1. Home
  2. Articles
  3. Viswajanani
  4. క్షణక్షణం – అనుక్షణం

క్షణక్షణం – అనుక్షణం

A. S. Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : November
Issue Number : 4
Year : 2011

2011 ఆగష్టు 24 మా జీవితంలో ఒక చక్కని అనుభవం. ఆ రోజు ఊహించలేనంతగా చక్కటి పండుగలా గడిచిపోయింది. నా జీవితంలో ఎన్నడూ ఊహించలేదు. నా పేరిట ఒక పుస్తకం ప్రచురింపబడుతుందని. అదే ‘విశ్వజనని’ మాసపత్రికలో ‘క్షణక్షణం అనుక్షణం’ అనే శీర్షికతో – వ్రాసుకుంటున్న అనుభవాలను పుస్తకరూపంలో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఇది అంతా అమ్మ అనుగ్రహం, ఆమె మాయ. దీని వెనుక చిన్న కథ వుంది.

ఈ మధ్య వరుసగా గోపాలన్నయ్య, పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, భవానికుమారి, మల్లాప్రగడ శ్రీవల్లి పుస్తకాలు విడుదల అయ్యాయి. చాలా అద్భుతంగా వున్నాయి. అమ్మతో అనుభవాలు అద్భుతాలే కదా ? ఈ మధ్య నా భార్య కుసుమ ‘క్షణక్షణం అనుక్షణం’ పుస్తక రూపంలో వెలువరించాలని తన కోరికను వెలిబుచ్చింది. నేను కొట్టిపారేశాను. 2 నెలల క్రితం హైదరాబాద్ నుంచీ దుర్గాప్రసాద్ రావుగారి అమ్మాయి శ్రీమతి గురజాల సత్యకుమారి ఫోన్ చేసి ‘క్షణక్షణం – అనుక్షణం’ పుస్తకం వేయించారా ? అని అడిగింది. వెంటనే కుసుమ పట్టుబట్టింది. ఒప్పుకోక తప్పలేదు. పూర్వం వేయించిన 10 పుస్తకాలు వైజాగ్లోనే వేయించింది. ఈ మాటు తనకూ అంత ఓపికగా లేదు. ఎక్కడ వేయించాలి. ఇదంతా అమ్మ సంకల్పం. అమ్మస్ఫూర్తి పి.యస్.ఆర్ అన్నయ్యకు ఫోను చేయించింది. అమ్మ. “ఎంతలోకమ్మా 15 రోజులలో పుస్తకం తెచ్చేద్దాం” అని పి.యస్.ఆర్. అన్నయ్య భరోసా. కుసుమా, పి.యస్.ఆర్ అన్నయ్య ఫోనులో మాట్లాడుకునే వారు. పి.యస్.ఆర్. పర్యవేక్షణలో మల్లాప్రగడ సహకారంతో పుస్తకం సకాలంలో సర్వాంగ సుందరంగా వచ్చింది. కుసుమ మా చుట్టాలను, జిల్లెళ్ళమూడి అన్నయ్యలు, అక్కయ్యలను ఫోనులోనే ఆహ్వానించింది. 

మా కుసుమ ప్రూఫ్ తీసుకుని ఆశీస్సుల కోసం కుర్తాళం స్వామివారి దగ్గరకు వెళ్ళింది. చాతుర్మాస్య దీక్ష విశాఖపట్టణం లలితాపీఠంలో కొన సాగిస్తున్నారు. పీఠానికి వెళ్ళగానే అక్కడ నద్గురు శివానందమూర్తిగారు. ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యం. వారికి నమస్కరించి ఆహ్వానపత్రిక చేతికి ఇచ్చింది. వెంటనే “మీరు చాలా మంచి పనిచేస్తున్నారు. అంతా శివానుగ్రహం” అని ఆశీర్వదించారు. శ్రీ స్వామి వారు ఆశీస్సులను వ్రాసి ఇచ్చారు. పుస్తకం ప్రింటు అయ్యింది. శ్రీ స్వామి వారి చేతులమీదుగా పుస్తకావిష్కరణ లలితాపీఠంలో చేయ నిశ్చయించాము.

జిల్లెళ్ళమూడి నుంచి అమ్మ ప్రసాదంతో లక్ష్మణరావు గారు, భ్రమరాంబక్కయ్య, గుంటూరు నుంచి మా బావమరిది అన్నంరాజు మురళీకృష్ణ వచ్చారు. ఏలూరు నుంచి మా తమ్ముడు అశ్వినీకుమార్, శ్రీమతి రాజేశ్వరి వచ్చారు. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ పూర్వ విద్యార్థులు 15 మంది దాకా విచ్చేసారు. చైతన్య, జగన్నాధం అనేకమంది ప్రొద్దున్న నుంచీ లలితాపీఠంలో అమ్మసూక్తులు, మామిడితోరణాలు కట్టి అలంకరించారు. సూర్యనారాయణ, జగన్నాధం కుటుంబంతో సహా వచ్చి సభ జయప్రదం కావించారు.

పి.యస్.ఆర్.అన్నయ్య అద్భుతంగా సభానిర్వహణ చేసారు. మల్లాప్రగడ తన వాగ్దాటితో, చమత్కారంతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన ప్రసంగం ఇంకా కొనసాగితే బాగుండేది అని చాలామంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. సభ రసవత్తరంగా జరుగుతున్న సమయంలోనే నేను కొంచెం కుర్చీ వెనక్కి జరపటంతో స్టేజీ మీద నుంచీ కుర్చీతో సహా వెనక్కి పడిపోయాను. నాకు మాత్రం ఏమయిందో తెలియదు. ఎక్కడా ఒక్క దెబ్బగాని, ఒక గీతగాని కలుగలేదు. సడన్గా అంతా నిశ్శబ్దం. కుర్చీ వెనుకభాగం స్ప్రింగ్ లాగా మళ్ళీ పైకి తోసింది. లేచి కూర్చున్నాను. అందరూ దిగ్భ్రాంతులై పోయారు. నాకు ఏమైందో అని. ఏమీ దెబ్బలు తగలకపోవటంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. అమ్మ దయ, స్వామివారి అనుగ్రహం వుంటే ఏమీ జరగదని అన్నాను. దానికి స్వామివారు చిరునవ్వులు చిందించారు.

వెంటనే కుసుమ మైక్ తీసుకుని “ఇదే క్షణక్షణం అనుక్షణం అమ్మ మన వెంట వుండి ఎలా రక్షిస్తోందో మీరే చూశారు కదా ! ఇంతకంటే నిదర్శనం ఏమి కావా”లని స్పీచ్ దంచేసింది. శ్రీస్వామివారు తమకు అమ్మతో గల అనుబంధం గురించి చెప్తూ 50 సం॥ క్రితం అమ్మ మీద వారు వ్రాసిన ‘అంబికా సాహస్రి’లో పద్యం చదవటం, వారి అనుగ్రహభాషణ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!