జిల్లెళ్ళమూడి అమ్మ ఆలయంలో ఆగష్టు 17న అనసూయ వ్రతం చేసుకొని 18వ తారీఖు వైజాగ్ తిరిగి వచ్చాము. పి.యస్.ఆర్. అన్నయ్య చదివిన వ్రతకథలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసాయి. ఆ మత్తువదలటానికి 2 రోజులు పట్టింది. 21వ తేదీ మా అమ్మయిల దుబాయి వెళ్ళిపోయారు. మా మనవరాలు రాజేష్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు. ఈ లోపల వాతావరణంలో మార్పులు, భారీవర్షాలు. మా మందిరం వరండాలో రేకులు పాతవైపోయాయి. గట్టిగా వర్షం పడితే మందిరంలోకి నీళ్ళు వచ్చేస్తాయి. పటిష్ఠంగా వేయించటానికి 17వేల రూపాయలు అంచనా. డబ్బు అమ్మే తెచ్చుకుంటుందని ధైర్యం చేసాను. ఆ పనిపూర్తి అవటానికి 15రోజులు పట్టింది.
ఈ లోపల అమ్మ భక్తురాలు కీ.శే. సీతాదేవిగారి పెద్ద అమ్మాయి తమ పెద్ద కూతురు సంధ్య హైద్రాబాద్ నుంచి తను అనుకున్న పనులు జరిగాయని అమ్మకు 10 వేల రూపాయలు మన గుడికి అని తీసుకు వచ్చి ఇచ్చింది మిగిలిన డబ్బు వేసి సునాయాసంగా పనులు చేశాము. ఇది మెరికిల్ కాక మరి ఏమిటి ? సెప్టెంబరు 13 మీటింగ్కు తప్పక రావాలని రవి అన్నయ్య మరీ మరీ చెప్పాడు. మేము పెద్దవాళ్ళమై పోయాం. యువతరం రావాలని ఏకా రాజేష్, అతని భార్య సత్యను మా అధ్యయన పరిషత్ తరఫున పంపించాము. వాళ్ళు అక్కడి ఆదరణ, వాత్సల్యం చూసి ముగ్ధులైపోయారు. అప్పుడు పి.యస్.ఆర్.అన్నయ్య రాజేష్ ముత్తాతగారైన శ్రీ ఏకా ఆంజనేయులు గారి మీద కులపతిగారు రాసిన పద్యం చదివి వినిపించారు. వారితో పాటు అంతా ఆనందాబ్ధిలో మునిగిపోయారు.
రాజేష్వాళ్ళు జిల్లెళ్ళమూడి నుండీ తిరిగివచ్చారో లేదో ఇంకొక శుభవార్త రాజేష్ కజిన్ ఏకా రాజ్యం కొడుకు నిఖిలేష్, అతను మర్చెంట్ నావీలో పనిచేస్తున్నాడు. షిప్ నుంచీ వచ్చినప్పుడు వాడుకోవటానికి కొత్త మోటారు బైకు కొనుక్కున్నాడు. మళ్ళీ షిప్ లో వెళ్ళిపోతాడు. బైక్లు వాడకుండా వుంటే పాడయిపోతాయి. నువ్వు వాడుకోమని తాళాలు చేతులో పెట్టాడు. ఇదో ‘అమ్మ’ మాయ. అమ్మకి పిల్లలమీద ఎంత ప్రేమ ! రోజూ ఉదయం రాజేష్ అమ్మకు పూజ చేసుకుంటాడు. దాని ఫలితం అమ్మచల్లగా చూస్తోంది.
రోజూ మందిరంలో సాయంత్రం లలితా సహస్రం అమ్మపాటలు పెట్టుకునే సి.డి. ప్లేయర్ చెడిపోయింది. కొత్తది 4 వేలు అవుతుంది. ఎలాగా అని ఆలోచిస్తుంటే మందిరం ఎదురుగా వున్న ప్లాట్సులో వున్న సత్యవతి అనే భక్తురాలు రూ. 500/-చేతిలో పెట్టి ఇవి కేవలం మన మందిరం ఖర్చుకే. దుర్గాష్టమి పూజకి వేరే ఇస్తానని చెప్పింది అమ్మే కొత్తది కొనమని సూచన….
కొత్తది కొనటానికి ఉద్యమించాను. దసరా పదిరోజు సాయంత్రం సామూహిక పారాయణ జరుగుతుంది. దానికి లోటు రాకుండా ప్రతి క్షణం మన వెంట ఉండి అమ్మ అనుగ్రహిస్తుంది.
మన కాలేజీ పూర్వవిద్యార్థి చిన్నం నాయుడు జవహర్ నవోదయ స్కూలులో పనిచేస్తున్నాడు. కుటుంబం వైజాగ్లో వుంటుంది వచ్చినప్పుడల్లా అమ్మా ! దగ్గరలో వేయించమ్మా అని వేడుకునేవాడు. పిల్లల పెళ్ళిళ్ళు అవి చేయాలి. ఇక్కడ వుంటే అన్నీ చూచుకోవటానికి వీలుకదా! అని అతని ఆలోచన. అమ్మ ఎవరి కోరికనూ నిరాకరించదు కదా ! ఆతనికి శ్రీకాకుళానికి ట్రాన్సఫర్ వచ్చింది. జాయిన్ అవుతున్నానని ఫోను చేసాడు. ఎంత అదృష్టవంతులమో…