అమ్మ అవ్యాజకరుణామూర్తి, సర్వశక్తిమయీ, సర్వమంగళ, సద్గతిప్రదా అని మనందరికీ తెలిసిన విషయమే. అమ్మ తరుణం రావాలి అంటుంది కాలస్వరూపిణి అమ్మ. ఆ తరుణం కూడా ఆమె అనుగ్రహమే కదా! గత 40 సం॥లుగా అజీర్ణవ్యాధితో బాధపడుతున్నాను. కడుపు పొంగిపోతుంది. ఏమి తిందామన్నాభయమే. కాన్సర్ అనుకొని భయపడ్డాను. అమ్మ దగ్గర వాపోయాను. అమ్మ అన్నం ముద్దలు కలిపిపెట్టింది. కాన్సర్ కాదు నాన్నా! అంటూ పొట్టమీద చేతితో రాస్తూ యాసిడ్ నాన్నా అవి నిర్ధారించింది. అప్పటి నుంచీ తిరిగేస్తున్నాను కానీ, పూర్తిగా బాధనివారణ అయిందని చెప్పలేను.
2013 నవంబరులో మా బావమరిది అన్నంరాజు మురళీకృష్ణ కూతురు హైమ వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ చూడటానికి పిల్లలలు, ఆయన ఫ్రెండ్సు వచ్చారు. వాళ్ళంతా హోటల్లో దిగినా నేను మా కుసుమత్త దగ్గరే వుంటానని మా ఇంట్లోనే దిగింది. ఇంక పనేముంది. అమ్మ గురించి కబుర్లు. అందులోనే ఆరోగ్య విషయం గురించి చర్చ. నేను నాకు తెలిసిన హోమియోపతి, అలోపతి గురించి చెప్పాను. హైమ అప్పుడు మనం నిత్యం వంటల్లో వాడుకునే సరుకులతోనే వేయించి పొడిచేసుకొని రాత్రి ఒక చెంచాడు. మజ్జిగలో కలిపి త్రాగితే మలబద్ధకం లేకుండా హాయిగా వుంటుందని చెప్పింది. అలా తాగి చూద్దాం. ఎలాగో అనేకం వాడం అందులో ఇది ఒకటని అనుకున్నాను. వెంటనే కుసుమ ఆ పౌడర్ తయారు చేయించింది. తాగటానికి చాలా బాగుంది. రెండు మూడురోజుల్లో గుణం కనిపించింది. జీర్ణశక్తి పెరిగింది. మలబద్ధకం తగ్గింది. ఓపిక, ఉత్సాహం పెరిగింది. ఈ సంగతి చాలామందికి చెప్పాను. వారంతా వాడి సంతోషపడ్డారు. నాలాంటి వారు అనేకమంది ఈ సమస్యతో బాధపడేవారు వున్నారు. కొంతమందికైనా ఉపకారం జరుగుతుందని వ్రాస్తున్నాను.
ఆ పౌడర్కు కావలసిన దినుసులు : 1) సోంపు -100గ్రా, 2) వాము 100 గ్రా 3) జీలకఱ్ఱ-100 గ్రా 4) మెంతులు -25 గ్రా 5) మిరియాలు -25 గ్రా రెండు దోసిళ్ళ కర్వేపాకు, కర్వేపాకు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ముందుగా మెంతులు సగపడవేగాక వాము, సోంపు, జీలకఱ్ఱ వేసి వేయించి, మిరియాలు, కర్వేపాకు వేసి వేయించాలి. అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఆ పౌడరును మజ్జిగలో 1 చెంచా కలుపుకుని తాగాలి. చాలా బాగుందా షుగర్ వ్యాధిగ్రస్తులు మెంతులు ఎక్కువ వేసుకోవచ్చు.
నిత్యం ఏదో ఒక సమస్య వెంటనే పరిష్కారాన్ని కూడా సూచిస్తుంటుంది అమ్మ. “బాధలు లేని జీవితం వ్యర్ధము” అని చెప్పనే చెప్పింది కదా ! కానీ ప్రతి క్షణం మన వెంటనే వుండి మన్ని రక్షిస్తూనే వుంటుంది.