1. Home
  2. Articles
  3. Mother of All
  4. జగత్తే తల్లి స్వరూపం

జగత్తే తల్లి స్వరూపం

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : January
Issue Number : 1
Year : 2023

విశ్వసవిత్రి అయిన అమ్మ ‘కన్నాంబ’. ‘కన్నాంబ’ అనే పేరు వినగానే సుప్రసిద్ధ సినీనటి గుర్తుకు వస్తుంది. కానీ, కన్నాంబ అంటే కన్న+ అంబ = కన్నతల్లి అని అర్థం. ఎవరికి? అనసూయమ్మ అంటుంది.

“నేనే మిమ్మల్నందరినీ కన్నాను;

మీమీ తల్లులకు పెంపుడిచ్చాను” – అని. ఈ వాక్యాన్ని అధ్యయనం చేస్తే సృష్టి వైచిత్రి, ఆవిర్భావం, పరాత్పరి పంచకృత్యాలు, అన్నీ సుబోధకము లవుతాయి. ఈ మహావాక్య ప్రతిపదార్థం, పరమార్థం, తత్త్వసారం గురించి చివరలో వివరిస్తాను.

మనకి చిత్రము, విశేషము; కానీ అమ్మకి సహజం ఏమంటే – సర్వే సర్వత్రా మాతా శిశు సంబంధ బాంధవ్యమే గోచరిస్తుంది. అసలు మాతృతత్వం స్త్రీలకే ఉంటుంది అనుకోవటం పరిపాటి. కానీ, అమ్మ అంటుంది, “మాతృత్వం వేరు, మాతృతత్వం వేరు. మాతృత్వం అంటే నవమాసాలూ మోసి కనటం, మాతృత్వం అంటే తల్లి ప్రేమ. మగవాడిలోనూ తల్లిప్రేమ ఉంది” – అని.

కలానికి వ్రాసే లక్షణం, ఆ అక్షరాల్ని కాగితం పొందికగా అందంగా ధరించే లక్షణం; గింజల్ని రోకలి పిండిగా చేయడం, గింజలు ఒదిగి పిండిగా మారటం; మట్టిని వేర్వేరు రూపాల్లో కాల్చటం, అది పాత్రలుగా, ఇటుకలుగా మారటం; మొక్కలు శక్తి రూపంగా ఆహారాన్ని నిల్వ చేయటం, జీవులు వాటిని శక్తిగా మార్చుకుని జీవించటం అలా సర్వత్రా పరస్పర ఆలంబనంతో మనుగడ సాగించటంలో మాతా శిశుబంధమే స్పష్టమవుతోంది.

“జగత్తే తల్లి స్వరూపం” అన్నది అమ్మ. అందుకు కొన్ని ఉదాహరణలు –

– అద్వైత తత్త్వ సారాన్ని తేటతెల్లం చేస్తూ అమ్మ వివరించింది. “జగన్మాత అంటే జగత్తుకి మాత అని కాదు. జగత్తే మాత. సృష్టే దైవం. పులి కడుపున పులిపిల్ల పుట్టినట్లు జగన్మాత కడుపున జగత్తు పుట్టింది” – అని .

ఒకసారి అమ్మ ఎడ్లబండిలో వస్తూ నాగజెముడు డొంకలో పడ్డది. ముళ్ళు గుచ్చుకుని అమ్మచర్మం చీరుకుని రక్తం స్రవిస్తోంది. ఆ సందర్భాన్ని విశ్లేషణ చేస్తూ రాజు బావతో అన్నది “నాన్నా! ఆ ముళ్ళవల్ల నాకు నొప్పి కలిగిందన్న ఒక్క విషయం ఆలోచిస్తున్నావు. కానీ, ఆ ముళ్ళమధ్య పసుపుపచ్చగా ఉండే పువ్వు, ఆ పువ్వు ప్రక్కనే కాయ. ఆ పువ్వు ఎంత మెత్తగా ఉందో! ముళ్ళ మీదే కాదు, ఆ పువ్వు, కాయల మీద కూడా పడ్డాను. ఆ కాయ తినటానికి బాగుంటుంది.

నాగజెముడు ముళ్ళు ఎందుకు పెట్టుకుంది? ప్రతిజీవి తన సంతానాన్ని వృద్ధి చేసుకోవటం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ నాగజెముడు తల్లి. తన బిడ్డల్ని రక్షించుకోవడం కోసం ఈ ముళ్ల రక్షక కవచాన్ని పెట్టుకుంది” అంటూ నాగజెముడులోనూ మాతృప్రేమ మాతృ ధర్మాన్ని చూసింది.

– సూర్యుడు (నక్షత్రం), భూమి (గ్రహం) మధ్య బలీయమైన ఆకర్షణ శక్తి (Gravitational Force) ఉన్నది. సూర్యుడు – భూమి మధ్య తల్లీ బిడ్డల బంధమే. సౌరశక్తియే జీవులకు ప్రాణాధారం.

