అమ్మ ప్రసంగంవశాన వెలువరించిన సూక్తులు:
చీకటి లేక పోతే వెల్తురు యొక్క అవసరం, విలువ తెలియదు. లోకమంతా చీకటిలో మునిగినప్పుడు మానవుడు చిన్న వెలుగులకై ప్రాకులాడుతాడు. ఆ వెదుకులాటలో చిరు దీపాన్ని గాంచినా అతని ఆనందానికి అవధులుండవు. ప్రకృతిలోని అందచందాలను గ్రహించాలన్నా, మన నిత్యకృత్యాలను ఆచరించాలన్నా వెలుగు అవసరం.
బరువు బాధ్యతలలో సుఖమనేది తెలుసుకోలేక, విషయ లోలుడైన మానవుడు వెలుగుకై ప్రాకులాడుతాడు. అది లభించే చోటు తెలియక అశాంతితో అలమటిస్తాడు. ఆ విషయాల్లోనే శాంతికై, కాంతికై వెదుకులాడుతాడు. రాగద్వేషాలు, కష్టనష్టాల, బరువు బాధ్యతలతో పెనవేసుకున్న మానవుడు ఆ వెలుగు రేఖకై తపిస్తాడు. అజ్ఞానమనే చీకటి ఆవరించినప్పుడు వెలుగు రేఖలు ఉదయించవు. మనలోని ఆత్మజ్యోతిని తెలుసుకోవటానికి ముందుగా మనలో ఆవరించియున్న అజ్ఞాన మనే తిమిరాన్ని ఆశ్రయించక తప్పదు. “know to unknown” అన్నట్లుగా మనలోని అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని దాన్ని ఛేదించుకుంటూ పోతే ఆవలవున్న జ్ఞానజ్యోతిని కాంచగల్గుతాము.
అజ్ఞానాంధకారంలో జ్ఞానమనే ఆశాజ్యోతి వెలుగులు ప్రసరించాలంటే మానవుడు సత్కర్మలను ఆచరించాలి. మొదట కామ్యంలోనైనా కర్మాచరణ మొదలు పెడితే కాలక్రమేణా కామ్యకర్మలతో విసిగి నిష్కామ కార్యం బలపడుతుంది. నిర్గుణత్వమే సగుణోపాసనకు మార్గం. జ్ఞానోదయం కొరకే మానవుడు నిరంతరం కృషి చేయాలి. ఆ తపనే తపస్సు అవుతుంది. దానికే ‘అమ్మ’ లాంటి వెలుగు ప్రసరించినప్పుడు మనలోని అజ్ఞానాంధకారం, అల్పత్వం సమసిపోయి జ్ఞాన జ్యోతి ప్రకాశించి ముక్తికి సోపానం అవుతుంది. ఆ ‘అమ్మ’ యొక్క వాత్సల్యాంభోనిధిలో మునిగిన వారికి చీకటి అన్న ప్రసక్తే వుండదు. అంతావెలుగుమయమే. ఆ వెలుగు వెంట మానవుడు పయనించి తన గమ్యానికి చేరుకోవాలి. ఆ జ్యోతి ఉదయించినప్పుడు ఉదయ భానుని కిరణ కాంతితో మొదలై మధ్యాహ్న మార్తాండుడివలే వెలుగు విరజిమ్ముతుంది.
అవిద్య నుండీ విద్య, అజ్ఞానం నుంచీ జ్ఞానం, శూన్యంలో నుంచీ సృష్టి, జడంలో నుంచీ చైతన్యం వచ్చినట్లే అమ్మ అన్నట్లుగా “చీకటే వెల్తురుకు ఆధారమవుతుంది.