1. Home
  2. Articles
  3. Viswajanani
  4. క్షణక్షణం అనుక్షణం

క్షణక్షణం అనుక్షణం

A. S. Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : January
Issue Number : 6
Year : 2014

అమ్మ “అందరికీ సుగతే” అని ప్రకటించింది. నమ్మినవారిని, నమ్మనివారిని, కొలిచినవారినీ, కొలవనివారి నీ అందర్నీ తన బిడ్డలలా ఆదరించింది. అనుగ్రహిస్తోంది. దాంట్లో లోపం ఉండదు. అమ్మ తరుణం రావాలని అంటుంది. ఆ తరుణం చూసుకొని మరీ అనుగ్రహిస్తుంది. మనం మాత్రం సహనంతో వేచి చూడాలి. ఆ పాదాలను ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ప్రతిఫలం. మరి హైమక్క అలా కాదు. అతిసున్నితమైనమనస్సు గట్టిగా పది నిమిషాలు నామం చేస్తే వచ్చి వాలి మనల్ని గట్టెక్కిస్తుంది.

హైమక్క జన్మదినం వైజాగ్ మందిరంలో నవంబరు 18న హైమక్క వ్రతం జరుపుకోవటం ఆనవాయితీ. ఆ రోజు శెలవు దినం కాకపోయినా అనేకమంది హాజరయి హైమక్క వ్రతం చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి పండుగ మా మందిరంలో జరుపుకుంటాం. అనేకమంది · కొత్తవాళ్ళు, పాతవాళ్ళు కూడా వస్తూ అమ్మ, హైమక్కల దయకు పాత్రులు అవుతారు. ఆది నుంచీ ధాన్యాభిషేకానికి విశాఖ నుంచి అనేకమందిమి జిల్లెళ్ళమూడి వస్తుంటాము. అమ్మ “నాన్నగారి ఆరాధనోత్సవం విశాఖ సోదరులదని” ప్రకటించింది.

శ్రీ దాట్ల సత్యన్నారాయణరాజుగారు, వారి బంధువులు అనేకమంది ధాన్యాభిషేకంకు తప్పక వస్తుంటారు. ఆయన ‘నావీ’లో పనిచేశారు. అక్కడ పనిచేసేవారిని స్నేహితులను తీసుకు వస్తుండేవారు. వారిలో అచ్చం నాయుడుగారు వృత్తిరీత్యా టైలర్. ఆయన విశాఖమందిరంలో ఫంక్షన్స్కు వస్తుంటారు. ఆయన కుమారుడు బి. ఫార్మసీ పాసయినాడు. జూన్ 12న అన్నాభిషేకంకు వచ్చాడు. అతని పేరు భానోజిరావు. బి. ఫార్మసీ అయింది కదా ఎమ్. ఫార్మసీ చదవమని సలహా ఇచ్చాను. ఆర్థిక స్థోమతలేనందున మా కంపెనీలో ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. అతనికి ఆ అవకాశం కల్పించమని ‘అమ్మనే’ ప్రార్థించాను. ఆ అబ్బాయికి ధైర్యం చెప్పాను. ఎక్కడైనా ఉద్యోగం చూద్దామని. సరిగా 6 నెలలు కూడా తిరగకుండా అమ్మ అనుగ్రహ వర్షం కురిపించింది అతని మీద. అనకాపల్లిలో పనిచేసే మా కంపెనీ రిప్రజెంటేటివ్ మానేశాడు. మంచి కుర్రాడికోసం వెతుకుతున్నామని మా అబ్బాయి రాధాకృష్ణ చెప్పాడు.

సత్యనారాయణ రాజుగారు మా ఆఫీసుకు వచ్చి మాటల సందర్భంలో మా అబ్బాయికి గుర్తుచేసాడు భానోజీరావు గురించి. వెంటనే అతన్ని పిలిపించారు. అతని వినయము, నమ్రత చూచి, అంతా సంతోషించి వెంటనే చేరమన్నారు. ఇది అంతా అమ్మ అనుగ్రహం కదా! మా విశాఖ మందిరంలో అలా చక్కగా నవ్వుతూ కూర్చుని అనేకమందిని వారి అర్హతల బట్టి అనుగ్రహిస్తోంది. కొలిచిన వారికి కొంగుబంగారమే మన అమ్మ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!