అదే రూపం, అదే నవ్వు, అదే ఠీవి,
జ్ఞాపకాలలో నిలిచినంతవరకు మరణం భౌతికమే.
నిరంతర అన్వేషి,పోరాటశీలుడు శ్రీ దత్తాత్రేయ శర్మగారు 02-03-2021న అమ్మ ఒడి చేరారు.
అమ్మతో ఆయనకు ఉన్న అనుబంధం విడదీయరానిది. అమ్మతో మమేకమై తన ప్రతిభతో జిల్లెల్లమూడి గడ్డపై తళుక్కున మెరిసిన మేరునగధీరులలో శ్రీ దత్తాత్రేయ శర్మగారు ఒకరు. మరో విశేషం. వారు అమ్మ సేవలో తరించిన కొండముది వంశవృక్షం విర బూసిన కొండముది పుష్పాలలో (సోదరులలో) ఒకరు. రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య, హనుమంతరావు గారు, శ్రీరామచంద్రమూర్తి గారు వెంకట చలపతిరావు గారలు ఆ మిగతా సోదరులు. అందరూ సాహితీ పిపాస గలవారే. అందరూ అమ్మకు అక్షరార్చన చేసిన వారే. అందుకే సోదరులు అందరూ కలసి “మా ఇలవేల్పు” అనే గ్రంథపుష్పంతో అమ్మను అర్చించారు.
ఆ మాటకొస్తే అమ్మ సాహిత్యంలో శర్మగారి పాత్ర అద్వితీయమైనది. అమ్మ సాహితీ అర్చన ప్రారంభించినప్పుడు రామకృష్ణ అన్నయ్య గోపాలన్నయ్య సేవలో “మాతృశ్రీ ” పేరుతో అమ్మ జన్మదిన వార్షికోత్సవ సంచిక మొదటిసారి 1962 లో విడుదల అయింది. ఆ సంచికలో మొదటి వ్యాసం “సంభవామి యుగే యుగే” రామకృష్ణ అన్నయ్య దత్తాత్రేయ శర్మగారు సంయుక్తంగా వ్రాసిందే.
అలా ప్రారంభమైన శర్మ గారి అమ్మ సాహితీ అర్చన మాతృశ్రీ పత్రికలో అడపాదడపా కొనసాగుతూనే ఉండేది. కాలాంతరంలో అమ్మ పత్రిక “విశ్వజనని” సంపాదక బోర్డు సభ్యుడుగా అమ్మకు సాహితీ సేవ చేసుకునే భాగ్యం అమ్మ దత్తాత్రేయ శర్మగారికి అనుగ్రహించటం విశేషం. శర్మగారు అమ్మ సేవలో పాత్రికేయుడు. పాత్రికేయుడుగా అమ్మ ప్రేమను నిరంతరం మనసులోనే నిలుపుకున్న అమ్మ బిడ్డ.
ఒక ఘట్టం ఉదహరిస్తాను. అది ఒక ఆధ్యాత్మిక సంస్థ. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగణ్యమైనది. ఒకసారి శర్మగారు వారి పత్రికా సంపాదకుడితో కలిసి వారి దర్శనం కోసం వెళ్ళారు. స్వామి వీరిని సాగనంపుతూ వారు పత్రికా సంపాదకుల వారికి మంత్రించి నిమ్మపండు, వెంట వెళ్ళిన శర్మగారికి మామూలు అరటిపండు ఇచ్చారు.
“నేను రెండు దశాబ్దాల నుండి జిల్లెళ్ళమూడి అమ్మని సందర్శిస్తున్నాను. అమ్మ దగ్గర ఈ వివక్షత లేదు.
కారులో వచ్చిన వారితో పాటు కారు డ్రైవర్ను కూడా సమానంగా చూస్తుంది. ఆ అమ్మను చూసిన కళ్ళకు వేరొకరు సంతృప్తిని ఇవ్వలేరు’ – ఈ సమాధానాన్ని కాదనలేని సంపాదకులు వారు సణుగుడుతో సరిపుచ్చారు. ఆ స్వామి విషయంలో రాజీపడ్డారు కాని తనతో పోల్చుకుంటాడా అన్న దుగ్ధ వదలలేదు. అవకాశం వచ్చినపుడు ఈ ఆగ్రహం ప్రతిఫలించకుండా ఉంటుందా?
శర్మగారి వృత్తి జీవితచంద్రబింబం పాలిట ఇలాంటి రాహువులు ఎందరో. ఎవరికోసమూ తన భావాలు దాచుకునే అలవాటు లేదు శర్మగారికి. ఇలా అమ్మ తత్వాన్ని ఆకళింపు చేసుకోవటమే కాక దానిని అందరి ముందు ప్రకటించగల సత్తా గలవారు శ్రీ దత్తాత్రేయ శర్మగారు. వారికి అమ్మ అనుగ్రహించిన మరో విశిష్టత ఉంది.
