‘గు’ అంటే అంధకారం అని, ‘రు’ అంటే ఆ చీకటిని తొలగించటమనీ మన పెద్దలు తెలియచేశారు. మన అంతరంగాలలోని చీకటిని తొలగించి, ప్రశాంతమైన ఆనందాన్ని కలిగించే చల్లని వెలుగు నిచ్చే పర్వదినం ‘గురుపూర్ణిమ’. ఈ ప్రపంచానికి కావలసిన వెలుగును ప్రసాదించే జ్ఞాన సంపద వేదం. వేదాల సారమే బ్రహ్మ సూత్రాలు. వ్యాసులవారు వేద విభాగం చేశాక బ్రహ్మ సూత్ర రచన చేశారు. ఆ రచన ఆషాఢ శుద్ధతొలి) ఏకాదశి నాడు ప్రారంభమై, పూర్ణిమ నాడు పూర్తయింది. 555 సూత్రాలను 5 రోజులలో రచించారు ఆ మహర్షి.
ఆ పూర్ణిమ “వ్యాస పూర్ణిమగా, జ్ఞాన ప్రబోధం చేసే రచన వెలువడిన కారణంగా “గురు పూర్ణిమ”గా ప్రసిద్ధమై, మనకు పర్వదినం అయింది.
గురుపూర్ణిమనాడు ఎవరికివారు తమ గురువులను తలచుకొని, వారిని పూజించి, వారిచ్చిన ప్రబోధాలను పునశ్చరణ చేసుకొని, ఆ ప్రకారం తమ జీవన వైఖరిని సంస్కరించుకునే ప్రయత్నం ప్రారంభించాలని మన సంప్రదాయం తెలియ చేస్తోంది.
మనకు గురువు, దైవమూ మన అమ్మే. గురుత్వం, దైవత్వం, మాతృత్వం కలసి అమ్మగా అవతరించింది అనిపిస్తుంది.
“తెలియనిది తెలియ చెప్పటానికే నా రాక” అన్నది అమ్మ. మనం తెలుసుకోవలసిన ఎన్నో మంచి విషయా లను తెలియజేసింది. మనం పరిపూర్ణ మానవులుగా రూపొందటానికి కావలసిన మహత్తర అంశాలను అతి సరళంగా ప్రబోధించింది.
“ గుర్తు చెప్పేవాడే గురువు” అని నిర్వచన మిచ్చిన అమ్మ ఎన్నో గుర్తులు చెప్పి మన గుండె తలుపు తట్టింది.
“తెలియ చెప్పేవాడుగురువు, తెలియచేసేది దైవం” అని చాటిన అమ్మ, మనకు ఎన్నో మహత్తర సత్యాలను ‘ఎఱుక’ పరచింది. ఆ విషయాలను మనం గమనించ గలిగితే, గురువూ దైవమూ అమ్మే అని మనకు బోధ పడుతుంది.
మొట్ట మొదట మనం తెలుసుకోవలసింది ఏమిటి?
మనం ఎవరికి వారు కాక, అందరం ఒకే తల్లిబిడ్డలం- అని తెలియాలి. ‘వసుధైక కుటుంబ’ భావన మనలో వర్ధిల్లాలి.
అందుకోసం “నేను తల్లిని. మీరు బిడ్డలు. నేను అమ్మను. నీకు మీకూ అందరికీ, పశు పక్ష్యాదులకూ కూడా” అని స్పష్టం చేసింది అమ్మ. ‘వసుధైక కుటుంబం’ అనే గంభీరమైన భావాన్ని ‘అందరిల్లు’ అనే పేరుతో సరళ సుందరం చేసింది. సహజ సుందరం చేసింది.
