1. Home
  2. Articles
  3. Viswajanani
  4. గానలోలుపా

గానలోలుపా

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : November
Issue Number : 4
Year : 2012

(“గానం పట్ల ఆసక్తిగల శ్రీమాత గానలోలుప. వాద్య శారీర, గాంధర్వ, సామగానాలలో ఆసక్తి కలది శ్రీమాత. గానలోలుడైన శ్రీకృష్ణుని మరొక్కరూపమే ఈపరాశక్తి-“) భారతీవ్యాఖ్య.

“సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా” అయిన శ్రీలలితాపరమేశ్వరి గానలోలుప. అందువల్లనే, ఆ శ్రీలలితకు పరిచారికగా ఉన్న సరస్వతీదేవి తన గాన కళానైపుణ్యంతో అమ్మను కీర్తిస్తూ, వీణావాదనం చేసి పరవశించింది. ఆమె వీణావాదనకు, గానానికి సంతోషించిన శ్రీలలితాంబిక సరస్వతీదేవిని ప్రశంసించింది. “నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ” అయిన అమ్మవారి సల్లాపమాధుర్యం ముందు తన కచ్చపీశ్రుతులు అత్యల్పమని భావించిన సరసరస్వతీదేవి సిగ్గుపడింది. అమ్మవారి కేవల సంభాషణం సంగీత విద్యకే పరిపోషణం కదా! షోడశకళాప్రపూర్ణ అయిన శ్రీలలితాదేవి గానలోలుప. కనుకనే, సువాసినులు అందరూ అమ్మవారిని పూజించిన తరువాత తమ భక్తిని తెలియజేసే రకరకాల పాటలనుపాడి పరవశిస్తారు.

“అమ్మ” గానలోలుప. ఎందరో గాయక శిఖా మణులు తమగానకళాసంపదను అమ్మపాదాలకు సమర్పణంచేసి, “అమ్మ”” అనుగ్రహవీక్షణాలకు పాత్రులయినారు. శ్రీమతి విజయ, చి.సౌ. శ్యామల, శ్రీమతి ప్రభాకర రామలక్ష్మి, శ్రీ రావూరి ప్రసాద్, శ్రీరాధాకృష్ణ రెడ్డి వంటి ఎందరో అక్కయ్యలు, అన్నయ్యలు తమ సుమధుర స్వరాభిషేకంతో “అమ్మ”ను అర్చించి, “అమ్మ” దివ్యాశీస్సుమ వర్షంలో తడిసి మురిసిపోయారు.

సుప్రసిద్ధులు శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు కవీంద్రులుమాత్రమే కాదు; గానకళాకోవిదులు కూడా. వారి కంఠ స్వరమంటే “అమ్మ”కు చాల ఇష్టం. ఒకనాటి సాయంకాలం వారు “అమ్మ” సన్నిధిలో కవితాగానం చేశారు. వారి ఇష్టదైవం శ్రీకృష్ణుడు. ఆ కన్నయ్యను గురించి పాడుతూ, మధ్య మధ్యలో “అమ్మ”కు, శ్రీకృష్ణపరమాత్మకు అభేదాన్ని ప్రకటిస్తూ వారు పాడిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. ఆ గానమాధుర్యానికి ఎంతో ముచ్చటపడిన “అమ్మ” గానలోలుప.

