అమ్మ దయవల్ల మా పిల్లలందరూ చక్కగా సెటిల్ అయ్యారు. మా చిన్న అల్లుడు ఆదిత్య గంజూగారు ‘అబుదాబీ’ లోని వోల్టాస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మా మనమరాలు గీత కోసం స్కూలుకు దగ్గర్లో దుబాయిలో మంచిప్లాటు తీసుకొని అందరూ హాయిగా వుంటున్నారు. ఆదిత్య గారు ఆఫీసుకు రోజూ బస్సులో వెళ్ళివస్తున్నారు. మా పెద్ద అమ్మాయి అనూరాధ కూడా దుబాయిలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది. మాధవి మమ్మల్ని దుబాయి తప్పక తీసుకు వెళ్ళాలని ఎంతో పట్టుపట్టింది. నేను ససేమేరా రానన్నాను. మొదటి కారణం మందిరంలో మూడు పూటలా నివేదనలు పూజలు, ఎవరు చేస్తారని, ఎవరికైనా పురమాయిస్తే సరిగా చేస్తారో లేదో అన్న అనుమానం.
అంత ప్రేమగా ప్రామిస్ చేసి అమ్మ మందిరంలో వచ్చి కూర్చుంటే ఎలా వదిలి వెళ్ళగలం. రెండోది ఈ వయస్సులో వెళ్ళి ఏమి ఆనందించగలము ? రానని భీష్మించుకు కూర్చున్నాను. 2011 నవంబరులో ఇండియాకు వచ్చిన మాధవి వున్న నాలుగు రోజులూ మందిరంలో ప్రదక్షిణాలు చేసి అమ్మ పాదాలుగట్టిగా పట్టుకొని మా అమ్మా నాన్నలను ఒక నెలరోజులు దుబాయిలో వుంచమని వేడుకుందిట. వెళ్ళేటప్పుడు మరీ మరీ అడిగింది. పాస్ పోర్టు కోసం తిప్పలు పడటం. హైద్రాబాద్ ఎయిర్ పోర్టులో పడి కాపులు నావల్ల కాదని ఖరాఖండిగా చెప్పాను. మా కంపెనీలో పనిచేస్తున్న రిప్రజంటేటివ్ శ్రీనివాసుకు పాసు పోర్టు వ్యవహారం చూడమని అప్ప చెప్పింది. అతనికి పాస్ పోర్టు ఆఫీసులో మంచి పలుకుబడి ఉంది. శ్రీనివాసు వచ్చి అప్లికేషన్స్ తెచ్చి మా చేతపూర్తి చేయించి తీసుకు వెళ్ళాడు.
ఇంక “అమ్మవారు” మా అమ్మాయి మొర ఆలకించి విజృంభించింది. సరిగా నెలరోజులు కాకుండా నా భార్య కుసుమ పుట్టినరోజునాడు ఎయిర్పోర్టు ఆఫీసులో అపాయింట్మెంట్ రావటం, వారం రోజుల కల్లా పాస్ పోర్టులు వచ్చేశాయి. మా అమ్మాయి వీసా, టిక్కెట్లు పంపిస్తానని ఫోన్ల మీద ఫోన్లు. ఇప్పుడే కాదు మందిరంలో ఏర్పాటు చేసుకున్నాక వస్తామని సరిపుచ్చుకుంటున్నాము. అమ్మవారి ఇంకో చమత్కారం. మార్చి 25 తేదీనుంచీ దుబాయికి విశాఖ నుంచీ డైరెక్టు స్ట్రెయిట్ సర్వీసు ప్రారంభమవుతుందని సమాచారం. అంతా సంబరపడిపోయారు. నేను దొరికి పోయాను.
మా మాధవి దగ్గర నుంచీ ఫోన్లపైన ఫోన్లు వస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి. మార్చి నెలరానే వచ్చింది. కానీ కుసుమ మార్చి 28న అమ్మ జన్మదిన వేడుక తరువాతే వస్తామని చెప్పింది. దానితో ఏప్రిల్ 4వ తేదీ నుంచీ 14వ తారీఖు వరకూ పదిరోజులు వుండటానికి ఒప్పుకున్నాము. ఈ లోపల సరళ అక్కయ్య కూతురు మాధవి గజపతి నగరం వెళ్తూ అమ్మదర్శనార్థం మందిరానికి వచ్చింది. వాళ్ళది ఒక ఆదర్శ కుటుంబం. అమ్మే సర్వం పిల్లలకి పెద్దలకి ప్రతినెల ఎవరి జీతం వాళ్ళు తీసుకువచ్చి అమ్మ ఫోటో ముందు పెట్టి అమ్మ ఇచ్చినట్లుగా వారికి వారు ఖర్చు పెట్టుకునేవారు. అంతా అమ్మ ప్రసాదం అని వారి భావనా భక్తి. తాను తిరిగి ఏప్రిల్ 17కు అబుదాబీ వెళ్తానని అప్పటి వరకూ వుండమని మరీ మరీ బ్రతిమలాడింది. అదీ వాళ్ళ ప్రేమ, అంతా అమ్మకే వదిలేసాను.
