“గురుబ్రహ్మ, గురుర్విష్ణు – గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ – తస్మై శ్రీ గురవేనమః”
అను గురుస్తోత్రములో…..
శ్రీ గురు మంత్రములోని పరబ్రహ్మ యొక్క సృష్టి, స్థితి, లయ కారక త్వములనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్పిరి. ఈ సంప్రదాయ మింత నరకు ప్రపంచములో మనము చెప్పుకొను ప్రతి మతము వారికిని వేర్వేరు పేర్లతో చెప్పుకొనుచునే యున్నారు. అట్లగుట బ్రహ్మచతుర్ముఖత్వమున నాలుగు దిక్కులు గల అవకాశమే అనియు ప్రథమతః అవకాశములో గల్గిన స్పందనమే. సృష్టికారకత్వమనియు ధ్వని, దానిని కలుగ జేసిన వాయువు మొదలుగా గల పంచభూతోత్పత్తి స్పందనానంతరము గుణముద్భవించుట మొదలగు సృష్టి రహస్యముల నెరుక పరచిరి. అనంతరము విష్ణువన సర్వవ్యాపకత్వము, స్థితి పోషించుననియు తదనంతరము లయము కావించుట కనువగు మూడవ నేత్రము (అగ్ని), శిరస్సునందుగల గంగ (ఆపస్సు) పరిణామము చెందుట కనువగునని మాత్రమే అగుట శివుడి లయకారతత్వం (పరిణామము) సూచితములగుట లేదా ?
ఇక ఉపాసనాక్రమమున తొలుత గుర్తు తెలుపువారు గురువులగుదురను లోకోక్తి ప్రకారము, వారి వారి శిష్యులచే గురుధ్యానమును చెప్పించి, గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడని, తామే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుల మగుదుమని చెప్పించి, పరబ్రహ్మ స్వరూపులు కానందుననే శిష్యుల ఇష్టదేవతలను నెపమున వివిధములగు మంత్రముల నుపదేశించుట యెరుంగుదుము. లేనిచో, శిష్యుని | ఇష్టదైవమును తమయందే చూపగలిగి యుందురు గదా.
అట్టివారు ప్రధమముగా దేవతా స్వరూపముల దెల్పి, అందు కొందరు ఇష్టులుగను, కొందరయిష్టులుగను (ఇష్టారి చక్రముచే చూచి) ఫలితముగ “మను ఇష్టకామ్యార్థ సిధ్యర్దే” అనునది సంకల్పముగను (అసలు చెప్పుకొన వలయునన్నదే సంకల్పము కానట్లు) అట్టి దేవతానుగ్రహము పొందగల బీజాక్షరముల కొన్ని సంపుటీకరించి (మిగిలినవి బీజాక్షరములు కానట్లు) వీని ననుభవించి ఎరింగించిన ఆది ఋషిని, ఉచ్చరితోపయుక్తమయిన ఛందస్సును, తెలిసికొను యుక్తిని కీలకముగా తెల్పి, ఆసనశుద్ధి గావించి, తన దేవతా స్వరూపమును ధ్యాన శ్లోకానుసారము భావించుకొని, నిల్పి; మరి కొన్ని బీజాక్షరములచే అంగన్యాస కరన్యాసంబుల (తన యందే నిల్పుకొనుటను) అనంతరము బాహ్యమున గల ప్రకృతి నామరూప భేదములు తను కంతరాయము కలిగింపకుండులాగు దిగ్బంధము గావింతురు.
ఇట్లు, తమ ఇష్టదేవతా తాదాత్మ్యము చెంది, అనుష్టించిన మంత్ర రూపము ననుభవించి, తన దేహమున బాహ్యముననే గాక, అంతరమున గల భౌతిక, పారమార్ధిక పరివర్తనానుభవములు తన ఆరాధ్య దేవతవేగాని, తనవి గావను ఫలితము పొంది, తిరిగి వ్యుత్థాన దశను పొందుటకు ముందుగనే దిగ్వికము చెప్పుకొను చుందురుగాని, తామను భవించిన అభేద ప్రతిపత్తి బహిర్గత మగుడు అనుభవింప నేరకున్నారు.
