1. Home
  2. Articles
  3. Viswajanani
  4. క్షణక్షణం – అనుక్షణం

క్షణక్షణం – అనుక్షణం

A. S. Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : December
Issue Number : 5
Year : 2014

మా మనుమరాలి పెళ్ళి అయిన తరువాత జిల్లెళ్ళమూడి అనసూయేశ్వరాలయంలో పి.యస్.ఆర్. అన్నయ్య అనసూయావ్రతం చేయించిన తీరు మా అందరి హృదయాలలో నిలచిపోయింది. ఆ శుభదినాన్ని మా జీవితాలలో మరపురాని, మరువలేని రోజు. మా అమ్మాయి అనూరాధ, చిన్న అమ్మాయి మాధవి మూడు సంవత్సరాలుగా దుబాయిలోనే వుంటున్నారు. మా పెద్ద అల్లుడు సీతారామ్ హైద్రాబాద్లో ఇల్లు ఖాళీ చేసి సామానంతా ఇచ్చేశాడు. వైజాగ్ ఎమ్.వి.పి. కాలనీలో అతనికి సొంత ఇల్లు వుంది. ముఖ్యమైన సామాను ఒక గదిలో పెట్టి, ఒక బెడ్రూమ్ ప్లాట్ క్రింద అద్దెకిచ్చేయాలని వైజాగ్ వచ్చాడు. తాను కూడా దుబాయి వెళ్ళి పోవాలని ప్లాను. కాని దుబాయి వెళ్ళటానికి వీసా రావటానికి రెండు, మూడు నెలలు పడ్తుందన్నారు. ఈ లోగా ఇక్కడి పనులు చక్కబెట్టుకుంటున్నాడు.

రోజూ మార్నింగ్ వాక్ వెళ్ళడం అలవాటు. అదే విధంగా ఒకరోజు బీచ్ రోడ్డులో త తో పాటు వి.ఐ.పి.లో పనిచేసిన ప్రభాకర్ గారు అతన్ని కలిసారు. మీరు ఏంచేస్తున్నారని అడిగి సంగతులు తెలుసుకొని ఒక సలహా ఇచ్చాడు. ఆయన స్నేహితుడు అమెరికాలో వుంటున్నారని విశాఖలో ఇన్కార్ అని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టారని, ఆయనకు అనుభవమున్న ఆఫీసు మేనేజర్ కావాలనీ, మంచి శాలరీ ఇస్తారని చెప్పాడు. ఖాళీగా వుండటం ఎందుకని సరే అన్నాడు ఆ సాయంత్రమే అమెరికాలో వున్న ప్రొప్రైయిటర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాడిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఖాయం చేసారు. అక్టోబర్ 6వ తారీఖు సోమవారం అపాయింట్మెంట్ ఆర్డరు రావడం. ఉద్యోగంలో చేరటం జరిగింది.

ఇంతలో అక్టోబరు 12వ తారీఖు మహాప్రళయం. విశాఖరూపురేఖలనే మార్చేసింది. అంతా అంధకారం. సరిగా ఒక నెలరోజులకు విశాఖ గాడిలో పడింది. నవంబరు నుంచీ విశాఖకు పునర్వికాసమే. చెట్లు చిగిరించటం మొదలు పెట్టాయి. జీవితాలలో కొంగొత్త ఉత్సాహం. అధికారులు, అనధికారులు, సామాన్యులు, స్థానికులు కలిసికట్టుగా పనిచేసారు. చేస్తున్నారు. సీతారామ్ ఆఫీసు బాగా దెబ్బతిన్నది. దాన్ని సరిచేసి మళ్ళీ పనులు మొదలు పెట్టేటప్పటికి నెలరోజులు పట్టింది. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు. వి.ఐ.పి.లో చేసిన అనుభవం ఉద్యోగం రావటానికి దోహదపడింది. సిన్సియర్గా చెప్పిన పని చేసుకు వెళ్ళటం అతని నైజం. అతనికి ఉద్యోగం రావటం అమ్మ దయే కారణం.

వేరేదేశంలో ఉద్యోగం వెతుక్కోవలసిన అవసరం లేకుండా విశాఖలోనే ఉద్యోగం రావటంతో మేమందరం ఎంతో ఆనందించాము. ఇది అమ్మ కరుణకాక మరి ఏమిటి?

