“గోపనమంటే రక్షించడం. విష్ణువు చేత సమస్త భువన సంరక్షణం చేయించే లలితాదేవి గోపి.
భూమిని రక్షించేవాడు గోవిందుడు. విశ్వమయుడై, లోకరక్షకుడైన విష్ణువే గోవిందుడు. గోవిందరూపుడైన విష్ణువే శ్రీదేవి. సమస్త భువన పాలనం సాగించే గోవిందుని రూపంలో ప్రకాశించే దేవి గోవిందరూపిణి” భారతీవ్యాఖ్య.
“నా విష్ణుః పృథివీ పతిః” విష్ణువుకాని వాడు – రాజు కాలేడు – అని ఆర్షవాక్యం. అంటే విష్ణు అంశతో పుట్టినవాడు భూమిని పరిపాలించే సమర్థతను పొందగలడు అని అర్థం. ‘వేదత్రయమూర్తయః’ అని వేదాల్లో చెప్పిన త్రిమూర్తులే బ్రహ్మవిష్ణు మహేశ్వరులు. ఈ ముగ్గురిలోనూ భూమిని పరిపాలించే రాజు విష్ణుమూర్తి అంశతోనే ఎందుకు జన్మించాలి? అంటే సమస్త భువన సంరక్షణమనే గురుతరమైన బాధ్యతను శ్రీమాత శ్రీమహావిష్ణువునకు అప్పగించింది. ఆ దేవదేవుడు శ్రీదేవి ఆదేశానుసారం భువన రక్షణ భారాన్ని తాను వహించాడు. ఇది పైకి కనిపించే విషయం. అయితే, “యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా” అని పెద్దలు చెప్పినట్లు, విష్ణుమూర్తి రూపంలో భువన రక్షణభారాన్ని వహిస్తున్న తల్లి శ్రీలలితాదేవే. కనుక, శ్రీమాత గోవిందరూపిణి.
“అమ్మ”గోప్ర్తి గోవిందరూపిణి. “అమ్మ” బిడ్డలందరికీ, తమకు రక్షణ కవచంగా ‘అమ్మ” ఉన్నది – అనే విశ్వాసం వారి అణువణువులోనూ నిండి ఉంది. గోప్తి అయిన “అమ్మ”ను గోవిందరూపిణిగా భావన చేసిన “అమ్మ” బిడ్డలందరూ – ముక్కోటి ఏకాదశి పర్వదినంనాడు, అర్కపురినే వైకుంఠంగా భావించి, “అమ్మ”ను శ్రీ మహావిష్ణువుగా సంభావించి, ఉత్తర ద్వార దర్శనంతో ప్రారంభించి “అమ్మ”ను అర్చించి, తమ జన్మధన్యం అయిందని ఎంతో మురిసిపోతూ ఉంటారు. “అమ్మ” జన్మ తిథి కూడా ఏకాదశి కావడం మరొక విశేషం. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా గోవిందరూపిణిగా “అమ్మ” ఉత్తరద్వార దర్శనం అనుగ్రహించి తన బిడ్డలకు అంతులేని ఆనందాన్ని అందిస్తుంది.
“అమ్మ”-గోప్ర్తి . అది 1978 ఆగష్టు 22వ తేది. ఆనాడు, అర్కపురి ప్రజలకు “అమ్మ” గోప్తిగా సాక్షాత్కరించిన పుణ్యదినం. కీ॥శే॥ కొండముది రామకృష్ణ అన్నయ్య “అమ్మ” గది నుంచి వస్తూ ఉండగా, చెలమచర్ల రఘునాథ్ అనే విద్యార్థి ఎదురైనాడు. అతడు మేడపైన ఉన్న నీళ్ళ ట్యాంకులోని నీళ్ళల్లో కలపడానికి, బ్లీచింగ్ పౌడరు కలిపిన నీళ్లు ఒక బొక్కెనతో పట్టుకుని వెళ్తున్నాడు. ఆ ట్యాంకులో నీళ్ళు కలపడానికి వెళ్ళాలంటే కర్రల వంతెన దాటాలి. అది నేలనుంచి దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్నది. దానికి క్రింద నాపరాళ్ళు పరచి ఉన్నాయి. మధ్యలో ఇనుప కడ్డీలు, ఎలక్ట్రిక్ తీగెలూ ఉన్నాయి. చూడడానికి అది ఒక మృత్యుకుహరంలా ఉన్నది. అన్నయ్యను నవ్వుతూ పలకరించి, ఆ విద్యార్థి కర్రలవంతెన వైపు సాగాడు. అన్నయ్య ముందుకు కదిలారు. ఇంతలో దభీమన్న చప్పుడు వినపడడం, అన్నయ్య వెనక్కి తిరిగి చూడడం, విరిగిన కర్రల వంతెన గాలికి ఊగుతూ కనిపించడం ఒక్క క్షణంలో జరిగిపోయాయి. అన్నయ్య గబగబా వెనక్కి వచ్చి, క్రిందకు చూస్తే ఏముంది ? నాపరాళ్ళ మీద పడిన ఆ విద్యార్థి “అమ్మా! అమ్మా!” అని ఆర్తనాదం చేస్తున్నాడు. అన్నయ్య పరుగు పరుగున క్రిందకు వచ్చి, ఆ విద్యార్థిని ఎత్తుకుని ఆసుపత్రిలో పడుకోబెట్టారు. డాక్టర్ సత్యం అన్నయ్య, డాక్టర్ ఇనజ కుమారి అక్కయ్యలు వచ్చి ప్రాథమిక చికిత్సలు చేశారు. కాని, వారికి ఆ విద్యార్థి పరిస్థితి ఏమిటో స్పష్టంగా తెలియలేదు. ప్రాణభయం లేదని చెప్పలేం. అంత ఎత్తునుంచి పడినందువల్ల లోపలి ఎముకలు విరిగి ఉండవచ్చు. లోపల్లోపల కనపడని గాయాలు తగిలి ఉండవచ్చు. మూత్రకోశం దెబ్బతిని ఉండవచ్చు; పై నుంచి పడిన షాకులో మెదడు దెబ్బతిని ఉండవచ్చు; ఏదైనా జరిగి ఉండవచ్చు. ఏం జరిగిందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేం – అని తమ నిస్సహాయతను ప్రకటించారు. ఆ రాత్రి అందరికీ ఆందోళనతో నిద్రపట్టలేదు. కాని, ఆ విద్యార్థి మాత్రం ఆదమరచి హాయిగా నిద్రపోయాడు. ఆశ్చర్యం, మరునాడు ఉదయం ఆ అబ్బాయి మామూలుగా లేచి తిరుగసాగాడు.
అవును మరి, “అమ్మ” నడయాడుతున్న ఆ పవిత్ర ప్రదేశంలో “అమ్మ” నివాసానికి అతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గోప్రి అయిన “అమ్మ” రక్షణ వలయంలో ఉన్న ఆ విద్యార్థికి ఆపద ఎలా కలుగుతుంది ? అర్కపురీశ్వరి అనసూయా మహాదేవిని గోపిగా దర్శించి, స్మరించి,అర్చించి, తరిద్దాం.
కీ.శే.కొండముది రామకృష్ణ అన్నయ్యకు కృతజ్ఞతలతో