1. Home
  2. Articles
  3. Viswajanani
  4. గ్రందసమీక్ష (పూజా పుష్పాలు)

గ్రందసమీక్ష (పూజా పుష్పాలు)

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2014

గ్రంధరచయిత: శ్రీమాన్ బృందావనం రంగాచార్యులు

ప్రచురణ: శ్రీ విశ్వజననీ పరిషత్ జిల్లెళ్ళమూడి-522113

బృందావనం వారి నందనవనంలో విరిసిన పారిజాతమే ‘పూజాపుష్పాలు’ అనే ముక్తక కావ్యమంజరి. మిత్రుల ద్వారా అమ్మను గూర్చి విన్నంతనే రచయితలో కలిగిన స్పందనే ‘పూజాపుష్పాలు’ అనే పద్యకావ్యరూపాన్ని సంతరించుకుంది. ఆ తరువాత అమ్మ సన్నిధికి వచ్చి భక్తి భావసుధామయ మధురోక్తులతో కావ్య గానం చేసి అమ్మకు ఆ పద్య సుమాలను సమర్పించారు. ‘అందుకొనువమ్మ హృదయ పుష్పాంజలులను’ అన్న పలుకులు వీనులు పడగానే అనురాగలహరి పొంగి పొర్లుతుండగా వ్రాలి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్న రచయితను అమ్మ అప్యాయంగా దగ్గరకు తీసుకున్నది.

అమ్మ దర్శనం ఎంతటి ప్రశాంతినీ, హాయినీ కలిగిస్తుందో అంతకు మించి అమ్మ సంస్పర్శ ప్రత్యణువునూ పులకరింపచేస్తుంది. అమ్మ దివ్య స్పర్శాను భూతినీ, అమ్మ వాత్సల్యామృతాన్ని ప్రత్యక్షంగా చవిచూశారు. కనుకనే:

‘ప్రత్యణువున్ ప్రఫుల్లమయి పావనమైనది నీవు ముట్టినన్’ అని అమ్మ స్పర్శ నిత్యమూ సత్యమూ అయిన వెలుగును ఆత్మయందు నిల్పిందని తెలియచేశారు.

అమ్మ చరిత్రను పరిశీలిస్తే తాను కనీసం ప్రాథమిక పాఠశాలకు కూడ వెళ్ళినట్లు కన్పించదు. “అనుభవం శాస్త్రాన్నిస్తుంది. కానీ శాస్త్రం అనుభవాన్నివ్వదు.” అంటూ ఏం చెప్పినా తన అనుభవమే ప్రమాణంగా చెప్పింది. అమ్మ. సహజ పాండిత్యంతో అనుభవపూర్వకంగా సహజంగా వెలువడిన అమ్మ మాటలు అమ్మ వాగ్వై దుష్యాన్ని తెలియజేస్తాయి. వేదవేదాంగ పారంగతులు కూడ అమ్మవాక్కులో, ఋక్కుల్ని కని విని ముగ్ధులై తల్లి శ్రీచరణాల చెంత మోకరిల్లేవారు. నిగమనిగమాంతసారాలన్నీ అమ్మ నోటి వెంట అలతి అలతి మాటలతో ప్రసృతమయ్యేవి. అట్టి అమ్మ సహజపాండిత్యప్రకర్ష గురించి “జనని! అమర సరస్వతీ! జయము జయము” అనే మకుటంతో తొమ్మిది పద్యాల్ని నవమాలికాస్తోత్రంగా అల్లి అమ్మ గళసీమ నలంకరించారు.

మచ్చునకు ఒక పద్యకుసుమం:

‘ఉపనిషత్తులనున్న మహోజ్వల ప్ర

` శస్త్ర సూక్తులు నీ నోట జాను తెలుగు

మాటలై వేత్తలగు వారి మనసులూపె

జనని! అమరసరస్వతి ! జయము జయము !

అమ్మ అమరసరస్వతి; అంటే ప్రశ్నించకుండానే సందేహాన్ని గుర్తించి సంశయ చ్ఛేద వచనాన్ని ప్రసాదించేది.

అమ్మ జీవితాన్ని అవగాహన చేసుకుని అమ్మ తత్త్వాన్ని వర్ణించాలంటే పాండిత్యం ఒక్కటే సరిపోదు. ఈ లౌకిక వాసనలు సోకని మనోనిష్ఠకావాలి.

“మాటలతోడ జెప్పగల మాత్రపు టర్హత గూడ లేదు మా బోటుల కో జగజ్జనని! పూర్ణమహా మహిమమ్ము నీది వాక్పాటవమున్న జాలదు. భవత్ప్రతిభల్గన లౌకికంపు జంజాటపుగాలి సోకని విశాల మనోనియమమ్ము గావలెన్” – అని సాంసారిక బంధవిముక్తిని అర్థించారు.