ఇందు తమ గురు, మంత్ర, దేవతా రూపములలో అభేద ప్రతిపత్తి కల్పించుకొని, ఈ త్రిపుటి రాహిత్యమగు ఏకత్వము ఐక్యత, తనయందే అనుభవించి యుంట సూచితమగును. దీన, తన హృదయమందే ఇష్టదైవ మున్నదని గాని, తన ఇష్టదైవ హృదయములో తానున్నట్లుగాని భావించి సాకారోపాసన చేయుట పరిపాటి. ఫలితము త్రిపుటీ రహిత ఐక్యతయే సాకారోపాసన ఫలితమగును. క్రమతః సగుణోపాసనయే నిర్గుణోపాసనగ పరిణతి చెందును.
“చూచునది చూడచూడగ, చూచుట లేకుండపోయి చూచెడి తనలో యోచించు చోట లయమై యోచన కందని సుఖంబునిడు”.
ఇట్లే మరి కొందరు ‘యంత్రముల’ నొసంగుటయు కద్దు. యంత్రమన సత్యము నెరుకపరచు ఉపకరణమే యగును గాన ‘పిండాండ’ ‘బ్రహ్మాండముల, తన యందే సూక్ష్మమునగల శరీరమున కంటె యోగ్యమైన యంత్రమితరమేది యుండ నొపును? Microcosm – Macrocosm అట్లగుటవల్లనే కొందరుత్తీర్ణులైన సాధకులు తరచు తమయందే త్రివేణీసంగమము (నదులు), పుణ్యక్షేత్రములు (కాశీ etc.) పర్వతానేకములు (మేరు మందరములు) సూర్యచంద్రుల నందరను దర్శింప గలిగి యుండిరి కదా! దీనిని హృదయాంతర్గత మగు ఆకాశమున, సుషుమ్నాంతర్గతమైన ఆకాశమున చూచితి మనిరిగాని, ఈ రెండును ఒకటియే అనియు తోచును. ఇక, కాలము నెంచుతరి, ఉచ్ఛ్వాస, నిశ్వాసరూపమున గల లెక్కను 21,600 శ్వాసలుగను వీనిలో 6000 విఘ్నేశ్వరునికి మొ., కాలనియతిని అతిక్రమించుటయు చెప్పిరి. ఇది దేశ (ఆకాశ) కాలముల నతిక్రమించు సాధనగాక మరేమి? ఇట్టి తరి తన ఇష్టదేవతతో తాదాత్మ్యము చెంది యుండునపుడు ఆయా దేవతా స్వరూపములు తామే యగుటయు విదితము. అప్రయత్నముగ ఆయా ముద్రలు తమంతట తామే బహిర్గత మగుట సహజమే యగును. ఇందు సంకల్ప ప్రయత్న భాగము లెవ్వియ లేవు.
ఇట్టి దేశ కాలాతీత స్థితి నంది, పరబ్రహ్మతో ఐక్యత నెరిగిన అద్వైత సిద్ధులు శ్రీసాయి బాబా వలె ఎవరెవరి ఇష్టదైవముల (గణపతి, దత్త, శివ, కృష్ణ, రామ) తమయందే శిష్యుల కగుపరచిరనుటలో అతిశయోక్తి ఇసుమంతయు లేదు. ఏది ఔను, ఏది కాదు అను విచక్షణ అవసరము లేదు, సర్వమూ సాధ్యమై యుండును.
కావున గురువగు వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనందున, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపునిలోగల సృష్టి, స్థితి, లయ (పరిణామ) వృత్తుల వెనుక చేయుట గమనార్హముగాన ‘గురుస్సాక్షాత్ పరబ్రహ్మ’ అను అనుభవము నందే తక్కుంగల కరణమున్నూ ఇమిడి యున్నవని సూచితము.