గురువేతానైన శ్రీమాత ‘గురుమూర్తి’. మంత్రం, మంత్రాధిష్ఠాన దేవత, మంత్రోపదేష్ట అయిన గురువూ ఈ ముగ్గురూ ఒక్కరే…… ‘గు’ అంటే బ్రహ్మ. ‘రు’ అంటే జ్ఞానం. గురువు బ్రహ్మజ్ఞాన స్వరూపుడు….. అజ్ఞాన వినాశకమై, జ్ఞానదాయకమైన గురు స్వరూపమే దేవి”. – భారతీ వ్యాఖ్య.
“ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోఃపదమ్
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోఃకృపా
గురుర్ర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురవే నమః ||”
అని సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమే గురువు అని మన ఆర్షవాఙ్మయం ఉద్ఘాటిస్తోంది. అంతేకాదు. “మాతృ దేవోభవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ” అని ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల తరువాత గురువునే దైనస్వరూపుడుగా గుర్తించి అతనికి నమస్కరిస్తోంది మన సంస్కృతి.
పంచమవేదమైన మహాభారతంలోని ఉదం కోపాఖ్యానం గురుశిష్య సంబంధానికి మేలుబంతి. మనసావాచాకర్మణా గురుభక్తి కలిగి, గురుశుశ్రూష చేసిన శిష్యాగ్రేసరుడు ఉదంకుడు. గురువుగారి ఆజ్ఞను శిరసా వహించి, గురుపత్ని కోరికను తీర్చడం ద్వారా గురుదక్షిణ సమర్పించుకోవడమే కాక, గురువుగారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైన ఉత్తమ శిష్యుడు ఉదంకుడు. అతనివలె గురుభక్తికలిగి ప్రవర్తించే శిష్యులకు “అధిక పుణ్యఫలాలు” సంప్రాప్తిస్తాయని శిష్యలోకం అంతటికీ శుభాశీస్సులను అందించిన ఉత్తమోత్తముడైన గురువు పైలమహర్షి. అలాంటి ఉన్నతసంస్కారం కల గురువులకు గురువు శ్రీమాత. ఆమె గురుమూర్తి. అంటే-మూర్తీభవించిన గురువుతత్త్వమే శ్రీలలిత.
‘తల్లి తొలిగురువు’ అనే మాట జనవ్యవహారంలో ఉన్నదే. తల్లులకే తల్లి అయిన అనసూయమ్మ గురుమూర్తి. సాంఘికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, పారలౌకికంగా ఎన్నో అంశాలను అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా “మీరు శిష్యులు కారు” అంటూనే ఎప్పటికప్పుడు తన బిడ్డల నడవడికలోని తీరుతెన్నులను సరిదిద్దుతూ వారిని ఉత్తమ సంస్కారం కలవారుగా తీర్చిదిద్దిన “అమ్మ” గురుమూర్తి.
“తెలియనివి తెలియజెప్పేవాడు గురువు” – “అమ్మ”. మనకు తెలియని, తెలిసికోవలసిన వాటిని తేలిక భాషలో విడమరచి చెప్పింది “అమ్మ”. శిష్యుల విషయంలో గురువు చేసేపని అదే కదా! ఒకపట్టాన ఒంటబట్టని, అంతుచిక్కని అద్వైతం గురించి చెప్తూ- తొడిమతో కలిసి ఉన్న పువ్వు అద్వైతం, తొడిమనుంచి తొలగిస్తే ద్వైతం – అన్నది. సూదిలోనికి ఎక్కించిన ఒక దారమే రెండు పోగులుగా కనిపిస్తే ద్వైతం, ఎక్కించక ముందు ఒకటిగా ఉన్న దారం అద్వైతం. అని చెప్పింది. ఒక ఇల్లాలితో “కూతురు కోడలిని ఒక్కలాగా చూడటమే అద్వైతం” అని ఉపదేశించిన గురుమూర్తి “అమ్మ”. నిత్యవ్యవహారంలోని సన్నివేశాలతో పోలిక చెప్పి ‘అద్వైతం అంటే ఇంతేనా’ అనిపించేలా తెలియచెప్పిన గురుమూర్తి “అమ్మ”.