నాకు వెళ్ళాలని ఏ మాత్రం ఉత్సాహం లేదు. కుసుమకు మాత్రం చాలా హుషారుగా వుంది. ఈ లోపల శ్రీ బులుసు సత్యనారాయణ శాస్త్రిగారు సద్గురు శివానంద మూర్తిగారిని వారి గురుకులాశ్రమానికి ఆహ్వానించటానికి భీమిలీకి వెళ్తూ నన్ను లక్ష్మీపతిగారిని తోడు రమ్మంటే భీమిలి వెళ్ళాము. అక్కడ గురువుగారితో నా దుబాయి ప్రయాణం గురించి, అమ్మను విడిచి ఇద్దరం వెళ్ళడం అమ్మకు సరిగా సేవలు జరుగుతాయో లేదో అని భయంగా వుందని నా గోడు వెళ్ళబోసుకున్నాను. దానికి గురువుగారు వెంటనే “దుబాయిలో అమ్మ లేదా పిల్లలు పిలిస్తే వారి దగ్గరకు తప్పక వెళ్ళాలని ప్రోత్సహించారు. అంతా అర్థమైపోయింది. ఈ కథ నడిపించేది అంతా అమ్మగారేనని నిశ్చింతగా దుబాయి వెళ్ళటానికి సిద్ధమైపోయాను.
ఏప్రియల్ 4వ తారీఖు రానే వచ్చింది. సాయంత్రం 5.40కి ఫ్లైట్ సమయం. మధ్యాహ్నం 3 గంటలకు అమ్మ దర్శనం చేసుకొని ఎయిర్పోర్టుకు వెళ్ళాము. మా అబ్బాయి రాధాకృష్ణ, రిప్రజంటేటివ్ శ్రీనివాసు మురళి వచ్చారు. కారు దిగగానే ఎవరో పోర్టర్ ఎదురు వచ్చి లగేజ్ లోపలకు తీసుకు వెళ్ళాడు. పేపర్స్ మావాళ్ళ చేత దింపించి మమ్మల్ని ఏ శ్రమా లేకుండా ప్లైయిట్ ఎక్కించాడు. రాత్రి 11 గంటలకు దుబాయి చేరాము. అమ్మ దయ అపారం. మా పెద్ద అమ్మాయి అనూరాధకు మార్చి 15న రావల్సిన వీసా సరిగా మేము బయలుదేరిన ఏప్రిల్ 4వ తేదీకే రావటం అనూహ్యం. అందులోనే మేము ఎక్కిన విమానంలోనే తాను హైద్రాబాద్ లో మాతో కలిసింది.
మేము దుబాయి వెళ్ళేటప్పటికి ప్లకార్డులతో. ఒక అమ్మాయి వచ్చి అక్కడి ఫార్మలిటీస్ పూర్తి చేసింది. అతిసులువుగా 15 నిమిషాలలో బయటకు వెళ్ళిపోయాం. దుబాయిలో ఉన్న రెండు వారాలు ఎలా గడిచాయో తెలియదు. ఆశ్చర్యం ఒక ఎడారి అతి సుందరమైన మహానగరంగా మలచబడింది. అక్కడ కరెంట్ పోవటమనే మాటే లేదు. సముద్రపు నీటిని శుభ్రపరచి వాడుకకు వాడుతారు. ఎక్కడికి వెళ్ళినా ఎ.సీ.లే. ఏమీ లేని ఆదేశంలో విమానాల్లో మట్టి తీసుకు వెళ్ళి పచ్చదనాన్ని పెంపొందిస్తుంటే మనకు నేలా, నీరు అన్నీ వుండి కూడా మనకు అన్నీ కొరతే. బుర్జు వీసా 147 అంతస్థులు. అది ఎక్కితే దుబాయి మొత్తం కనిపిస్తుంది. హిస్టోరికల్ ప్లేస్ ఎలా వుండేదో ఎడారిగా ఇప్పటి సుందర ప్రదేశాన్ని టెలిస్కోప్లో చూచి ఆశ్చర్యపోయాము. మనలో లోపం ఎక్కడ వుంది? 18వ తారీఖు తిరుగు ప్రయాణం. 17వ తారీఖు సరళ అక్కయ్య కూతురు అబుదాబీ రమ్మని బ్రతిమలాడింది. ఈ మాటు తప్పక వస్తానని ఒప్పించాను. ఆ పిల్లకు అమ్మ బిడ్డ లాంటివారం. 19వ తేదీకి తిరిగి వచ్చేశాం. అంతా ఒక తీయటి కల. వెళ్ళటానికే మనస్కరించని నాకు కొత్త ఉత్సాహం. అమ్మ పరిపూర్ణానుగ్రహం. ప్రతిక్షణం మన వెంటే వుండి మన బాగోగులు చూసుకునే ఆ తల్లి గురించి ఇంతకంటే ఏమి ఉదాహరణ కావాలి.
ముఖ్యంగా మేము 15 రోజులు సంతోషంగా, సుఖంగా ఉండగల్గటానికి ముఖ్యకారకులు రాజేష్, కరుణ. విశాఖలో గుడికి ఉదయం సాయంత్రం రాజేష్ వెళ్ళేవాడు. మధ్యాహ్నం, సాయంత్రం కరుణ వెళ్ళేది. దుబాయి నుంచి కూడా మాట్లాడుతుండేవాళ్ళం. వీళ్ళే కాక పార్వతి, విజయలక్ష్మి, మురళి ప్రతి సాయంత్రం అమ్మ మందిరంకు వచ్చేవారు. సత్యనారాయణ రాజుగారు, లక్ష్మిగారు వాళ్ళు తరచూ వస్తూ మాకు మందిరం గురించిన బెంగ లేకుండా చేసారు. అమ్మ కరుణా కటాక్షాలు వారందరి మీద ప్రసరించాలని అమ్మనే వేడుకుంటున్నాను.