అమ్మ అన్ని సుఖాలు మనకు ఇచ్చి తాను ఒక్కతే విగ్రహరూపంలో పెద్దవాల్తేరు అశోక హౌస్ లో ఒక చిన్న మందిరం ఏర్పాటు చేసుకొని రాత్రింబవళ్ళు వేలాదిమందిని అనుగ్రహించి బాధల నివారణ చేస్తూ సకల కోర్కెలూ నెరవేరుస్తోంది. కంపెనీ ప్రొప్రైటర్ కాలం చేశాక అన్నదమ్ముల ఆస్తి పంపకాల విభేదాలతో ఇక్కడ ఆఫీసు మూసివేసి చక్కటి బిల్డింగ్ను సర్వనాశనం చేసుకున్నారు. ‘అమ్మ’ మాత్రం ఒక మూల మందిరంలో నవ్వుతూ కూర్చుని మనని అనుగ్రహిస్తోంది. గత రెండు ఏళ్ళగా పెద్దవాడు నీళ్ళు, కరెంటు మందిరంకు ఇవ్వనని, వేరే ఏర్పాటు చేసుకోమని కబురు పంపుతూ మానసిక బాధలకు గురిచేస్తూ వచ్చాడు.
మానవుడు భగవంతుణ్ణి రక్షించగలడా ? అమ్మకే వదిలేశాం. నిన్ను నువ్వే కాపాడుకోవాలని నమ్ముకున్నాం. అమ్మ సర్వశక్తిమయి కదా ! నేను జనవరిలో మా సోదరులతో కలసి దక్షిణదేశ యాత్రలకు వెళ్ళిపోయాను. నేను ఫిబ్రవరిలో తిరిగి వచ్చేలోగా అమ్మ విజృంభించింది. ఆ ఆస్తి అశో` పేరుతో వుండటంతో అతను వచ్చి టాక్సీలు అన్నీ కట్టేసి పాత తాళాలు పగలుకొట్టేసి కొత్త తాళాలు వేసి ఈ ఆస్తి నాది అని బోర్డు రాయించి, నన్ను ప్రేమతో ఆహ్వానించి, ఆ తాళాలు నా చేతిలో పెడ్తూ నన్ను నమ్మలేని, ఆనందములో ముంచెత్తేశాడు. మతిపోయింది. అమ్మా! ఏమిటీమాయ. అర్థం కాలేదు. పెద్ద భారం దిగిపోయింది. త్వరలో బిల్డింగ్ అమ్మాలో, రిపేర్ చేయించి అద్దెకివ్వాలో నిర్ణయిస్తామని చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నై నుంచీ ఫోను. మార్వాడీవాళ్ళు కొంటారని, మందిరం మాత్రం వుండకూడదట.. నా గుండెల్లో రాయిపడింది. ఇంతలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు ఇచ్చిన భరోసా గుర్తుకు వచ్చింది. అటువంటి పరిస్థితి వస్తే నా స్వహస్తాలతో పునఃప్రతిష్ఠ చేస్తానని. కొండంత ధైర్యం వచ్చింది. నిర్ణయం ఆ బిల్డింగ్ వారిదేనని చెప్పాను. ఎందుకంటే లోపించేది ఆవిడేకదా! క్రిందటి నెలలో మళ్ళీ వచ్చారు. మా ఆలోచన మార్చుకున్నాం. మొత్తం రిపేరు చేయించి అద్దెకి ఇస్తాం. నిర్ణయం జరిగిందని చెప్పారు. నాకు అర్థం అయింది. వాళ్ళ బుర్రను అమ్మ రిపేరు చేసిందని.
దసరా పండుగల తరువాత బాగు చేయించాలని నిర్ణయించుకొని 20వ తారీఖున వచ్చి రిపేర్లు చేయటం మొదలు పెట్టారు. అంతా ఒక మాయ. మనందరికీ అనుభవమే కదా అమ్మ మాటలు, చేష్టలు. “మునగండిరా! నిండా మునగాక తీసి బయటపడేస్తాను” అన్న మాటే గుర్తుకు వస్తుంది. చేతిలో చేయి వేసి వైజాగ్ వస్తానని ప్రామిస్ చేసి మా స్వహస్తాలతో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకొని కూర్చుంది. ఎంత అదృష్టవంతులమో ! ఈ ఆరునెలల్లో అనేక ఆశ్చర్యకరమైన వింతలు – విశేషాలు. వచ్చే నెల ఇంకా ఎన్నో.