జిల్లెళ్ళమూడిలో చదివిన విద్యార్థులు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో వేలమంది అనేక కళాశాలలో లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. ఈ రోజులలో జీతాలు 30 వేల నుంచీ 40 వేలకు తక్కువ లేదు. ఇది మనందరం గర్వించతగ్గ విషయం. పూర్వవిద్యార్థి కిషోరే అక్కడ చదివినవారికి తిండి గురించి, జీవితం గురించి బెంగవుండదని చెప్పాడు. కొంతమంది పౌరోహిత్యం చేస్తూ మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించారు. యస్. కోటలో భాస్కరశర్మ, విశాఖపట్టణంలో కె.సూర్యనారాయణ ముఖ్యులు. సూర్యనారాయణ మన విశాఖమందిరంలో భక్తిశ్రద్ధతో, అమ్మపూజలు నిర్వహిస్తుంటాడు.
12వ తారీఖున జరిగిన అన్నాభిషేకంకు కొంచెం ఆలస్యంగా వచ్చాడు. అందరూ కొంచెం చికాకు పడ్డాం. కానీ మరుక్షణంలో అందరికీ ఆశ్చర్యం, ఆనందం, ఆయన ఇంటి గృహప్రవేశం 19.6.11 జరిగే కార్యక్రమానికి అందరి చేతుల్లో శుభలేఖలు పంచిపెట్టాడు. ఒక పక్క కూతుర్ని గీతం యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివిస్తూ ఇల్లు నడుపుకుంటూ సామాన్య పురోహితుడు 15 లక్షలతో విశాఖలో (స్థలం వుండగా) పైగా ఇల్లు కట్టడం ఆశ్చర్యకరమైన విషయం. అమ్మ తన బిడ్డల మీద ప్రేమ ఎలా అనుగ్రహిస్తుందో అతని జీవితమే ఒక ఉదాహరణ.
సూర్యనారాయణ చిన్నప్పుడు కొంచెం మందకొడిగా వుండేవాడు. మాట కూడా కొంచెం నత్తిగా వచ్చేది. అతని తల్లిదండ్రులు అమ్మ మీదే భారం వేసి జిల్లెళ్ళమూడి కళాశాలలో చేర్పించారు. 1983-1988 సంవత్సరంలో చదువు ముగించుకొని రెండు సంవత్సరాలు హైద్రాబాద్లో వున్నాడు. మొదట్లో అవకాశాలు దొరకక సంపాదన లేక చాలా బాధపడ్డాడు. విశాఖకు తిరిగి వచ్చేశాడు. సూర్యనారాయణ కజిన్ శ్రీ కొక్కిరగడ్డ సుబ్రహ్మణ్యం (మణి) గారు సూర్యనారాయణకు పౌరోహిత్యం గురువుగా వుండి అందులో అతనికి తర్ఫీదునిచ్చారు. అమ్మ దయవల్ల ఒక ఆంజనేయస్వామి ఆలయంలో నెలకు 5 వేలు జీతం మీద చేరాడు. నెమ్మదిగా బయటకూడా పూజలు చేయిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. కంచుకంఠం. అమ్మ దగ్గర చదువుకున్న రోజుల్లో వున్న నత్తి కూడా పోయి అనర్గళంగా పూజలు చేయించటం వాళ్ళ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. పేరుతో పాటు సంపాదన పెరిగింది.
గాజువాకలో చిన్న స్థలం ఏర్పరచుకున్నాడు. అవసరానికి తనతో పాటు చదువుకున్న స్నేహితులు డబ్బు సర్దుబాటు చేశారు. నెమ్మదిగా అప్పు తీరుస్తూ ధైర్యం చేసి 2 అంతస్థుల చిన్న మేడ ప్రారంభించాడు. చివరికి 5 లక్షలు కావాల్సి వచ్చాయి. పని ఆగిపోయింది. అమ్మ మీదే భారం వేసి తన పనికానిస్తు వచ్చాడు. తను, తన భార్య మానసికంగా వత్తిడి అనుభవించారు. ఇంతలో ఒక పెళ్ళి అద్భుతంగా జరిపించాడు. వచ్చిన అతిధులలో ఒక ఆమె ఆఫీసర్గా సూర్యనారాయణ వివాహం జరిపించిన తీరుకు చాలా మెచ్చుకొని పుట్టుపూర్వోత్తరాలు అడిగింది. అడిగిందే తడువుగా అంతా అమ్మదయ అని తాను జిల్లెళ్ళమూడిలో అమ్మవద్ద చదువుకున్నానని, ఇది అంతా అమ్మ పలికిస్తే తాను పలుకుతున్నానని చెప్పాడు. ఆవిడ తాను బ్యాంకు ఆఫీసర్ నని చెప్పింది. దొరికిందే అవకాశమని తన ఇంటి సమస్యను గురించి చెప్పాడు. ఇక్కడ అమ్మ అనుగ్రహం వర్షించింది. ఆమె మర్నాడు ఉదయమే 8 గంటలకు బ్యాంకు రమ్మన్నారు. సూర్యనారాయణను కూర్చోబెట్టి 2 గంటలలో అన్ని డాక్యుమెంట్స్ తయారుచేయించి 4 లక్షల చెక్ చేతిలో పెట్టింది. సూర్యనారాయణకు మూర్ఛవచ్చినంతపని అయింది. సంతోషానికి అవధులు లేవు ? ఇల్లు పూర్తి చేశాడు. చివరికి 1 లక్ష రూపాయిలు తక్కువ అయితే అది కూడా ఆమె ఏర్పాటు చేసింది.
19.6.11న గృహప్రవేశంకు అందరం వెళ్ళాము. అతని సహాధ్యాయులు వచ్చారు. ఇంకోవిచిత్రం ఏమిటంటే తను కట్టుకున్న ఇంటి ప్రక్కనే ఒక కళ్యాణమండపం వుంది. వచ్చినవారందరికి వసతులతో బాగుంది. 2రోజులకు బుక్చేసుకున్నాడు. అందరికీ వైభవంగా విందు ఏర్పాటు చేశాడు. తరించాడు. అమ్మ అనుగ్రహానికి ఇది ఇంకో నిదర్శనం. అమ్మ పాదాలు వదలకుండా గట్టిగా పట్టుకుందాం. అందరం తరిద్దాం.