ఇంతకీ అతని ఆఫీసు మా ఇంటి జంక్షన్లో కొత్త బిల్డింగ్ మూడవఫ్లోరులోనే. ఎంతమాయ. ఎంత ఆశ్చర్యము. 23 సంవత్సరాలు వి.ఐ.పి. లో బ్రాంచి మేనేజర్గా చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. అక్కడ ఒక్కడూ వుండటమెందుకని, వాలంటరీ రిటైల్మెంట్ పెట్టుకుని వైజాగ్ వచ్చేసాడు. అనూహ్యంగా విశాఖలోనే, మా ఇంటికి దగ్గరే ఉద్యోగం రావటం అమ్మదయే కారణం. అమ్మ చెప్పనే చెప్పింది కదా ! అనుకున్నది జరగదు. తనకున్నది తప్పదు అని. హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఆఫీసుకు వెళ్ళి వస్తున్నాడు.

శ్రీ రాజుబావగారు రాసిన అనుభవసారంలోని పాటలు ఒక దాన్ని మించి మరొకటి వుంటుంది. ఆ పాటలు రాజుబావగారి అనుభవమాలికలోని పూసలే. ఆ పాటలను శ్రీమతి విజయశ్రీ కీర్తిసౌరభాల పేరిట పాడి మనవీనులకు విందుగావించారు. దానికి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి విశ్లేషణ అద్భుతంగా వుంది” మానవజీవితం భేదమోదాల సంకలనం. అది వెలుగు నీడల కలనేత. సుఖదుఃఖాల కలబోత. సుఖాలు లభిస్తే పొంగిపోవటం, కష్టాల కడలిలో మునిగినప్పుడు క్రుంగిపోవటం సామా న్యుని లక్షణం. కానీ ప్రళయాన్నైనా, సృష్టినైనా ఒకే విధంగా చూడగలిగిన సమదృష్టి అమ్మలోని విలక్షణ లక్షణం. సంకల్ప వికల్పాలకు తానే కారణమై అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తుంది అమ్మ” అని వివరించారు. రాజుబావగారి పాటలో “ఒక చెంపను దాచినావు కడలిఅంత భేదమును మరో చెంప ధరించినావు ధరలోని ప్రమోదమును” అంటూ రాజుబావగారి అంతర్మథనం మనకు కన్నులకు కట్టినట్లుం టుంది.

భేదమోదాలు మానవజీవితంలో సహజం. వాటిని నిర్లిప్తంగా అనుభవించేట్లు చేస్తుంది అమ్మ. మా అధ్యయన పరిషత్ పూర్వ ప్రెసిడెంట్ మాష్టరు ఎ.వి.వి. ప్రసాదరావు గారు వారు గొప్ప జ్యోతిష్కుడు. అమ్మను తలుచుకొని చెప్పిన ప్రతిమాట జరుగుతుండేది. అమ్మ దేహం చాలించటానికి పూర్వం ఒకరోజు అమ్మతో “అమ్మా! ప్రళయం రాబోతోందమ్మా నువ్వే రక్షించాలని” అంటూ ఈ నిశీధి రాత్రిలో అంటూ పద్యం మొదలు పెట్టారు. అమ్మ వెంటనే నిశీధి అంటే ఏమిటి? నాన్నా అన్నది. నిశీధి అంటే రాత్రి అని రామకృష్ణ అన్నయ్య చెప్పి, గట్టిగా నొక్కి చెప్పటానికి మాష్టరు గారు నిశీధిరాత్రి అన్నారన్నాడు. జరిగేదాన్ని మనం ఆపలేం. జరిగేది జరగవలసిందే” అన్నది. దానికి వారు “నువ్వు కాలస్వరూపిణివి, కాలాన్ని శాసించగలవని” అన్నారు. “కాలం కాళ్ళకు సంకెళ్ళు వేసుకుంటుందా ? అన్నది అమ్మ. ఆతరువాత రెండు నెలలోనే అమ్మ సిద్ధి పొంది “నిర్ణయానికి, నిర్ణయించినవాడు బద్ధుడే” అని అమ్మ నిరూపించింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!