మహాత్ముల సన్నిధి మానవ జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వారి ప్రవర్తన వలన మనిషిలో సాధుభావాలు పెరిగి పారమార్థిక చింతన వైపు దృష్టి మరలుతుంది. వారి సాన్నిధ్యమే ఎందరినో ఎంతగానో ప్రభా వితం చేస్తుంది. ఆ భావాన్ని ఆ ప్రభావాన్ని ఆ స్వభావాన్ని “పకపకలాడుచుందువుము భావముగా అసలా స్వభావమే యొక నవభావమై హృదయమున్న జనమ్ములలో ప్రభావమున్ ప్రకటన జేసి పాశవిక భావముల నరగించి పారమార్థికమును బెంచి మానసికరీతుల కద్దెను సాధుభావముల్”- అనే పద్యాల్లో అక్షరరూప చిత్ర మాలికలుగా ఆవిష్కరించారు.

అమ్మ వద్దకు తరలివచ్చే భక్త జన సందోహాన్ని చూసి వాడలు వాడలే కదలివచ్చుచుచున్నవి’ అని ఆశ్చర్యచకితులయ్యారు. ‘అమ్మ నాది’ అనే భక్త్యావేశంతో పరవశించారు. కనుకనే

“పాడి తరింపగా మధుర భావనల న్గయిమోడ్పు తీయగా

కూడి భజింపగా తలచుకొన్న విధమ్ముగ సంస్మరింపగా

వీడకవచ్చుచుండిరి కవీశయతీశ బుధేశు లెందరో

యేడవ మైలు రాయి కడనేని స్మరించెడి భాగ్యమబ్బునా?”

అంటూ అమ్మ పావన సాన్నిధ్యానికీ, మధుర వాత్సల్యానికీ ఎక్కడ దూరమౌతానో అని కలవరపడ్డారు. మధుర కవులు శ్రీరంగాచార్యులు గారు.

“శ్రీరాజేశ్వరియై సనాతన తపస్సింహాసనమ్మందు లో

కారాధ్య ప్రతిభా విభూతులను నిత్యమ్మున్ ప్రసారించు స

త్కారుణ్యమ్మున పావనుల్ పతితులేకమ్మై తరింపంగ నూ

త్నారంభ మొనరించినట్టి అనసూయామాతకున్ మ్రొక్కెదన్”

-అన్నారు. గ్రంథారంభంలో

అమ్మ అవతార లక్ష్యం దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కాదు; అమ్మ దృష్టిలో పతితులు- పావనులు అనే విభజన లేదు. కరుణతో అందరినీ తరింపచేసేతల్లి. ఇది చరిత్ర ఎరుగని నూత్నారంభం; అమ్మ ఎంచుకున్న విశిష్ట విలక్షణ మార్గం – అంటూ అమ్మ అతిమానవ దివ్యతత్త్వానికి నిలువెత్తు దర్పణం పట్టారు.

“తావకాలోకన భాగ్యముంగని ప్రలోభము జూపెడి

తత్త్వమొక్కటే మాకు వరమ్ముగా నొసగుమా!

కొనుమా! జననీ! నమస్సులన్” అంటూ

అమ్మదర్శన భాగ్యమే మహదైశ్వర్యము అని విశ్వసించారు. కనుకనే –

 “అమ్మ! నీ ప్రసన్న దర్శన భాగ్యమే యున్న యీధనమ్ము ధాన్యమ్ములున్ గనకమ్ములేల?” అంటూ అమ్మ అమోఘ ఆశీస్సులుంటే చాలు – ఈపాడి పంటలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, సిరిసంపదలు ఎందుకుఅన్నారు; ఒక అద్భుత పారమార్థిక సత్యాన్ని నిసర్గ సుందరంగా వ్యక్తీకరించారు.

“మందం మందం మధుర నినదైర్వేణు మాపూరయంతం

బృందం బృందావని భువిగవాం చారయంతం చరంతం!

ఛందోభాగే శతమఖిముఖ ధ్వంసినాం దానవానాం

హంతారం తం కథయరసనే గోప కన్యా భుజంగం||”

అన్నట్లు బృందావనంలోని మాధవుని మురళీనాదాన్ని ఆస్వాదించి రాధ, గోపికలు తన్మయులైనారు. అట్లే:

శ్రీబృందావనం వారు తమ ‘పూజాపుష్పాలు’ అనే మాతృభక్తి భావ స్ఫోరక గ్రంథం ద్వారా అమ్మ మధురమాతృతత్వాన్నీ, జిల్లెళ్ళమూడి క్షేత్ర వైభవాన్ని, అమ్మ నామరూపగుణ వర్ణననీ, ‘అంఆ లోని అగోచరార్థ విజ్ఞానాన్నీ జగన్మాత వంశీ నాదంగా వినిపించారు.

ఈ గ్రంథాన్ని మీరూ చదివి మాతృవేదనాదాన్ని ఆలకించి ఆనందించండి;

“ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్” అనే ఆప్తవాక్యార్థం

“అమ్మ బ్రహ్మేతి వ్యజానాత్” అని తెలుసుకోండి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!