1. Home
  2. Articles
  3. Viswajanani
  4. క్షణక్షణం – అనుక్షణం

క్షణక్షణం – అనుక్షణం

A. S. Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 12
Year : 2014

అమ్మ కళ్యాణం విశాఖలో మే5న అతివైభవంగా జరిపించుకున్నది. సూర్యనారాయణ (పూర్వ విద్యార్థి) భక్తిశ్రద్ధలతో అమ్మ కళ్యాణాన్ని నిర్వహించిన తీరు అమోఘం. జూన్ 12 అన్నాభిషేకం కూడా అశోక్ హౌస్ లో జరపాలని తీర్మానించుకున్నాము. మరో పక్క నిరుత్సాహం. గత కొంతకాలంగా మంచి వార్తలు లేవు. కాలం మనకు అనుకూలంగా లేదు. ఉత్తరాంచల్ వరదల్లో భక్తులు కొట్టుకుపోవటం నిన్నకాక మొన్న హిమాచల్ ప్రదేశ్లో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. నా మరదలు రాజ్యలక్ష్మి అమ్మలో కలసిపోయింది. ఈ మధ్యన రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యను తనలో కలిపేసుకుంది.

మే5న అమ్మకళ్యాణోత్సవానికి వచ్చి వడ్డన చేసి అమ్మ ప్రసాదం స్వీకరించిన ఎ రవిబాబు ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ మా కుసుమ కొలీగ్ అమ్మ ప్రసాదం తీసుకొని వెళ్ళారు. అదే చివరి భోజనమయింది. సడన్ హార్టు ఎటాక్ వచ్చి 6వ తారీఖు ఆసుపత్రిలో చేరి 7వ తారీఖున అమ్మలో కలిసిపోయారు. వాళ్ళ పెద్ద అమ్మాయి సత్యవతి పెళ్ళి ఏదైనా పుణ్యక్షేత్రంలో చేయమని సద్గురు శివానందమూర్తిగారు చెప్పారు. తిరుపతిలో చేస్తామన్నా జిల్లెళ్ళమూడిలోనే పెళ్ళి జరిపించుకున్న అదృష్టవంతురాలు. వారి కుటుంబమంతా అమ్మభక్తులే. అనాయాసంగా దేహం వదిలి వేయటం అమ్మ అనుగ్రహమే కదా!

  జూన్ 12న అన్నాభిషేకం మా విశాఖ మందిరంలో ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. సరిగ్గా అదే రోజు మా మనవరాలు స్ఫూర్తి నిశ్చయ తాంబూలాలు. పెళ్ళి వారు 11 మంది వస్తామన్నారు. మా తరపున 11 మంది వుండాలన్నారు. అదేరోజు మందిరంలో అన్నాభిషేకం, 12వ తారీఖు 11-30 ని.లకు నిశ్చయ తాంబూలాలు. ఎలా జరుగుతుందో అని చాలా వర్రీ అయ్యాము. అమ్మ ప్రతి నిమిషం మన వెనకాలే వుండి జరిపిస్తుందనటానికి ఆ రోజు కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి.

ఉదయం 9-30 కల్లా నేను, కుసుమ, మా బావమరిది అన్నంరాజు మురళి అతని భార్య శశి, మా మరదలు వసంతా మందిరంకు వెళ్ళి శ్రీ సూక్తంతో అమ్మ పంచలోహ విగ్రహానికి అభిషేకం చేసుకొని వచ్చాము. ఆ తరువాత సర్వశ్రీ పల్లంరాజుగారు, ప్రొఫెసరు కామేశ్వరరావు గారు, రాధగారు, గంటి వెంకట సుబ్బారావు గారు శ్రీ సూక్తంతో అమ్మను అభిషేకించుకున్నారు. దాదాపు వందమంది దాకా ఆ అభిషేకంలో పాలుపంచుకొని అమ్మ ఆశీశ్శులను పొందారు. మందిరంలో కరుణ, విజయలక్ష్మి, పార్వతి, కామేశ్వరి గారు, సుబ్బారావు, చైతన్య చక్కగా ఫంక్షన్ నిర్వహించారు.

ఆ రోజు మరో విశేషమేమిటంటే మా మనవరాలు స్ఫూర్తి నిశ్చయ తాంబూలాలు. పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకు అమెరికాలో ఉన్నారు. పెళ్ళి కూతురు తల్లి మా అమ్మాయి, అల్లుడు దుబాయిలో వున్నారు. పెళ్ళివారు హైద్రాబాద్ నుంచి ఐదుగురు, వైజాగ్ లోని వారి బంధువులు 6 గురు వచ్చారు. ఈ కార్యక్రమం అంతా మా అబ్బాయి రాధాకృష్ణ ఇంట్లో వైభవంగా జరిగింది. అటు మందిరంలో అన్నాభిషేకం, ఇటు తాంబూలాలు అంతా మన సూర్యనారాయణ అద్భుతంగా జరిపించాడు. అమ్మ అనుగ్రహానికి తార్కాణమే పై జరిగిన సంఘటనలు.

కుసుమ 6 నెలలుగా మందిరానికి వెళ్ళలేక పోతున్నానని చాలా ఆవేదన చెందుతోంది. ఒక మాటు అమ్మ భ్రమరాంబక్కయ్యతో “మీ దంపతులు కుసుమా వాళ్ళింటికి వెళ్ళండి, లేదా వారిని మీ ఇంటికి పిలవమన్నద”ని భ్రమరాంబక్కయ్య చెప్పింది. దాని ఆవేదనను దూరం చేయటానికి అన్నట్లుగా శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, శ్రీ వల్లీ ఇద్దరూ వచ్చి రెండు గంటల సేపు అమ్మ కబుర్లు చెప్పుకున్నారు. దానితో కుసుమలో నూతనోత్సాహం చోటు చేసుకుంది. ముందుగా లలితాపీఠంలో స్వామివారి ఆశీస్సులు తీసుకొని మా మనవరాలి పెళ్ళి శుభలేఖ స్వామి వారికి అందచేసి ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చింది. ముందురోజు దాని ఆవేదనను దూరం చేయటమే కాక స్వామివారి ఆశీస్సులు ప్రసాదింపచేసింది ‘అమ్మ’. అమ్మ అనుగ్రహానికి అంతూదరీ లేదు. దయామయి. ఆనందం – పరమానందం. బ్రహ్మానందం – క్షణక్షణం టెన్షన్. అంతలోనే అనుగ్రహం. జయహోమాతా.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!