ఉత్తరాంధ్రలోన ఉద్యమ స్ఫూర్తితో
అమ్మ ఆశయమ్ము ననుసరించి
అన్న వితరణమ్ము హాయిగా సాగగా
తనువు పులకరించు; మనసు పొంగు.
అమ్మ ప్రకటించె యుద్ధమ్ము ఆకలి పయి;
కావలయు గాదె సైనికుల్ కదనమునకు;
కండ గలవారు దండిగా ‘గుండె గలుగు
గుండిగల వారు’ మెండుగా కూడి రిచట.
పాలకొండలోన పార్వతీ పురమున
శ్రీ విశాఖలోన చిత్తమలర
విజయనగరమునను వెలుగులు నింపుచు
సాగుచుండె మాతృయాగ దీక్ష.
వైభవముగ అమ్మ పరిణయ పర్వాన
విందు భోజనమ్ము లెందు గనిన
అమ్మపెండ్లి మరియు అన్నప్రసాదాలు
సాగె, అమ్మ మిగుల సంతసింప.
‘చదువు నేర్పి అమ్మ సంస్కారమును పంచె,
బ్రతుకు తెరువునిచ్చి బాగుచేసె’
నన్న గుండె చప్పు డందరిలోనుండి
కార్యరూప మొంది కదలి వచ్చె.
సర్వేశ్వరి సేవలలో
పూర్వపు విద్యార్థు లి ట్ల పూర్వముగా ఈ
పర్వము నెన్నో తావులు
నిర్వహణము చేసినారు నిరుపమ భక్తిన్.
అమ్మ పూజ యనగ ఆర్తుల ఆకలి
తీర్చు లగును, తృప్తి కూర్చు టగును.
అనుదినమ్ము వారి నాదుకొనెడువారి
గెలుపుదారి లోన నిలుపు అమ్మ.