ఈ గ్రంథమును ఆమూలాగ్రం చదివాను. సుమారు 45 సంవత్సరాలకు ముందు అమ్మ సన్నిధిలో అనుభవించిన మధుర సన్నివేశాలను రచయిత గుర్తుకు తెచ్చి ఎంతో సంతోషమును కలిగించారు. ఆయన అనుభవాలలో కొన్నిటికి నాకు గల్గిన అనుభవాలతో సామ్యం ఉండటం వలన నాకు పరమానందం కలిగింది.
ఈ గ్రంథంలో కొన్ని వ్యాసాలు ఆపాతమధురాలు: మరికొన్ని ఆలోచనామృతాలు. ఆలోచనామృతాలలో కొన్నిటిని సంగ్రహంగా విన్నవిస్తాను.
- అందరికీ సుగతే 2. అహంబ్రహ్మాస్మి 3. జన్మ ఒక్కటే 4. ఇంతకీ నేనెవరు ? 5. ఆత్మ సందర్శనము మొదటిదానిలో “నేను నేనైన నేను. అన్ని నేనులు నేనైన నేను” అన్నది అమ్మ సూక్తులలో తలమానికమయినది. ఇది పరిపూర్ణమయిన అద్వైతమునకు ఆదర్శమనవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు –
“అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయ స్థితః” అని చెప్పిన వాక్యభావం పై సూక్తిలో స్ఫురిస్తుంది. “అర్జునా! నేను సర్వభూత హృదయములందు ఆత్మగా ఉన్నాను” – అని భావము. “ఈ సర్వసృష్టి, చేతనము – అచేతనము “పరబ్రహ్మ స్వరూపమే. ఈ సూక్తి “సర్వం ఖల్విదం బ్రహ్మ” – అను మహా వాక్యమును, “చిచ్ఛక్తి శ్చేతనా రూపా జడ శక్తి ర్జడాత్మికా” అన్న లలితా నామములను తలపింపజేస్తున్నది. ‘అందరికీ సుగతే’ – అన్న వ్యాసమును సావధానంగా పరిశీలిస్తే శ్రీ గౌడపాదుల ‘అజాతవాదము’ తప్పక స్ఫురిస్తుంది.
రెండవదయిన ‘అహం బ్రహ్మాస్మి’ అనే వ్యాసం మొదటి దానికి వివరణ అనిపిస్తుంది. ఈ వ్యాసమును చదువుతుంటే – “సత్యపి భేదాపగమే నాథ! తవాహం న మామకీన స్త్వమ్ ! సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః – అనుశ్రీ శంకర భగవత్పాదకృత ‘షట్పదీ’ స్తోత్రంలోని శ్లోకం గుర్తుకు వస్తుంది.
మూడవదయిన ‘జన్మ ఒక్కటే’ – అన్న వ్యాసంలోని – నేను నేనైన నేను. అన్ని నేనులు నేనైన నేను” – అనే సత్యమయిన నేను లో అన్ని నేనులు లీనమయి మిగిలేది ఒక్క ‘నేను’ మాత్రమే. అదే పరమాత్మ, పరంజ్యోతి, పరంధామం’, అను విషయమును అనుభవపూర్వకంగా తెలిసికొనటమే అసలు జన్మ. ఆ జన్మ ఒక్కటే. మనము చూచే మిగిలిన జన్మలు అన్నియు ‘అహంకార’ జన్మలే.
నాల్గవదయిన ‘ఇంతకీ నేనెవరు’? – అన్న వ్యాసం శ్రీ భగవద్రమణ మహర్షి ప్రవచించిన ‘నేనెవరు?’ – అను విచార మార్గమునకు అద్దం పడుతున్నది.
ఇక అయిదవదయిన ‘ఆత్మ సందర్శనము’ – అనే వ్యానం పరిమాణంలో చిన్నదయినా భావంలో అపారమయినది. ఆత్మ నామ -రూప రహితము, జ్ఞానమయము గనుక ఆత్మ సందర్శనమనగా జ్ఞానం కావటమే. అనగా, ఆత్మగా ఉండటమే అని మహర్షి వివరించారు.
ఈ గ్రంథమును చదువుతుంటే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు అమ్మను జగన్మాతగా భావించి ఆమెకు సర్వాత్మనా శరణాగతి చేసిన విషయం విస్పష్టంగా గోచరిస్తుంది. ఆయన జీవితం ధన్యం!
“యే యథా మాం ప్రపద్యన్తో తాంస్తథైవ భజామ్యహమ్ |
మమవర్మాను వర్తనే మనుష్యాః పార్థ! సర్వశః ॥
అన్న శ్రీకృష్ణ భగవానుని వాక్యం ఈయన పట్ల సార్థకమయింది.
“స్వైరం గృహీతవనితా వపుషా ప్రమేయా
భూమాకృతిః పరచితిర్ధరణీతలే స్మిన్ |
మాయావిలాసమభినీయ చ యా స్వధామ్ని
లీనా సదాభవతు సా జగతో హితాయ | (స్వీయము)
తనలో నేననేది అంతటా ఉంది.