ఈ సత్యాన్ని మన హృదయాలలో మరింతగా పదిలం చేయటానికి “నా ఒడి విడిచి ఎవరూ లేరు” అని సెలవిచ్చింది. ఈ సత్యం మనకు అనుభవానికి రావటానికి అనువైన చక్కని వ్యవస్థను జిల్లెళ్ళమూడిలో ఏర్పాటు చేసింది. వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరూ ఒకే తల్లిబిడ్డలు అనే భావాన్ని పదే పదే మనకు ప్రసాదించింది. “ వర్గం లేనిదే స్వర్గం” అని అపూర్వమైన నిర్వచనం అనుగ్రహించింది అమ్మ.
అందరమూ ఒక తల్లి బిడ్డలం మాత్రమే కాదు, ఒక్కటే అయిన ‘విశ్వ చైతన్యం’లో భాగమై ఉన్నామని కూడ మనకు గుర్తు చెప్పింది. “మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు కూడా” అని ప్రకటించి, పరమాద్వైత రహస్యాన్ని అలవోకగా అందించింది.
“అమ్మా! నువ్వు సాక్షాత్తూ రాజరాజేశ్వరివి” అని సోదరులు ప్రస్తుతిస్తుంటే, “మీరు కానిది నేనేదీ కాదు నాన్నా!” అని అభేద స్థితిని స్పష్టంగా ప్రకటించింది అమ్మ.
ప్రేమ తత్త్వం ఆధారంగా ఈ సృష్టి అంతటినీ ఒకటిగా దర్శించే దివ్య చక్షువులను మనకు ప్రసాదించింది అమ్మ. “ ఈ సృష్టి నాది, అనాది” అనే ప్రకటనలో సృష్టి తత్త్వాన్ని వివరించింది.
ఈ సృష్టి తనదే అని, తానే అని, మనమంతా అమ్మలోని భాగాలేననీ మరో ధోరణిలో మనకు స్పష్టం చేయటమే అమ్మ ఆంతర్యం అనిపిస్తుంది. మన హృదయాలు ప్రేమమయం కావాలనీ, హృదయంలోని ప్రేమ మాటలలో ఆదరణగా, చేతలలో సేవగా వ్యక్తం కావాలని ఎన్నో రీతులలో తెలియచెప్పింది అమ్మ.
తన్ను చేరవచ్చిన బిడ్డలను అక్కున చేర్చుకుని ఆదరించి, ” నీ కున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” మని బ్రహ్మోపదేశం చేసింది అమ్మ.
దివ్యజ్ఞానం పొంది, బ్రహ్మానందానుభవం పొందాలని ఆరాటపడే ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ” నీ బిడ్డయందు ఏమి చూస్తున్నావో, అందరియందూ అదే చూడటం బ్రహ్మస్థితిని పొందటం” అని దారి చూపిం చింది అమ్మ.
“కర్తవ్యమే భగవంతుడు” అనీ,
“మంచిని మించిన మహిమలు లేవు” అనీ,
“జ్ఞానం అంటే భావం మారటమే” అని అమ్మ చెప్పిన మాటలు మాటలు కావు. మహా మంత్రాలు.
మన మనుకునే ‘ఆధ్యాత్మిక సాధన’ను గురించి కూడా వివరించింది అమ్మ. ” నీవు చేయవలసింది నీవు చేస్తే, నీకు తెలియ వలసింది నీకు తెలుస్తుంది” అనే ప్రబోధం ఎంత మహత్తరమైనదో అనుభవానికి వచ్చినప్పుడు గాని తెలియదు.
“సామాన్యం నుండి విశేషాన్ని వేరు చేసుకోవటం సాధన. విశేషాన్ని సామాన్యం చేసుకోవటం సిద్ధి” అనే అపూర్వ సందేశం అందించింది అమ్మ.
అమ్మ అనుగ్రహించిన ఏ ఒక్క సూక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని, చిత్తశుద్ధితో ఆచరించినా తరించటానికి అంతకు మించిన మార్గం లేదు.
గురుమూర్తి అయిన అమ్మ శ్రీచరణాలకు సాగిలపడి మొక్కుతూ…..
అందరింటి సోదరుడు
– మీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి