ఆత్మీయ సోదరులు కీ॥శే॥ తంగిరాల కేశవశర్మ అందరికీ సుపరిచితులే. వారి కుటుంబం అంతా అమ్మ ప్రేమామృతాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించినవారే. వారి సంతానం అందరికీ అమ్మ, హైమలయందు ఎంతో భక్తి, విశ్వాసం.
కేశవశర్మగారి పెద్ద కుమార్తె శ్రీమతి భగవతికి ఇద్దరు కుమారులు. వారిద్దరికీ ఘనంగా వివాహాలు జరిపించారు. పెళ్ళి అయి 10 సంవత్సరాలు దాటినా వారికి సంతానం కలుగలేదు. ఎన్నో రకాల వైద్య సంప్రదింపులు, మరెన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ దంపతుల మనోవేదన మనం ఊహించగలం.
ఆ పరిస్థితులలో శ్రీమతి భగవతి తన కోడళ్ళ సంతాన ప్రాప్తి కోసం హైమాలయంలో డిశెంబరు 25, 2021 నాడు పదకొండు అంగ ప్రదక్షిణలు, గర్భాలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి, 108 నిమ్మకాయ డిప్పలతో దీపాలు వెలిగించి హైమకు హారతి ఇచ్చారు. అలాగే 108 కొబ్బరికాయలు కొట్టాలని సంకల్పించి అవి కొడుతూ ఉండగానే ఆమెకు ఫోను వచ్చింది. విషయం ఏమిటంటే ఇద్దరు కోడళ్ళూ గర్భవతులయ్యారని సంతోషకరమైన వార్త. ఈ వార్త విన్న భగవతికి ఎంతో ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఈ శుభవార్త వినిన వెంటనే భగవతి ఇంకొక 108 కొబ్బరికాయలు కొట్టి సమర్పించుకున్నారు.
ఆర్తి, ఆవేదనతో హైమకు చేసిన ఈ చిన్నసేవకు వెంటనే స్పందించి కోర్కెలు తీర్చిన హైమ అక్కయ్యకు అనేకానేక కృతజ్ఞతాభివందనములు భగవతి సమర్పించారు.
మరి హైమ అక్కయ్య క్షిప్రప్రసాదిని అని వేరే చెప్పాలా?