1. Home
  2. Articles
  3. Viswajanani
  4. క్షణక్షణం అనుక్షణం

క్షణక్షణం అనుక్షణం

A. S. Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : April
Issue Number : 9
Year : 2011

ప్రతి ఏడాదీ అమ్మ జన్మదినవేడుక చాలా తృప్తిగా, వైభవంగా జరుపుకుంటాం. ఈ ఏడాది అలా జరుపుకో గలమా! అనే సందేహం వెంటాడుతూనే వుంది. కారణాలు అనేకం.

వంటలు చేయించటానికి, త్రాగటానకి నీళ్ళు కావాలి కదా ! అశోకాస్ నీళ్ళ మోటారు పాడైంది. అందుకని వీలైన వారంతా తలా ఒక ప్రసాదం తేవటానికి నిర్ధారణ అయింది. 28వ తారీఖు అమ్మవ్రతం చేసుకోవటం మా అలవాటు. వైజాగ్లో వున్న మన జిల్లెళ్ళమూడి విద్యార్థి సూర్యనారాయణ ఇక్కడి పురోహితుల్లో మంచి పేరు సంపాదించాడు. అతను నేనే వస్తాను అక్కయ్య అంటూ కుసుమకు ఫోను చేశాడు. 28వ తారీఖు సోమవారం అయింది. అన్ని ఆఫీసులు వుంటాయి. అందరు బిజీగా వుంటారు. శనివారం సాయంత్రం అందరం సమావేశ మయ్యాం. మా మేనల్లుడు గోళ్ళమూడి నరసింగరావు అశోక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అశోక్ హౌస్ బాగోగులు అతనే చూస్తూ వుంటాడు. అతను ప్రత్యక్షమయినాడు. మా సమస్య చెప్పాం. తాళాలు ఇచ్చి మోటారు బాగు చేయించు కోమన్నాడు. అప్పటికప్పుడు రాత్రి ఏ ఎలక్ట్రిషియన్ దొరుకుతాడు. ఇంతలోనే ఎక్కడి నుంచో మాకు తెలిసిన ఎలక్ట్రియన్ ప్రత్యక్షమయ్యాడు. మా సమస్య చెప్పాము. ఈ రాత్రికి ఎలాగైనా సామానుకొని తెచ్చి ఆదివారం పని పూర్తి చేస్తానన్నాడు.

ఆదివారం మధ్యాహ్నం కుసుమ నివేదనకు వెళ్ళేటప్పటికీ మోటారు బాగు అయింది. నీటి సమస్య తీరిపోవటంతో 4 గంటల తరువాత మందిరం అంతా గోడలతో సహా కడిగి శ్రీసూక్తంతో అమ్మను అభిషేకించి అలంకరించే అప్పటికి 7 గంటలు అయింది. ఈ మధ్య అయ్యగారి నరసింహారావు గారి అబ్బాయి శ్రీను అమ్మకు కొబ్బరికాయలు తెచ్చి ఇస్తున్నాడు. సరిగ్గా రేపటికి కాయలు ఏలా అనుకుంటున్న సమయంలో వాళ్ళ అమ్మగారు, శ్రీను అమ్మకు కొబ్బరికాయలు తీసుకొని వచ్చారు. అప్పుడే అనుకోకుండా శరభలింగంగారు, సువర్చల, సీతాదేవిగారి అల్లుడు డి. యస్.పి. సుబ్బారాజుగారు, లక్ష్మి వాళ్ళ బాబు వచ్చారు. దాదాపు ప్రతి ఆదివారం కృష్ణశర్మ, లలిత అమ్మ దర్శనానికి వస్తారు. వాళ్ళతో మర్నాడు అమ్మ జన్మదిన వేడుక గురించి చెప్పాను. ఎప్పుడో మానేసిన వాచ్మాన్ అదేవేళకు ప్రత్యక్షమవ్వటం అమ్మ అనుగ్రహానికి నిదర్శనమే.

మర్నాడు ప్రొద్దున్నే రాజాం నుంచీ చైతన్య వచ్చాడు. అతను వుంటే కొండంత అండ. చైతన్య, మురళి కలసి అన్నీ అమర్చేశారు. ముందురోజే మామిడాకుల తోరణాలతో మందిరం చుట్టూ కట్టారు. మైక్ ఏర్పాటు జరిగింది. ఉదయమే మన్నవ కృష్ణశర్మ బుట్టెడు గులాబీలు, ఎఱ్ఱ మందారాలు తీసుకువచ్చారు. ఆ గులాబీలను దండలా కట్టి క్రింద నుంచీ పై దాకా అమ్మను అలంకరించాము. సూర్యనారాయణ అద్భుతంగా పూజ జరిపించాడు. కుసుమ అమ్మ వ్రతకథలు వినసొంపుగా చదివి వినిపించింది.

ఏకా రాజేశ్వరరావుగారి కోడలు కరుణ, మనుమడు రాజేష్ నిలబడి పూజా ఆసాంతం జరిగే వరకూ పాలు పంచుకున్నారు. శ్రీచక్రంలో ఉన్న అమ్మ ఫోటో కుంకుమ, పళ్ళు, పూలు అందరికీ అందజేయటం జరిగింది. 50 మంది స్త్రీలు కుంకుమ పూజ స్వయంగా చేసుకున్నారు. నివేదనలు చెప్పినవారే కాక అనేక మంది పలురకాల ప్రసాదాలు తీసుకురావటం జరిగింది. మా ఇంటినుంచీ పులిహోర, ఉండ్రాళ్ళు లక్ష్మి చేసి తీసుకువచ్చింది. పాతవాళ్ళే కాక కొత్తవాళ్ళు కూడా అనేకులు పాలుపంచుకున్నారు. సూర్యనారాయణ మరదలు పదిమందిని తీసుకొని ప్రసాదంతో వచ్చింది. చివరకు సరళక్కయ్యను కూడా గజపతి నగరంలోనుంచి అమ్మ తెప్పించుకుంది. గోపాలన్నయ్య మనమరాలు వాత్సల్య 4 రకాల పళ్ళు తీసుకు వచ్చి వడ్డన కూడా చేసింది. ప్రసాదాలు అద్భుతంగా వున్నాయని అందరూ ఆనందించారు. అమ్మను చూచి కళ్ళు తిప్పుకోలేకపోయాము. అంతా అమ్మ ఆనందింప చేసింది. అనూహ్యం క్షణక్షణం ఒక అద్భుతం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!