అమ్మ సన్నిధికి ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో వచ్చి సందర్శించినా అంతర్నేత్రంతో చూడగల శక్తి కొందరికే ఉంటుంది. అందులోనూ కొద్ది మంది మాత్రమే తమ భావాలను, అనుభవాలను పాటల్లోనో పద్యాల్లోనో పొందుపరుచ గలుగుతారు. అమ్మను చూసి ఆకర్షితులయి అమ్మ అనురాగాన్ని పొంది అమ్మలోని మానవాతీత శక్తిని గుర్తించి అమ్మపట్ల అచంచల విశ్వాసం ఏర్పడిన భక్తులలో శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ అన్నయ్య ఒకరు. అమ్మరూపు, అమ్మ ప్రేమ, అమ్మ మహిమలు అమ్మ చేసే పెండ్లిండ్లు బారసాలలు, అమ్మ సన్నిధిలో నిర్వహించబడే అన్నపూర్ణాలయం, హైమాలయం, అమ్మ వత్రోత్సవం ఈ విధంగా ఎన్నో – సంఘటనలూ, సందర్భాలూ సంతోషమయినా, సంతాపమయినా ఆర్ద్రంగా మనసుకు తాకే ఏ భావమయినా అక్షర రూపం ధరించి ‘గిరిబాల గీతాలు’గా రూపుదిద్దు కున్నది.
అమ్మ చెంత జరిగే వేడుకలు కొన్ని, అమ్మ చేతుల మీదుగా జరిగే వేడుకలు కొన్ని. ఆ సందర్భాలలో చూడముచ్చటగా ఉండే వేడుకలలో సంక్రాంతి ఒకటి, భోగిపండుగనాడు ప్రతి తల్లీ తన బిడ్డకు భోగిపళ్లు పోసుకుని వెయ్యేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని దీవిస్తుంది. ఎవరిని చూసినా తన బిడ్డయే అన్పించే అమ్మ బారులు తీర్చి కూర్చున్న వేల మంది బిడ్డలకు భోగిపళ్లు పోసేది. సంక్రాంతి గురించి
‘అది నవ్యసంక్రాంతి అది దివ్య సంక్రాంతి
అది భవ్య సంక్రాంతి అది కావ్య సంక్రాంతి’ అంటూ వర్ణించారు.
భగవదారాధనకు అనేక మార్గాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక మార్గాన్ని ఎంచుకున్నారు. యోగులయితే ధ్యానం ద్వారా, కవులయితే తమ కవిత్వం ద్వారా భగవంతుని ఆరాధిస్తారు. మరికొందరు భగవంతుని సన్నిధిలోనే ఉండి సేవిస్తూ ఉంటారు. కాని అన్నయ్యకు ఏ మార్గం అవలంబిద్దామన్నా ఏవో అవరోధాలు ఉంటూనే ఉన్నాయట. అందుకే అమ్మను ఈ విధంగా ప్రార్ధిస్తున్నారు.
ధ్యానమార్గములో తరియింతు నందునా
మాయ దారి మనస్సు మాట వినదు.
ఆర్తితో నీపైన కూర్తు పద్యములన్న
ఛందాల అందాలు సాగిరావు.
కనులార నిన్నెపు కాంతునా అందునా
అమ్ముకున్న శరీరమయ్యె నాది
అమ్మ మాటలలోన అర్థమ్ము నెరుగగా
అఆలు కూడ నాకసలు రావు
కాని భక్తితో నీదు పాదాలు పట్టుకునే రక్తి మాత్రం ఉంది అన్నారు. భగవదనురక్తే భక్తి కదా. కనుక మార్జాల కిశోర న్యాయంతో అమ్మే వారిని ప్రేమతో అనుగ్రహించినట్లుగా చెప్పుకున్నారు. అమ్మ అనుగ్రహానికీ అమ్మ వాత్సల్యానికీ పరవశించిన అన్నయ్య తన అనుభూతిని కవిత్వరూపంగా ఆవిష్కరించారు. అనుభూతికి అక్షరాకృతి కల్పింపగలవాడే కదా కవి? – అమ్మ దర్శనమే ఎన్నోజన్మల పుణ్య ఫలం. ఆ భావాగ్నే
‘జన్మలెన్ని ఎత్తానో ఈ జన్మకోసం
పుణ్యమెంత చేశానో ఈ అమ్మ కోసం
దోష దృష్టితో చూడ ద్వేష భావమే లేక
ప్రేమించుట ఒక్కటియే చేతనైన జనని చేర’ అంటూ తెలియ చేశారు.
అవ్యాజ ప్రేమకాదు ప్రేమే అవ్యాజమైంది’ అని ప్రకటించిన అమ్మ అవ్యాజ ప్రేమకు సాకారం. మూర్తీభవించిన ప్రేమావతారం అమ్మ. మీరెవరోకాదు. మీరంతా నా బిడ్డలే నేనేకని మీమీ తల్లులకు పెంపుడిచ్చాననిపిస్తుంది అని అమ్మ అంటుంది’ ఆ అమ్మ తత్త్వాన్ని,
‘ఏ నామమైనను తన నామమేనంది. ఏ రూపమైననూ తన రూపమేనంది
నామరూపము లేని అమ్మ ప్రేమావతారమై వచ్చే
ఎల్లప్పుడు చూలింత-ఎల్లప్పుడు బాలింత ఎల్లరను తను కనిపెంపుడుకునిచ్చి
రక్తమాంసాదులను కరిగించి పాలుగా
గోరు ముద్దలు చేసి గోముగా ప్రేమగా
తాను వస్తుండియు తన బిడ్డలకు పెట్టు
అమ్మకు సాటెవరు అవనిలో లేరురా’ అని వర్ణించారు.
