అమ్మ శతజయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లెళ్ళమూడిలో ఐదురోజుల పాటు అనగా మార్చి 28 నుండి ఏప్రిల్ 1 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాకు ఈ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను దర్శించుకోవాలని చాలా బలంగా వుండేది. అయితే మార్చి 28 తేదిన మన విశాఖపట్నం అమ్మ మందిరంలో అమ్మ జన్మదిన వేడుకలు చేసుకున్నందున ఆ రోజు వెళ్ళలేక పోయాను. కానీ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి పూర్వం విద్యార్థులు ఇక్కడ అమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొని సాయంత్రం ట్రైన్కి జిల్లెళ్ళమూడి బయలుదేరారు. వాళ్ళందరూ ముఖ్యంగా మూడడ్ల ఉమామహేశ్వర్రావు అన్నయ్య ‘తమ్ముడు నువ్వు కూడా మాతో రా’ అని అన్నారు. కానీ ‘నాలుగు రోజులు సెలవు ఆఫీసుకు సెలవు పెట్టి అమ్మ మహా నివేదనను ఎవరికైనా అప్ప చెప్పి రావడం అంటే కొంచెం ఇబ్బందే అన్నయ్య’ అని అన్నాను. కానీ ఏదో ఒక రోజు వచ్చి అమ్మను దర్శనం చేసుకుంటా అని అన్నాను. ఆ మరుసటి రోజు జగన్నాధం అన్నయ్యగారు నాకు ఫోన్ చేసి నువ్వు జిల్లెళ్ళమూడి రావడం లేదా అని అడిగారు. వస్తాను అన్నయ్య వచ్చే ముందు మీకు ఫోన్ చేస్తాను అని చెప్పాను. సరే నువ్వు చెప్పితే నేను అక్కడ రూమ్ ఏర్పాటు చేస్తాను అన్నారు.
జిల్లెళ్ళమూడిలో తిథుల ప్రకారం అమ్మ, హైమక్కల జన్మదినం జరుపుకుంటారు. నేను ఏకాదశి రోజు అమ్మను దర్శించు కోవాలని ముందు రోజు (మీకందరికి కుసుమక్కయ్య నాకు మాత్రం మరో జిల్లెళ్ళమూడి “అమ్మ” ఇలా ఎందుకు అంటున్నా నంటే మీరందరూ స్వయంగా అమ్మ ప్రేమను, ఆప్యాయతను చూసుంటారు. అలాంటి ప్రేమ, ఆప్యాయతను కుసుమ అమ్మ వాళ్ళ పిల్లలతోపాటు నాకు చూపించారు. పంచారు.) ‘అమ్మా! నేను జిల్లెళ్ళమూడి వెళ్ళాలనుకుంటున్నాను’ అన్నాను. వెంటనే నాకు 2500 రూ॥ ఇచ్చి నా తరుపున నువ్వు వెళ్ళిరా అని చెప్పి పంపించారు. వెంటనే నేను చక్రవర్తి సార్ ఉన్నప్పుడు ఎన్నో సార్లు జిల్లెళ్ళమూడి వెళ్లాం అనుకున్నా కానీ కుదరలేదు అని చెప్పాను. సార్ నాతో ఎప్పుడూ చెప్పేవారు మనం అనుకోవడం కాదు అమ్మ అనుకోవాలి మురళి అని. నిజంగా అలాగే జరిగింది. కుసుమఅమ్మ దగ్గర నుండి ఆఫీసుకు వెళ్ళి రాధాకృష్ణ సార్తో ‘సార్ నేను జిల్లెళ్ళమూడి వెళ్ళాలనుకుంటున్నాను. సెలవు కావాలి సార్’ అన్నాను. అలాగే వెళ్ళి రా అన్నారు. నువ్వు ఒక్కడివేనా ఫ్యామిలీతో వెళ్తున్నావా అని అడిగారు. లేదు సార్ నేను ఒక్కడినే వెళ్తున్నా అన్నాను. వెంటనే మీ ఆవిడను కూడా తీసుకు వెళ్ళు అన్నారు. లేదు సార్ తను ఇప్పటికే పదిరోజులు సెలవులో ఉండి నిన్నటి నుండే ఆఫీసుకు వెళుతోంది అన్నాను. అయితే ఏముంది ఆ రోజు డ్యూటీ మరుసటి రోజు చేస్తానని చెప్పమను అన్నారు. ఇక్కడ చూడండి, అమ్మ ఎంత దయామయో అర్ధం అవుతుంది. మన మందిరంలో జరిగిన అమ్మ పుట్టినరోజు వేడుకకు తనకు రావడం కుదరక బయటకూర్చొంది. చాలా బాధ పడింది. సెలవులో ఉండికూడా వచ్చి అమ్మసేవ చేసుకోలేక పోయానని. అప్పుడనిపించింది అమ్మ రాధాకృష్ణ గారితో తనను తీసుకురమ్మని చెప్పించిందని. అలాగే వెంటవెంటనే ట్రైన్ రిజర్వేషన్ రెండు వైపులా దొరకడం అమ్మ దయే. నేను, సరస్వతి, పిల్లలు జిల్లెళ్ళమూడి చేరుకున్నాము.
