మమత, సమత, మానవత అన్నపుముద్దలో
కలగలిపి మననోటికి అందించు అన్నపూర్ణ ॥
అనురాగం, ఆప్యాయత రంగరించి
మనలను ఆహ్లాదపరచు అనురాగవల్లి ॥
చందమామలో, చల్లగాలిలో పిల్లతెమ్మెరల
చందాన మనమనస్సులకు హాయిగొలుపు చల్లని తల్లి
విరిసే జాబిల్లి చల్లదనాలు, హరివిల్లులోని అందాల
సొబగులను మనకు అందించు విరిబోణి ॥
అందానికి అర్థం, ఆనందానికి భాష్యంగా
మనస్సు అందంగా వుంటే చాలని తెలిపే ప్రేమమయి ॥
అంతులేని జీవనయానంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సమస్యలు
దారితెలియని పోరాటాలలో దారిచూపే మార్గదర్శి ॥
తేనెకన్న తీయనిపలుకులు, మంచుకన్న చల్లనిచూపులు
మల్లెకన్న తెల్లనిమనస్సు, కల్లాకపటం లేని కలభాషిణి ॥
నీ సహజస్వభావం, నీ నిర్మలప్రేమ భావనతో
తోటి సోదరులకు చేయూతనిమ్మనే స్నేహశీలి ॥
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, మంచిని
మనలో పెంపొందించు కరుణామయి
చల్లనితల్లి – జిల్లెళ్ళమూడితల్లి