అమ్మ తత్త్వజలధిగా రూపొందిన “అమ్మ” చలనచిత్రంలో దత్తాత్రేయ శర్మగారు యాత్రికునిగా కనిపిస్తారు. ఇది వారి అదృష్టం. అమ్మ అనుగ్రహం. ఆ దర్శనంలో వారు “పురాణాలు, పుస్తకాలు చదివేటప్పుడు ఆయా అవతారాల కాలంలో నేను లేకపోతినే అని విచారించే వాణ్ణి. రాముడి కాలంలో ఒక వానరమైనా కాకూడదా! కృష్ణుడి కాలంలో ఒక గోపికనై ఉండకూడదా! రామకృష్ణ పరమహంస కాలంలో నేను లేను కదా! అయ్యో ! రమణ మహర్షిని సందర్శించనే లేదే! అని విచారించే వాడిని. ఇవాళ అ విచారం అంతా మాయమైంది. అమ్మతో పాటు జీవిస్తున్నాం. అమ్మ ను చూడ గలుగుతున్నాం. అమ్మ మాటలు వినగలుగుతున్నాం.మనమంతా ఎంతో ధన్యులం.” అన్న మాటలు చెవులలో గింగురు మంటూ మన అదృష్టాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆయనతో మన తాదాత్మ్యతను అనుభవిస్తూనే ఉంటాం. ఇలా దత్తాత్రేయ శర్మగారు ఎక్కడున్నా మన మనసు పొరల్లో తిరుగాడుతూనే ఉంటారు. మరో విషయం. రామకృష్ణ అన్నయ్య జీవిత చరిత్ర “అమ్మ చెక్కిన చందనశిల్పం” పేరిట దత్తాత్రేయ శర్మగారు రచించారు. ఆ రచన రామకృష్ణ అన్నయ్య కు, దత్తాత్రేయ శర్మగారి కి ఎనలేని యశస్సు తెచ్చిపెట్టింది. రామకృష్ణ అన్నయ్యను “అమ్మ చెక్కిన చందన శిల్పం”గా భావించడమే శర్మగారి ఉన్నత భావజాలానికి తార్కాణం. ఆ రచన జీవితచరిత్ర రచనలలో సరికొత్త అధ్యాయంకు నాంది అయింది. అంతే కాదు. వారు వారి అంతిమ ప్రయాణానికి కొద్ది కాలం ముందే వారి జీవితచరిత్రను “ఓ జర్నలిస్టు ఆత్మ కధ” పేరిట ప్రచురించారు. అదికూడా బహుళ ప్రశంసలు పొందింది. నా భాగ్యవశాన నేను ఆ జీవితచరిత్రను “శ్రీ కొండముది దత్తాత్రేయశర్మ జీవితానుశీలనము” పేరుతో విశ్లేషణ చేసి దానికి అనుబంధం చేయగలిగాను.
అమ్మ సేవలో పాత్రికేయుడు అన్నాను కదా. చూడండి మరి. ఏ పరిస్థితుల్లోనూ శర్మగారు తన జర్నలిజం విడిచి పెట్టలేదు.
విశ్వజనని మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డులో సభ్యుడుగా ఉన్నప్పుడు కూడా తన దృష్టి కి వచ్చిన రెండు విషయాలు లోకం దృష్టికి – తీసుకువచ్చారు.
అందులో ఒకటి. బాపట్లలో జిల్లెళ్ళమూడి అమ్మ తన బాల్యం గడిపిన శ్రీ చంద్రమౌళి చిదంబరరావు గారి స్వగృహం శిధిలమవుతుంటే తాను అమ్మ సంస్థ యాజమాన్య దృష్టికి తీసుకు వచ్చారు.
ఇక రెండవది. నిడుబ్రోలు ప్రధమ మునిసిపల్ ఛైర్మన్ స్వాతంత్ర సమర యోధుడు శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారి, మనకు చిరపరిచితులు, అమ్మ అనుంగు బిడ్డల్లో ఒకరు, విగ్రహం ఎంత కాలానికి ఆవిష్కరణకు నోచుకోక అలా ముసుగులో ఉండిపోతే శర్మగారు తన పాత్రికేయకలానికి పదును పెట్టారు. పర్యవసానంగా విగ్రహ ఆవిష్కరణ వెంటనే జరిగింది. వారి పాత్రికేయం చాలా వదునైనది. చాలామంది నటులు ద్విపాత్రాభినయం చేస్తారు. అలాగే పాత్రికేయుడు గా ద్విపాత్రాభినయం చేశారు శర్మగారు.
ఒక సందర్భంలో అమ్మకు వారిపై గల అనుగ్రహాన్ని ఇలా తెలియచేశారు. ఒకసారి వారు ఆర్ధిక సంకట స్థితి లో చిక్కుకుని అమ్మ దగ్గరికి వచ్చారుట. అమ్మ ఆయనను అన్ని రకాలుగా ఆదరించిందట గానీ ఆర్ధిక సంకటం గురించి ప్రస్తావించలేదట. దానితో వారు నిరాశగా అమ్మ సమక్షంనుండి నిష్క్రమిస్తుండగా అమ్మ రామకృష్ణ అన్నయ్యతో అన్నదట ‘ఒరేయ్ దత్తు సంగతి కాస్త కనిపెట్టుకుని ఉండండిరా” అన్నదట. అలా దత్తాత్రేయ శర్మగారిని కనిపెట్టుకునే బాధ్యత అమ్మ పర్యవేక్షించేది అని దత్తాత్రేయ శర్మగారి భావన. అలాగే అమ్మ ఆయనను అనుక్షణం కనిపెట్టుకునే ఉండేది అని వారి పూర్తి విశ్వాసం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది అమ్మ సమ్మతి పొందిందేనని వారు ఒక సందర్భంలో ఈ వ్యాసరచయితకు చెప్పారు. వారువిజయమా ? విలువలా? అన్నప్పుడల్లా విలువల వైపే నిలబడ్డారు. విజయం కోసం వెంపర్లాడక విజయాలే వీరి వెంట పడేలా చేసుకున్నారు. విలువలవైపు నిలబడ్డ తనకు ఈ విజయాలు అమ్మే ప్రసాదించింది అని వీరి బలమైన విశ్వాసం. వారు ఇంకో సందర్భంలో మరో విషయం చెప్పారు. వారి దగ్గర బంధువులు ఒకసారి చీకటి మార్గంలో చిక్కుకొని పోతే అమ్మ ఒక దీపం అయి మార్గం చూపిందట.
అందుకని వారు అమ్మ ను “దారి చూపే దీపం గానే సంభావించారట”.