాత్రి 10-30 ని.లు అయింది. ఇంటికి బస్స్టాండు చాలా దూరం. ఆడపిల్ల ఒక్కతే ఆటోలో కానీ టాక్సీలో రావటం కాని సేఫ్ కాదు. బస్సులో చాలా సమయం పడ్తుంది. కానీ ఏమి చేయాలో పాలుపోక అమ్మ నామం చేస్తోంది. ఆ బస్సుస్టాప్లో ఒక అబ్బాయి కన్పించాడుట. ఆ పిల్లవాణ్ణి తన ఎడ్రస్ చెప్పి బస్సు ఎక్కాలని అడిగిందిట. ఆపిల్లవాడు “నేను కూడా అటే వెళ్ళాలని” చెప్పి బస్సులో తోడు వెళ్ళి ఆ అమ్మాయిని ఇంటి వద్ద దింపాడుట. రాత్రి 1.30 అయింది. ఆ అమ్మాయి ఇంటి వద్ద గేటులోపలికి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించలేదట. ఆ పిల్లవాడు మాయం. ఆ పిల్లకి అంతా అయోమయం అయింది. అమ్మే రూపంలో వచ్చి తన్ని కాపాడిందని ఆ పిల్ల పరిపూర్ణ విశ్వాసం. ఈ కథ చెప్తూనే ఇంకో విషయం చెప్పింది.
ఆ పిల్ల అన్నగారు హైద్రాబాద్లో వుంటున్నాడు. ఏదో ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం లేక భార్యను కొట్టడం, పనికి వెళ్ళకపోవటంతో వైజాగ్ తీసుకు వచ్చి పిచ్చి ఆసుపత్రిలో వైద్యం చేయించి, అమ్మ దర్శనం చేయించి, నా దగ్గర మందు తీసుకొని హైద్రాబాద్ వెళ్ళాడు. ఇప్పుడు అతను చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతని భార్య గర్భిణి. ఇదంతా అమ్మ దయ, అనుగ్రహం కాకపోతే మరి ఏమిటి ?
అమ్మ వైజాగ్ వస్తానని చేతిలో చేయివేసి ప్రామిస్ చేసి ఆ మందిరంలో మన కోసం వచ్చి కూర్చుంటే పాదాలను అర్చించుకోలేకపోవటం మన దురదృష్టం. జిల్లెళ్ళమూడిలో గజేంద్రమ్మక్కయ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒకరోజు నిస్పృహతో గజేంద్రమ్మక్కయ్య కొట్టు దగ్గర నులకమంచం మీద పడుకున్నాను. ఎందుకలా వున్నావని” అక్కయ్య అడిగింది. “ఎంత చెప్పుకున్నా అమ్మ కరుణించటం లేదు. ఇంకరాన”న్నాను. “ఏమయ్యోయ్ ఆపైవాడు మాయలోడు. వదలబాక. చాలా ఏడిపిస్తాడు. చివరికి అందలం ఎక్కిస్తాడు” ఆమాటలే మారు మ్రోగుతుంటాయి. అమ్మా ! నిన్ను వదలను, వదలను అమ్మా ! అనుగ్రహించమ్మా… జయహోమాతా…