అమ్మ అనుగ్రహం వల్ల క్రిందటి నెల మా మందిరంలోని అమ్మకు, అన్నాభిషేకం చాలా తృప్తిగా ఉత్సాహంగా జరుపుకున్నాం అందరమూ. కాలువిరిగి 6 నెలలు అవుతున్నా పూర్తిగా కోలుకోలేకపోతున్నానన్న బెంగ నా భార్యకు ఎక్కువ అవుతోంది. అటు అన్నాభిషేకం ఇటు మా మనుమరాలి నిశ్చితార్థం తృప్తిగా జరిగాక కొంత ధైర్యం వచ్చింది. బాధలు కూడా అమ్మ అనుగ్రహమే కదా! అని అమ్మ మీదే భారం వేసి జీవనం సాగిస్తున్నాము. పి.యస్.ఆర్. అన్నయ్య వచ్చి ధైర్యం చెప్పటం, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, శ్రీ వల్లి వచ్చి అమ్మ కబుర్లు చెప్పుకోవటంతో కొండంత ధైర్యం వచ్చింది కుసుమకు.
ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం గారు ఫోనుచేసి కుసుమతో మాట్లాడినప్పుడు “ఎవరో రక్షణ అంటే ఏమిటి? అని అమ్మను అడిగారట. దానికి అమ్మ “కంట్లో గుచ్చుకోవల్సిన ముల్లు కాల్లో గుచ్చుకోవటం” అని చెప్పిందని చెప్పారు. నిజమేకదా ! ఆపడ్డప్పుడు తలకు తగిలినా, లేదా వెల్లకిలా తలాపడితే వెన్నుముకకు తగలకుండా పక్కకు పడటంతో తొడ దగ్గరక ఎముకలు విరిగాయి. ఆపరేషన్ చేసి ఐదుశీలలు, ఒక రాడ్ వేశారు. ఇది అమ్మ అనుగ్రహమే కదా ! అప్పుడు చూసిన వారంతా ఇంక మంచంలోనే వుండవలసి వస్తుందను కున్నారు. అలాంటిది స్టిక్ పట్టుకు నడవగలగటం అమ్మదయే కారణం. కుర్తాళంలో స్వామివారి ఆశీస్సులు కూడా లలితపీఠంకు వెళ్ళినప్పుడు అందుకున్నది. అప్పటి నుంచీ మందిరంకు ఉదయం వెళ్ళి పూజ చేసుకొని మహానివేదన చేసి వస్తోంది. జులై 11 రాత్రి శుక్రవారం, రాత్రి గల పౌర్ణమి అవటంతో 6 నెలలుగా పూజకు రాలేని కుసుమ గురుపౌర్ణమి పూజకు రావాలనుకుంది.
కానీ శుక్రవారం పొద్దున్న నుంచీ వర్షం మొదలైనది. కరెంట్ లేకపోతే లిఫ్టు వుండదు. కుసుమరావటం అసంభవం. అమ్మ మీదే భారం. సాయంత్రం సరిగ్గా 5-30 గం. వర్షం తెరిపి ఇచ్చింది. హాయిగా మందిరం చేరిపోయాము. గురుపౌర్ణమినాడు సాయమ్మగారి తిధి రెండు సంవత్సరాలు వాళ్ళ కోడలు వచ్చి ప్రసాదాలు చేయించి పంచమని, మా అత్తగారికి అమ్మ అంటే చాలా ఇష్టమని చెప్పి 500/- ఇచ్చి వెళ్ళారు. ఒక మారు భార్యాభర్తలు వచ్చి అమ్మకు పూజ చేసుకువెళ్ళారు. వారికి అమ్మప్రసాదం, బట్టలు పెట్టటం జరిగింది. ఆ తరువాత వాళ్ళు రాకపోయినా కుసుమ, లక్ష్మిగారు ప్రసాదాలు చేసి ఆమె పేరు చెప్పి పంచుతూనే ఉన్నారు.
ఈ మారు ఆంధ్రాబ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన పి.కె. మాణిక్యం గారు పులిహోర తీసుకు వచ్చానని ఫోను చేసారు ప్రత్యేకంగా. అందుకని కుసుమ పూర్ణపుబూరెలు చేయించింది. లక్ష్మిగారు అప్పాలు తెచ్చారు. ఇంకొకరు కోవాబిళ్ళలు తీసుకురావటం సంభవించింది. మాణ్యికం గారికి కాలు ప్రాబ్లమ్తో కర్రలు పట్టుకొని ఆమె, కుసుమా ఇద్దరూ వచ్చారు. వర్షానికి బయట వరండా రేకులు లోంచి నీరు కారి మందిరంలో కొంతభాగం తడుస్తూనే వుంది. అందరూ కూర్చుని పూజ మొదలు పెట్టగానే మళ్ళీ భారీ వర్షం మొదలైంది. కరెంటు పోయింది. మందిరంలో ఇన్వర్టర్ వుండటంతో అన్నీ లైట్లు వేసుకొని పూజ పూర్తి చేసుకున్నాం. · చుట్టూ చిమ్మ చీకటి. వర్షం ఆగాలి, కరెంటు రావాలి. ఇదో పెద్ద సమస్య. నేను పూజ జరుగుతున్నంత సేపు ఆపద్బాంధవి హైమక్కనే ప్రార్థిస్తున్నాను. పూజానంతరం అమ్మనామం, హైమక్క నామం సి.డి. పెట్టాము. సరిగా హైమక్క నామం మొదలవటం, వర్షం తగ్గటం, కరెంటు రావటం ఒకేసారి జరిగింది. హాయిగా ఇళ్ళకు చేరుకున్నాం. ఇదంతా అమ్మ అనుగ్రహ వర్షంకాక మరేమిటి? క్షణక్షణం మనవెంటే వుండి మన జీవితాలను నడిపిస్తోంది కదా ! చింత ఏలమనకు అమ్మ చెంతనుండగ
మర్నాడు మధ్యాహ్నం గురుపౌర్ణమి అని రామరాజు గారు, భార్యవచ్చి వాళ్ళ వియ్యపురాలు అన్నపూర్ణాలయంకు ఇవ్వమన్నారని చెప్పి పదివేల రూపాయిలు ఇచ్చారు. ముందురోజే పూజ అయినందున ప్రసాదం కూడా వారికి అందజేయటం జరిగింది. గురుపౌర్ణమిరోజు ప్రసాదాలు ‘ దండిగా రావటం, అంత వర్షంలో పూజకు అందరూ రావటం కుసుమకు బాగా ధైర్యం వచ్చి ఉదయమే కాదు, సాయంత్రం కూడా వారం వారం పూజలకు వస్తానని వస్తోంది. కర్ర సాయం లేకుండా కొద్ది కొద్దిగా నడవటం ప్రారంభించింది. కుసుమ. మరి ఇదంతా అమ్మ హైమల పరిపూర్ణ కటాక్షం. మనందరం ఎంత అదృష్టవంతులమో !