“పరిస్థితులే గురువూ బంధువూ” -“అమ్మ”. ‘తాను ఏది చెప్పినా నా అనుభవంలోనిది మాత్రమే చెబుతాను’ అని ప్రకటించింది “అమ్మ”. ఈ వ్యాక్యాన్ని బట్టి, “అమ్మ” తన జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకొని, తాను అనుభవించిన వాటినే మనకు ప్రబోధించింది. కనుక “అమ్మ”కు ఏర్పడిన పరిస్థితులే “అమ్మ”ను గురువుస్థానంలో నిలబెట్టి, “ఆమె”ను గురుమూర్తిని చేశాయి.
“మనస్సు గురువే కదా!” అని చెప్పిన “అమ్మ”, మరొక సందర్భం లో “నేనూ మనస్సూ ఒకటే” అన్నది. అంటే “అమ్మ” గురువు అనే కదా! అర్థం. “గురువుకూ ఇష్టదైవానికీ తేడా లేదని నా ఉద్దేశం,” “గురువు అంటే వాడు తప్ప మరోదైవం లేడనే” – అని చెప్పిన “అమ్మ” వేరొక సమయంలో “మనస్సేదైవం” అన్నది. “మనస్సే గురువు, మనస్సే దైవం, నేనూ మనస్సూ ఒక్కటే” – ఈ వాక్యాలను ఒక దగ్గరకు చేర్చి సమన్వయం చేస్తే మనకు అర్థమవుతున్నది ఏమిటి? అంటే “అమ్మ” దైవం. “అమ్మే” గురువు.
“ఎవరు లక్ష్యసిద్ధి కలిగిస్తే వాడు గురువు, ” “నీకు లక్ష్యం ఎక్కడ ఉంటుందో అదే గురువు” – “అమ్మ”. ఈ వాక్యాల సారం స్వీకరిస్తే “తాను గురువు కాదు” అని చెప్పిన “అమ్మే” మనకు అందరకూ గురుమూర్తి అని స్పష్టం అవుతుంది. ఎలాగ? మనందరకూ లక్ష్యం ఎవరు? – “అమ్మ”. ఔనా! అందువలన మూర్తీ భవించిన గురువు తత్త్వమే అమ్మగా భాసిస్తూ, గురుమూర్తిగా మనకు దృగ్గోచరమవుతోంది.
గురుమూర్తి అయిన “అమ్మ” ప్రబోధించే తీరు చాల విలక్షణంగా ఉంటుంది. కొన్నిసార్లు “అమ్మ” మందలింపు వాగ్రూపంలో ఉంటే, మరికొన్ని సార్లు ఆచరణలో అభివ్యక్తమవుతుంది. కొన్నిచోట్ల కనుసన్నతో, మరికొన్ని చోట్ల చేసైగతో అదలించే పద్ధతి మన మనస్సులను కదలించి వేస్తుంది. “అమ్మ” విధానం ఏదైనా అది మనకు నిధానంగా, మార్గనిర్దేశకంగా, మనలను ప్రగతిపథంలో నడిపించే విధంగా ఉంటుంది. “గుర్తు చెప్పిన వాడు గురువు” – “అమ్మ”. తన బిడ్డలందరకూ ఎన్నో విషయాల్లో గుర్తు చూపించిన గురుమూర్తి “అమ్మ”.
అరపురీశ్వరి అందరి “అమ్మ”ను గురుమూర్తిగా దర్శించి “ఆమె” చూపిన గుర్తులో పయనించడం కంటే ధన్యత మరేముంటుంది ? “అమ్మ” ఒడిలో, బడిలో – శిశువులమై, శిష్యులమై పరవశించటం కంటె, పలుకు లొలకడం కంటే జీవితానికి సార్థకత మరేముంది?
గురుమూర్తి అర్కపురీశ్వరి అనసూయామాతకు “జయహో”.
“దారి చూపిన దేవతా ! నా చేయి ఎన్నడు విడువకా
జన్మజన్మకు తోడుగా, నా గురువువై నడిపించవా!”
(“అమ్మా, అమ్మ వాక్యాలు” సంకలనకర్తకు కృతజ్ఞతలు.)