జిల్లెళ్ళమూడి అనగానే అమ్మను గురించి తెలిసినవారికి ఎవరికయినా స్ఫురించేది అన్నపూర్ణాలయం. కారణం అక్కడ జరిగే నిరతాన్నదానానికి అమ్మ ఇచ్చిన ప్రాముఖ్యం అటువంటిది.
‘అన్నపూర్ణాలయం – అనసూయానిలయం
అనురాగములో ముంచి – అమృతమునే పంచు
మాధురీ మమతాలయం శ్రీ మహిని వెలసె మహిమాలయం
– ఆదరణ మనుపాకమై రుచింపగా
అనురాగ ఆప్యాయతలనే నించగా
ఆలయమున ప్రసాదము ఆకలికది భోజనము
|తృప్తిగ కడుపును నింపుటే ఆధ్యాత్మికమనిచాటే
అచట తినుట కర్హత ఆకలి కడుపే నంట
డ్రసూ అడ్రస్సూ కాదట రాజూ పేదా కాదట
అదియే ఒక యజ్ఞశాల అది ఒక దైవజ్ఞశాల’ అంటూ అన్నపూర్ణాలయ ప్రత్యేకతను వర్ణించారు.
ఈ మానవ శరీరంతో అమ్మను సేవించుకోవడంతో తృప్తి చెందక తాను ప్రకృతితో తాదాత్యంచెంది పంచభూతాలుగా తాను ఉన్నట్లయితే నిరంతరం అమ్మ సేవలోనే తరియించ వచ్చుననే భావాన్ని
‘వసుంధరనై వరలి యుండిన వసుధలో మగవాడు అమ్మకు
భార్యగానై స్వర్గ సౌఖ్యపు భాగ్యమందెడి దాననే
జలముగా నే జననమందిన జననిపాదము శుభ్రపరచుచు
జగతికేఇట సేవసల్పిన సుగతినందెడి దాననే
తేజముగ నే తేజరిల్లిన దీపశిఖిగా అమ్మ గదిలో
ఆమె కాంతిని అంటిపెట్టుక అణిగి యుండెడి దాననే
వాయువై నే వరలియుండిన మందమారుత మౌచునెప్పుడు
అందరమ్మకు అందనమ్మకు హాయిగూర్చెడి దాననే
ఆకసమునై అమరియుండిన లోకమున కాధార శక్తిగ
రూపుగొని నాలోన నిముడగ ప్రాపుగాంచెడి దాననే
అంటూ అమ్మకు నివేదించుకున్నారు.
ఈ భావమే మనకు
‘వస్త్రోద్ధూతవిధౌ సహస్ర కరతా…..
నీకు వస్తోపచారం చేయాలంటే సహస్రకరుడయిన సూర్యుడిని కావాలి. పుష్పోపచారం చేయాలంటే సర్వవ్యాపి అయిన విష్ణువును కావాలి. గంధోపచారం చేయాలంటే గంధవహుడయిన వాయువును కావాలి అని శ్రీ శంకరాచార్యులవారి ప్రార్థన కన్పిస్తుంది.
”అంతా అదే’ అని అమ్మ చెప్పిన తత్త్వాన్ని జీర్ణించుకోవడం వలన ప్రతి వస్తువులోనూ, అమ్మను దర్శించాలనీ పంచభూతాలలోనూ పంచభూతాల సూక్ష్మరూపాలు పంచతన్మాత్రలయిన శబ్ద స్పర్శ రూప రస గంధాలుగా అమ్మను తెలసుకోవాలనే తపనతో ఈ విధమైన రచన సాగించారు.
‘అంధకార సంసార కాననవు జీవన మార్గపు దివ్వెవు నీవని కష్ట నష్ట కాలాగ్ని చక్రముగ వెన్ను కాంచి నిలుచున్నది నీవని.
కంటికి చూపు చెవికి వినికిడి నాలుక రుచియు నాసిక వాసన చర్మము నందలి స్పర్శ నీవని తెలివికా తెలిసెడి తెలివి నీవని అక్షరాక్షరపు అర్థము నీవని గజము గజములో గమనము నీవని’ నీటిని నింగిన గాలిని నేలను నిండియున్న చైతన్యము నీవని’
ఈ భావమే మనకు
శబ్దంబు స్పర్శంబు నీవేనులే
రూపంబు రసగంధ మీవేనులే” అనే రాజు బావ పాటలో కన్పిస్తుంది.
ఈ విధంగా ఛందాల అందాలు సాగిరావు అంటూనే అమ్మను గురించి ఎన్నో అందమైన రచనలు చేశారు. అమ్మ అనుగ్రహం ఉంటే సాధ్యంకాని దేముంటుంది?