జిల్లెళ్ళమూడిలో ప్రధానంగా జరిగే ఉత్సవాల్లో “అమ్మ” కల్యాణదినోత్సవం ఒకటి. “అమ్మ” కల్యాణానికి పదహారు రోజుల పండుగ నేర్పాటు చేయాలని, ఆనాడు తాను “అమ్మా నాన్నగార్లకు” పూజ చేసుకొని, స్వరనివేదన చేసుకుంటానని సోదరుడు రాధాకృష్ణరెడ్డి తన కోరికను వ్యక్తం చేశారు. 1980 మే 20న ఆకార్యక్రమం ఏర్పాటైంది. అతని సంగీతకచ్చేరీకి వాద్యసహకారాన్ని అందించడానికి వివిధ కళాకారులను పలుప్రాంతాల నుంచి రప్పించి, మనంగా ఏర్పాట్లు చేసింది. “అమ్మ”. నాన్నగారికి, “అమ్మ”కు పూజచేసి, వారికి నూతన వస్త్రాలను సమర్పించి, “అమ్మ” చేత సత్కారం పొంది, “అమ్మ” ఆశీస్సులతో తన స్వరార్చనను ప్రారంభించారు రాధాకృష్ణ అన్నయ్య. సుమారుగా రాత్రి గం. 10.00లకు ప్రారంభమైన ఆ నాదబ్రహ్మోపాసన, అర్థరాత్రి గం.1.30ని.లవరకు నిర్విరామంగా దిగ్వి జయంగా సాగింది. ఆ నడిరేయిలో అంతసేపూ అన్నయ్య గళం నుంచి జాలువారుతున్న సంగీతఝరిలో మునుకలు వేసిన ఆతల్లి అనసూయి  గానలోలుప

“నిజంగా చెప్పమ్మా! మా పాట శ్రావ్యంగా లేదా?” అని ప్రశ్నించిన వారితో – “మీరనుకున్నంత కాకపోయినా, మేము అనుకోనంత చక్కగా పాడేరు” అని మెచ్చుకుని, వారిని ప్రోత్సహించిన “అమ్మ” గానలోలుప. “చక్కగా పాడేవాళ్ళు వాళ్ళకు తెలీకుండా మనను, మనకు తెలీకుండా వాళ్ళతో తీసుకెళతారు” అని సునిశితమైన ప్రశంస చేసిన “అమ్మ” గానలోలుప. “నాకు బాగా పాట రాదమ్మా!” అని పాట రానందుకు బాధపడుతున్న ఒకరితో “పోనీ రానట్టుగానే పాడు” అని పాటరాకపోయినా, ఆపాటనూ విని ఆనందించగల తన సంగీత ప్రియత్వాన్ని వెలిబుచ్చిన “అమ్మ” గానలోలుప.

అందరింటి ఆవరణలో హరిదాసుగారంటే తెలియని వారు ఉండరు. వారి పెంపుడు కుక్కను “అమ్మ”-“దమయంతీ” అని పిలిచేది. ఒకసారి దానితో “అమ్మ”-దమయంతీ! ఒకపాట పాడు” అనగానే అది పాడిందిట. “అమ్మ”- “ఇంకో పాటపాడవే” అంటే, మళ్ళీ పాడిందట.మాటలు వచ్చిన మనచేత పాటలు పాడించి, సంతోషించడం కాక, మాటలురాని జంతువులచేత సైతం పాటలు పాడించి, పరవశించిన గానలోలుప “అమ్మ”. మన పాటలు విని ఆనందించడమే కాదు, గానలోలుప అయిన “అమ్మ” తన మృదు మధుర కంఠస్వరంతో శ్రావ్యంగా పాటలు పాడేదిట. “అమ్మ” పాడిన పాటలు విని, మైమరచిన అరుదైన అదృష్టవంతులు కొందరు ఉన్నారు. వారి జన్మ ధన్యం.

తమలోని సంగీత సరస్వతిని “అమ్మ” శ్రీ చరణ సంసేవనానికి సమర్పణం చేసి, “అమ్మ”ను గానలోలుపగా దర్శించిన సోదరీసోదరులందరకూ నా అభినందనలు. అర్కపురిలోని అందరింటిలో గానలోలుపగా సాక్షాత్క రించిన అనసూయా మహాదేవికి నా హృదయపూర్వక అభివందనములు. జయహోమాతా! శ్రీఅనసూయా! రాజరాజేశ్వరి! శ్రీపరాత్పరి!

మాతృసంహిత రచయితకు కృతజ్ఞతలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!