ఏకాదశి అమ్మ శతజయంతి ఉత్సవాలు చివరి రోజు జిల్లెళ్ళమూడి అంతా అక్కడకు వచ్చిన భక్తులు, అమ్మ బిడ్డలతో పండగ వాతావరణంలా వుండేది. అన్నట్లే జగన్నాధం గారు జయంతి చక్రవర్తి అన్నయ్యతో మాట్లాడి తన రూము తాళాలు ఇచ్చారు.
మేము స్నానాలు చేసి అమ్మ అన్నప్రసాదం స్వీకరించి అమ్మ, హైమక్కల దర్శనం చేసుకొని, వసుంధర అక్కయ్యను భ్రమరాంబ అక్కయ్యను కలిసి కుసుమఅమ్మతో మాట్లాడించి వాళ్ళు అమ్మతో అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకోవడం జరిగింది. వసుంధర అక్కయ్య నాకు, సరస్వతికి అమ్మకి బట్టలు పెట్టి ఇంకో రెండు రోజులు ఉండి వెళ్లచ్చుకదా! అన్నారు. లేదు అక్కయ్య వెళ్ళాలి అన్నాను. అలాగే వెళ్ళి రండి అని చెప్పి పంపించారు. సాయంత్రం 6 గం॥కు జిల్లెళ్ళమూడి నుండి బయలుదేరి రాత్రి 9 గం||లకు గుంటూరు చేరుకున్నాం. నా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ 2 శాతం మాత్రమే వుంది. ముందు ఎక్కడైనా టిఫిన్ తిని స్టేషన్లో ఛార్జింగ్ పెట్టాలి అనుకున్నాను. అలాగే స్టేషన్ దగ్గర్లో ఒక హెూటల్కు వెళ్ళి టిఫిన్ తిని స్టేషన్కు చేరుకున్నాం. అప్పటికే ప్లాట్ ఫాంపై ట్రైన్ వుంది. కానీ, డోర్స్ ఓపెన్ చేయలేదు. రాత్రి 10 గం||ల ప్రాంతంలో డోర్స్ ఓపెన్ చేసారు. మేము లోపలికి వెళ్ళి ముందు మొబైల్ చార్జింగ్ పెట్టాను.
అప్పుడు సరస్వతితో నేను ‘కొంచెం సేపు రెస్ట్ తీసుకుని లేస్తాను. అప్పుడు మీరు పడుకోవచ్చు. ఇంకా ట్రైన్ బయలుదేరడానికి గంట సమయం వుంది కదా’ అన్నాను. అలాగే మీరు పడుకోండి అని తను పిల్లలతో ఆడుకుంటూ బాగా అలసిపోవడం వలన వాళ్ళుకూడా నిద్రలోకి జారుకున్నారు. ఇంకా ట్రైన్ కదలలేదు. 10.30 గం||లకు నా ఫోన్ను ఎవరో పట్టుకొని వెళ్ళిపోతుంటే బాగా నిద్రలో మునిగిపోయిన నా భార్యను ఎవరో తట్టి లేపినట్టు అనిపించి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి ‘ఏ ఎవరు నువ్వు? ఆగు’ అని అనడంతో నాకుకూడా మెలుకువచ్చి లేచి చూసేసరికి తను ఫోన్ పట్టుకొని పారిపోయి ట్రాక్పై ఉన్న ట్రైన్ క్రింద దూరి దాక్కున్నాడు. నేను నాతో పాటు కొంత మంది తోటి ప్రయాణికులు మూడు బోగిల వరకు వెళ్ళి వెతికి అలసి పోన్ పోయిందిలే అనుకొని తిరిగి వచ్చేస్తుంటే నా భార్య మనసులో అమ్మా ఎందుకిలా చేసావు అని అనుకునే సమయంలో నాతోపాటు వెతకడానికి వచ్చిన ఒకతనకు బోగికి, ప్లాట్ ఫాం కి మద్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుండగా చూసి అది దొంగిలించిన ఫోన్ కదా! అని అడగగానే ఆ ఫోన్ను ప్లాట్ ఫాంపై పెట్టి అక్కడ నుండి ఆ దొంగ పారిపోయాడు. విశేషమేమిటంటే ఆ దొంగకు కూడా దెబ్బలు తగలకుండా రక్షించింది అమ్మ. ఎందుకంటే తనుకూడా అమ్మ బిడ్డే కదా! ఫోన్ పోయిన 5ని॥లకే దొరకడం అమ్మ కరుణా కటాక్షాలకు నిదర్శనం కదా! ఈ ఘటనతో మేము చాలా భయపడి ఇంక నిద్రపోలేదు. ఈలోగా విజయవాడ రైల్వేస్టేషన్ రానే వచ్చింది. అక్కడ నుండి మాతో పాటు ఒక కానిస్టేబుల్ మరియు లేడికానిస్టేబుల్ తాడేపల్లిగూడెం వరకు ప్రయాణించారు. వాళ్ళు అక్కడ దిగి పోగానే ఒక పోలీసు ఫ్యామిలీ విజయనగరం వరకు ట్రైన్ ఎక్కారు. మేము జరిగింది వాళ్ళకు చెప్పాం. ‘ఏం ఫర్వాలేదు’ మీరు పడుకోండి మేమున్నాం అని చెప్పారు. ఆ విధంగా అమ్మ మమ్మల్ని విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పోలీసు ఎస్కార్ట్ పంపించింది. చక్రవర్తి సార్ చెప్పినట్టు అమ్మ క్షణక్షణం అనుక్షణం మనతోనే వుంటుంది – అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం.