1. Home
 2. Articles
 3. Viswajanani
 4. గ్రంధసమీక్ష (“అద్భుతచారిత్ర” – హైమవతీశ్వరి హృత్కమలం)

గ్రంధసమీక్ష (“అద్భుతచారిత్ర” – హైమవతీశ్వరి హృత్కమలం)

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : June
Issue Number : 11
Year : 2011

“అద్భుతచారిత్ర” గ్రంధం – జగజ్జనని శ్రీచరణార్పిత అద్భుత ఆధ్యాత్మిక సాహిత్య సౌగంధిక కుసుమం; పరమేశ్వరి లీలా విలాస ప్రబోధక జ్ఞానదీపం. ఈ గ్రంధాన్ని చూడగానే హైమక్కయ్య, రమణ మహర్షులు జ్ఞప్తికివస్తారు.

‘హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం 

ఆహమహమితి సాక్షాత్ ఆత్మ రూపేణభాతి’ అని అన్నారు మహర్షి మరి హైమక్కయ్య హృదయకుహరంలో ప్రకాశించే బ్రహ్మ అమ్మ. శ్రీ లలితా సహస్రనామ పారాయణ ద్వారా జగన్మాత అమ్మను ఉపాసించి దైవత్వ పీఠాన్ని అనాయాసంగా అధిష్టించిన అనితరసాధ్యమైన సాధనా రూపమే హైమక్కయ్య.

అమ్మ శ్రీ చరణసన్నిధిలో శ్రీ లలితాకోటినామ పారాయణ యజ్ఞానికి కంకణం కట్టుకున్నది శ్రీరాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్య. ఈ నేపథ్యంలో ఆ నామముల అర్థాన్నీ, పరమార్థాన్నీ విపులీకరిస్తూ ‘భారతీవ్యాఖ్య’ను రచించారు శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావుగారు.

కాగా జిల్లెళ్ళమూడి సోదరీ సోదరుల హృదయాంతరాళాల్లో చిరకాలంగా ఒక వెలితి ఒక అసంతృప్తి, కన్పిస్తోంది జ్వలిస్తోంది. అద్భుతచారిత్ర గ్రంథావిష్కరణతో ఆ లోటు తీరింది, ఆనందం వెల్లి విరిసింది. ఆశ్చర్యకరవాత్సల్య అమ్మ. అద్భుతచారిత్ర అమ్మ. కాలాతీత మహాశక్తి అమ్మ. అమ్మరూపం పరిమితం, శక్తి, అనంతం. శరీరధారణతో చరిత్ర బద్ధమైనది దివ్యమాతృ ప్రేమ.

తల్లిలేని తల్లి అమ్మ అంటే ఆద్యంతాలు లేని మూలప్రకృతి. అట్టి జగన్మాత వైభవాన్ని లలితాసహస్ర నామ పూర్వకంగా అందించిన వివరణ, వర్ణన అద్భుత చారిత్ర గ్రంధం – తత్త్వతః హైమక్కయ్య హృత్కమలం. 

ఇంతటి విలక్షణ విశిష్ట రచన చేసినదెవరు ? ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చే ముందు వ్యాసభగవానుని వాక్యాన్ని గుర్తుచేసుకోవాలి.

‘సకల భువన మధ్యే నిర్ధనస్తే పి ధన్యః । 

విలసతి హృదయేషాం శ్రీ హరేర్భక్తి రేకా॥” అంటే

చతుర్దశ భువనాల్లో ధన్యులు ఆస్తిగలవారు కాదు, ఆస్తిక్యత గలవారు.

ఈ గ్రంధరచయిత అట్టి ఆస్తిక్య సంపద గల “శ్రీ” (సర్వతోముఖం).

– శ్రీ అంటే శ్రీధరరావుగారు (రచయిత్రి తండ్రి)

– శ్రీ అంటే శ్రీరంగారావుగారు (రచయిత్రి మామ)

శ్రీ అంటే శ్రీమన్నారాయణమూర్తి గారు)

(రచయిత్రి పతిదేవులు)

– శ్రీ అంటే శ్రీవల్లిగారు (రచయిత్రి)

డా॥ మల్లాప్రగడ శ్రీవల్లి ‘విశ్వజనని’ మాసపత్రికలో ధారావాహికంగా రచించిన ‘అవ్యాజకరుణామూర్తి, సద్గతి ప్రదా, వాంఛితార్థప్రదాయిని, ఆబ్రహ్మకీటజనని, ప్రేమరూపా, స్వభావమధురా….’ ఇత్యాది వ్యాసాలకి మరింత పరిపుష్టిని పురిపూర్ణతని చేకూరుస్తూ పొందుపరచ బడిన శ్రీధరరావు, శ్రీ రంగారావు, శ్రీ మన్నారాయణమూర్తి గార్ల రచనలు అలంకారములు కాగా అలరారే అద్భుత రచనే ‘అద్భుతచారిత్ర’ గ్రంధం. (అలంకరోతీత్యలంకారః)

ప్రతి వ్యాసంలోనూ ముఖ్యంగా నాలుగు విభాగాల్లో నలుగురి రచనలూ కనువిందు చేస్తాయి. ఒక ఉదాహరణగా ‘స్వభావమధుర’ అనే వ్యాససౌందర్యాన్ని తిలకిద్దాం. (పే.32).

1వ భాగం :

శ్రీమన్నారాయణ మూర్తిగారి పద్యం

 ‘తనువు హృదయమ్ము గాయమై తప్తమైన 

బిడ్డలకు నెలవేళల ప్రేమ యొక్కటే 

 పంచి యిచ్చుచు నుండు స్వభావ మధుర…’ 

హృదయంగమంగా మాతృతత్వాన్ని కీర్తిస్తుంది.

2వభాగం :

శ్రీ రంగారావుగారి ‘భారతీ వ్యాఖ్య

‘ స్వభావం చేతనే అందరికీ, సంతుష్టిని కలిగించే దేవి కనుక స్వభావ మధుర…’ అంటూ సకల శాస్త్ర పురాణేతి హాస నిగమాగమసారాన్ని పూర్ణంగా చేసి నోటికి  అందిస్తారు.

 

3వ భాగం : శ్రీధరరావుగారి రచన :

 ‘నమ్మితి నీ పదాబ్జములు, నమ్మితి నీదగుసూక్తి సత్యమున్

నమ్మితి నీయనుగ్రహము, నమ్మితి నిన్ కడచేర్చు

తల్లిగా…” 

అంటూ అమ్మమహత్తత్వాన్ని, అమ్మ ఎడ శరణాగతి, భక్తి ప్రపత్తి మార్గాలను వినయంగా విశదీకరిస్తారు.

4వ భాగం:

రచయిత్రి స్వీయరచన, సంస్కార రూప సహస్రదళ సిత పంకజార్చన. సోదరి శ్రీవల్లి తాను దర్శించిన సత్యాన్ని, మాతృశ్రీ ప్రాభవాన్ని అనేక కోణాల్లోంచి విపులీకరించడం, అనేక ఉదాహరణలతో ఋజువు చేయడం ఇక్కడి రచనా విశేషం. ‘స్వభావమధుర’ వ్యాసంలో ఎనిమిది ఉదాహరణలనిచ్చి తాను త్రికరణశుద్ధిగా విశ్వసించిన అలౌకిక భావాన్ని అక్షరబద్ధం చేశారు. 

 1. తన బాధను పైకి తెలియనివ్వక వైద్యులకే విభ్రాంతి కల్గించిన అమ్మ స్వభావమధుర.
 2. తన అనారోగ్యాన్ని లెక్కించక, బాధల్ని ప్రక్కకు నెట్టి దర్శనభాగ్యాన్ని ప్రసాదించిన అమ్మ స్వభావ మధుర.
 3. అయాచితంగా, అలౌకికానందానుభూతులను పంచి ఇచ్చిన అమ్మ స్వభావమధుర.
 4. బిడ్డల ఆనందం కోసం, వీసమెత్తు బాధనైనా  ముఖంలో కనపడనీయని అమ్మ స్వభావ మధుర. 
 5. (తనశరీరాన్ని నిర్లక్ష్యం చేసి) చెరగని చిరునవ్వుతో భక్తులను అలరించిన అమ్మ స్వభావమధుర.
 6. (భక్తులు) బిడ్డల మూర్ఖత్వాన్ని మనసారా క్షమించి, మౌనంగానే బాధను అనుభవించిన తల్లి అనసూయమ్మ స్వభావమధుర.
 7. ఎంతో మంది ఆకలిని తీర్చి, జీవితాన్ని తీర్చిదిద్దిన అమ్మ స్వభావ మధుర.
 8. మన లోపాలనూ పాపాలనూ పట్టించు కోకుండా, మనల్ని పసిపాపలుగా లాలించి పాలించిన మాతృశ్రీ అనసూయా మహాదేవి స్వభావ మధుర.

రచయిత్రి అనతికాలంలో మిగిలిన లలితాసహస్ర నామాలకు అమ్మ మహోదాత్త తత్త్వపరంగా వ్యాఖ్యానాన్ని వ్యాసరూపంగా అందిస్తారని ఆశిద్దాం, ఎదురు చూద్దాం.

 ‘యధావృక్షస్య సంపుష్పితస్య దూరార్గంధో

వాత్యవం పుణ్యస్య కర్మణోదూరాద్గంధోవాతి’

 అంటుంది వేదం. అట్టి అమ్మ దివ్య ఆశీః పూర్వక పరిమళాలు సర్వదా సర్వత్రా సర్వులనూ పునీతం చేయుగాక!

రచయిత్రి తన జీవితంలోని ప్రతి సంఘటన వెనుక అమ్మ అజ్ఞాతహస్తం, అభయహస్తం అహరహం కాపాడుతున్నది అనే విశ్వాసంతో స్వీయ అనుభవాల్ని అమ్మ అశేష కళ్యాణగుణపరంపరని అణువణువునా దర్శింప చేశారు.

తినబోతూ రుచులెందుకు ?

చదివి, ఆనందించండి; ఆ అమ్మ అమృతత్వ రూప ఆ దివ్యమాధుర్యాన్ని తోడబుట్టిన వారందరికీ పంచండి.

అంతేకాదు, సొంతఖర్చుతో అచ్చొత్తించిన ఈ గ్రంథాలపై వచ్చే ఆదాయం అన్నపూర్ణాలయానికే చెందుతుందన్నారు రచయిత్రి. తలా పది పుస్తకాలు కొని పదిమందికి పంచి అన్నపూర్ణాలయానికి కూడా సహాయ పడవచ్చు. అమ్మ భావాలను పదిమందికి అందించవచ్చు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!