1. Home
  2. Articles
  3. Viswajanani
  4. క్షణక్షణం – అనుక్షణం

క్షణక్షణం – అనుక్షణం

A. S. Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : November
Issue Number : 4
Year : 2010

వైజాగ్లో అమ్మ మందిరానికి దూరంగా మా నివాసానికి, ఆఫీసుకు 2 సరికొత్త ఫ్లాట్స్ ఏర్పాటు చేసింది. మాకు అన్ని విధాలా, అన్ని సదుపాయాలు చక్కగా ఏర్పడ్డాయి. కానీ మా ఇద్దరికీ అమ్మకు దూరమయ్యామన్న దిగులు ఎక్కువైంది. ఎప్పుడూ మందిరం గురించే ఆలోచనే! ఉదయం 10 కి.మీ. దూరం నుండి వచ్చి మా పాత వంటావిడ లక్ష్మి దీపారాధన చేసి అమ్మ అష్టోత్తరం చేసి నైవేద్యం పెడ్తుంది.

మధ్యాహ్నం 12 గంటలకు స్వయంగా వంటచేసి కార్లో వెళ్ళి అమ్మకు మహానైవేద్యం పెడ్తుంది. శ్రీ సూక్తం, లలితా సహస్రనామపారాయణ, త్రిశతి, ఖడ్గమాల, అమ్మ అష్టోత్తరంతో అమ్మను అర్చించుకొని 1 గంట తిరిగి వస్తుంది. ప్రతి సాయంత్రం 6-30 నుంచి 8 గంటలకు అమ్మ దగ్గర నా కార్యక్రమాలు ముగించుకొని తృప్తిగా ఇంటికి వస్తాను. ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమిలకు 6 గంటల నుంచీ 8 గంటలక వరకూ సామూహిక పూజలు నిర్వహించుకుంటున్నాము.

మేము అశోక్ హౌన్ లో వుండకపోవటంతో బయటనుంచే అనేకమంది రోడ్డు మీద చెప్పులు విడచి అమ్మకు నమస్కారం చేసుకుంటున్నారు. కొంతమంది లోపలికి వచ్చి ప్రదక్షిణలు చేసుకొని నమస్కరించుకొని వెళ్ళటం పరిపాటి అయింది.

ఈ ఏడాది మొదటి నుంచీ ఆరోగ్యం సరిగా లేక బాధలు ఎక్కువయ్యాయి. నాదీ, నాభార్య కుసుమదీ ఒకటే నక్షత్రం. జాతక రీత్యా కష్ట సుఖాలు ఇద్దరికీ ఒకేసారి. ప్రతి క్షణం అమ్మ నేను వున్నానంటూ కాపాడ్తూనే వున్నదని నిరూపించే సంఘటనలు అనేకం. అందులో ఒక సంఘటన.

నా భార్య కుసుమకు సడన్ గా బి.పి. పెరిగి పోయింది. ఉన్నట్లుండి నిలువునా క్రిందపడడం 2సార్లు జరిగింది. అమ్మ తన చేతుల్లోకి తీసుకొని కాపాడటం జరిగింది. అంతలా పడ్డా తలకు దెబ్బ తగలటం కాని, కాళ్ళు చేతులకు నడుం ఎటువంటి ఇబ్బందీ లేకపోవటం అమ్మ దయే కారణం. వెంటనే కేర్ ఆసుపత్రి డాక్టరు సి.వి.రావు గారి దగ్గరకు తీసుకు వెళ్ళాం. ఆయన సద్గురు శివానందమూర్తిగారి శిష్యులు వారికి ఆయనే దైవం. వేరే ధ్యాసలేదు. 

వారు పరీక్ష చేసి హార్టు బాగుంది కానీ బి.పి. బాగా పెరిగిందని నిర్ధారణ చేసి తను వాడుతున్న మందులకు 4 రెట్లు మందులు పెంచారు. బి.పి. తగ్గింది కానీ నీరసం బాగా పెరిగింది. ఏమి చేస్తుందో కూడా తెలియని పరిస్థితి.

మరి నా వరకూ వస్తే మళ్ళీ పాత బాధ. కడుపు పొంగిపోవడం, ఆకలి వుండదు నీరసం. తట్టుకోలేని పరిస్థితి. మందిరంలో కూర్చుని అమ్మకు మొరపెట్టు కున్నాను. మళ్ళీ పాతరోజులు గుర్తుకు వచ్చాయి. ఒక రోజు అమ్మ దగ్గర కూర్చుని ఏడ్చాను. పొట్టమీద చేయి వేసి రాస్తూ యాసిడే నాన్నా! అని ఓదార్చింది. అక్కడ నుంచీ అమ్మ నన్ను, కుసుమను షిర్డీ వెళ్ళమనటం గుర్తుకు వచ్చాయి.

ఆరోజు అక్టోబరు 2 సెలవురోజు. ఆఫీసులేదు. నీరసం, కడుపు బాధ ఎక్కువగా వుంది. సాయంత్రం ఒక్కడినే కూర్చుని బాధతోనే నామం చేసుకుంటున్నాను. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు రోజూ మందిరంలో 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేసుకుంటారు. వారికి అమ్మ పుస్తకాలు కనుమ రాసినవి ఇవ్వటం జరిగింది. వారు నా చేతిలో షిర్డీ సాయి బాబా ప్రసాదం, 20 కాలెండర్లు పెట్టారు. ఆశ్చర్యం, ఆనందం చెప్పనలవి కాదు.

వారు చెప్పటం మొదలు పెట్టారు. విశాఖపట్టణం సిటీ అవతల ‘అరిలోవ’లో బాబామందిరం చిన్నది. కట్టుకున్నారట. రోజూ అమ్మను దర్శించుకొని అక్కడికి వెళ్లి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారట. వారి నివాసం పెద్ద వాల్తేరులో రోజూ లాగానే అమ్మను దర్శించుకొని పది నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నప్పుడు అమ్మ వచ్చి వారి ముందు నిలబడిందిట వారు పాదాభివందనం చేసుకున్నారు. ఆ రోజు నుంచీ వారికి అమ్మ మీద భక్తి ఎక్కువై పోయింది. వారు మండల దీక్ష ‘బాబా’ ‘ది తీసుకొని దీక్షానంతరం షిర్డీ వెళ్ళి వచ్చారు. వారు నన్ను గుర్తు పెట్టుకొని ప్రసాదం తెచ్చి చేతిలో పెట్టారు. కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. అమ్మా ! నీవు ఎంత దయామయివమ్మా! నీవు అమ్మాయి షిర్డీ వెళ్ళమన్న పలుకులు గుర్తుకు వచ్చాయి. నా సంతోషం చెప్పలేను. రెండు రోజుల్లో అన్నీ బాధలు చేతితో తీసివేసినట్లు మాయం. ప్రతిక్షణం మనల్ని అంటి పెట్టుకొని రక్షిస్తోందని చెప్పుకోవాలా ! అమ్మా! మా తప్పులు మన్నించి రక్షిస్తూ వుండు తల్లీ.

గుర్తించే గుర్తులేక దీపమున్నా గుర్తించలేరు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!