పూజ్యపాదులు శ్రీ హంసానందస్వామివారిచే సంతరింపబడిన క-ఖ-గ-ఘ’ అను పేరు గల గ్రంధము ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఆవశ్యపఠనీయము. ఇందలి వ్యాసపరంపర ముక్తి సౌధశిఖరారోహణమునకు సోపాన శ్రేణి అనదగి యున్నది. కర్మ-భక్తి-జ్ఞానయోగములు మూర్తీభవించిన మహాపురుషులగు శ్రీ శివానందస్వామి చరణుల అడుగుజాడలలో నడిచి ఉత్తమసాధకులుగా రూపొందిన శ్రీ హంసానంద స్వామి తమ అనుభవసారమును ఈ గ్రంథమునందు నిక్షిప్తము గావించినారు.
మానవుడు తాను ఎక్కడ నుండి వచ్చెనో ఎందుకు వచ్చెనో స్పష్టముగా తెలిసికొనవలసియున్నది, పిమ్మట తాను దైనందిన జీవితమునందు కర్మములను ఎట్లు ఆచరింపవలెనో తెలిసికొనవలెను. ఇట్టి వివేకమునకు మూలము చక్కని విద్య. ఇట్టి విద్యవలన సత్యము. క్షమ, ఆర్జనము, పాపభీతి, భగవద్భక్తి, సజ్జన సాంగత్యము మొదలగు దివ్యగుణములు పెంపొందును. ఈ విషయములన్నియు ఈ గ్రంథపఠనము వలన కరతలామలకము లగును.
ఈ గ్రంథమునందలి ప్రతి వ్యాసము శ్రద్ధాసక్తులతో పలుమారులు చదివి తత్సారమును సాధకుడు జీర్ణించుకొన వలసియున్నది.
రచయిత శ్రీ హంసానంద స్వామి తమ ‘మున్నుడి’లో చెప్పినట్లు – ‘క్షరము కాని వస్తువు లభింపనంతవఱకు అక్షరాభ్యాసమునకు అంతము లేదు. పరావిద్య పొందబడనంత వఱకు అపరావిద్యోపాసన కొనసాగుచునే యుండును. జ్ఞాన శిఖరమును చేరుకొన నంతవఱకు వేదాంత సాధనాభ్యాసమునకు అంతము లేదు. ఈ కారణముచే అక్షరాభ్యాసము జీవితాంతము వఱకు కొనసాగుచునే యుండ ‘వలెను”- అను విషయము ప్రతిసాధకుడు తప్పక గుర్తు పెట్టుకొనవలసిన అంశము.
మహాత్ముల ప్రబోధములు తత్త్వవిచారణమునకు, స్వరూపప్రాప్తికి సాధనములు. ఇందలి విషయములు నిత్యజీవితమునందు ఆచరణ సాధ్యములా? అను సందేహమునకు తావీయక శ్రద్ధాభక్తులతో ఏమరుపాటులేక నిరంతరము అభ్యసింపదగినవి.
“విచారణ మెంతవఱకు ఆవశ్యకము?” అను ప్రశ్నకు భగవద్రమణమహర్షి. “మనస్సునందెంతవఱకు విషయ వాసనలు వసించి యుండునో అంతవఱకు “నేను ఎవడను?” అను విచారణము ఆవశ్యకము” అని సమాధానమిచ్చినారు. ఇట్టి విచారణమునకు ఈ గ్రంథపఠనము అవశ్యముగా దోహదము చేయగలదు. అల్ప ప్రమాణము గల్గి అనల్ప ప్రయోజనమును సాధించునట్టి ఈ యుత్తమ గ్రంథమును రచించిన శ్రీ హంసానందస్వామి సర్వదా అభినందనీయులు, సాధకులకు సర్వదా మార్గదర్శకులు. శ్రద్ధాళువులయిన సాధకులు ఈ గ్రంథమును అధ్యయనము చేసి పరమ ప్రయోజనమును పొందుదురుగాక.