గీతలో చెప్పనిది నేను చెబుతున్నది లేదు చెప్పే తీరు వేరు కావచ్చు గాని” అమ్మ – అమ్మ వాక్యాలు (1495) -1
“ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ! మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే”
(భ. గీ 2-55)
తా. మనస్సులోని కోర్కెలన్నింటినీ సంపూ ర్ణంగా త్యజించి తనయందే తృప్తుడై యున్నవానిని స్థితప్రజ్ఞుడు అంటారు.
అమ్మ చిన్నతనంలో పినతండ్రిగారైన మన్నవ రామబ్రహ్మంగారు వాసుదాసస్వామి దర్శనార్థం వెళుతూ అమ్మని కూడా తీసుకువెళతారు. అమ్మని చూపిస్తూ “మా అన్నగారి కుమార్తె. తల్లి లేదు” అని పరిచయం చేస్తారు.
స్వామివారు అమ్మని “నీకేమి కావాలో చెప్పు” అని అడుగుతారు. అమ్మ వెంటనే తడుముకోకుండా “ఏమన్నా కావాలనేది అక్కర్లేకుండా కావాలి” అన్నది. స్వామివారు దిగ్భ్రాంతి చెందుతారు.
ఇక్కడ అమ్మ మాటలని ఒక్కసారి పరిశీలిస్తే ‘గీత’ లోని పై శ్లోకం స్ఫురించక మానదు. స్వామివారు అడిగినదానికి అమ్మ సమాధానం అమ్మ కోరుకున్న కోరిక కాదు అమ్మ సహజ స్థితి అది ఇంకా ఈ లోకంలోని ప్రజలందరికీ సందేశం. తరించడానికి మార్గోపదేశం!
“అందరూ నాలా ఆనందంగా వుండాలి” అన్న అమ్మ మాటల్లోని సారం కూడా అదే – “ఆత్మన్యేవాత్మనా తుష్టః……!!!