సోడియం పరమాణువు 2 – ఎలక్ట్రాన్లను ఇస్తుంది, వాటిని క్లోరీన్ పరమాణువు స్వీకరిస్తుంది. ఇచ్చి పుచ్చుకోవటంతో రెండూ సంతృప్తి చెంది, వాటి మధ్య బలమైన రసాయన బంధం (Ionic Bond) ఏర్పడుతుంది. ఆ బంధాన్ని సులభంగా త్రెంచలేము. ఎంతో గట్టిది. అదీ మాతా శిశు బంధమే.

– పక్షులు, వృక్షాల్లో శాఖాగ్రాల్లో శిలల్లో భూగర్భంలో గూళ్ళను నిర్మించు – కుని, గుడ్లను, పసికూనల్నీ రక్షించుకుంటాయి. సర్పములు మున్నగు శత్రువులను మోసగించేందుకు గూటికి నకిలీ ప్రవేశ ద్వారాన్ని నిర్మిస్తాయి. అనన్య సామా న్యమైన మాతృప్రేమ అది.

– కంగారు మృగం తన శరీరంలోనే ఒక సంచీ వంటి అరను కలిగి ఉండి

భద్రంగా బిడ్డని పెంచుతుంది.

– పుష్పం మొగ్గగా ఉన్నప్పుడు దానిని సంరక్షిస్తూ రక్షక పత్రాలు, విత్తనంలోని అంకురాన్ని సంరక్షిస్తూ పోషిస్తూ బీజదళాలు మాతృప్రేమని వర్షిస్తున్నాయి. ఆకులు ముళ్ళుగా రూపాంతరం చెంది పత్ర పుష్ప ఫలాల్ని రక్షించుకుంటాయి.

– చిట్టచివరి ఉదాహరణ. ధృవ ప్రాంతంలో గర్భవతియైన ఎలుగుబంటి దుస్సహమైన చలికాలం సమీపిస్తోందని గుర్తించి, కాయలు – గింజలను సేకరించి ఒక గుహలోనికి వెళ్ళి వాటిని పరిచి పైన గడ్డి కప్పి వేసవి వచ్చే వరకు గాఢ నిద్ర (Hybernation) పోతుంది. ఈలోగా తను ప్రసవిస్తే లేచి ఆ గింజల్ని కాయల్ని తిని మళ్ళీ నిద్రపోతుంది. లేచి గింజల్ని కాయల్ని తినటం ఆకలివేసి కాదు; తన పసికూనలకి క్షీరధారలు నిరంతరాయంగా సాగాలని. ఎంతటి ముందు చూపు! ఎంతటి మాతృప్రేమ!!

అలా మాతృత్వ మధురిమ, పరిమళం, వైభవం అణువణువునా విరాజిల్లుతున్నాయి. అందరూ అన్నీ పరస్పరం ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. “కర్మ వ్యష్టికాదు, సమష్టి” అనే అమ్మ వాక్యం ఇందుకు సాధికారిక భాష్యాన్ని సంతరిస్తుంది. “సర్వానికి సర్వమూ ఆధారమే” అన్న అమ్మ వాక్యం ఇందుకు సూత్రంగా నిలుస్తుంది.

బి. శైలజ అనే సోదరి తన Cell Phone Profile లో ‘(I love my daughter)’ అని పేర్కొన్నది. ఏ తల్లి అయినా ఆ మాటే అంటుంది. సహజం. కాకి పిల్ల కాకికి ముద్దు; కోయిల పిల్ల కాదు. కానీ తరతమభేదం లేక లింగ వయో భేదం. ఎంచక ‘అమ్మ’ అందరినీ అన్నిటినీ తన పసికూనలుగా ప్రేమిస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది. విశ్వసవిత్రి కనుక తన ఒడిలో వేసుకుని లాలిస్తుంది. కనుకనే “నేనే మిమ్మలందరినీ కన్నాను, మీమీ తల్లులకు పెంపుడిచ్చాను” – అని ప్రకటించింది. ఈ వాక్యంలో, ఇంకా చాలా అమ్మ వాక్యాల్లో, “నేను” అంటే – బ్రహ్మాండం అనసూయాదేవి అని అర్థం కాదు.

అమ్మ వియదాది జగత్ప్రసూ :- మానవులు, జంతువులు, పశుపక్ష్యాదులూ క్రిమికీటకాదులూ, నదీనదాలు, మొక్కలు, రాళ్ళు-రప్పలు, గ్రహాలు – గ్రహ రాజులు – సర్వాన్నీ కన్నతల్లి విశ్వజనని. సర్వాధారమైన ఆ శక్తి పరిమిత రూపంలో ఒక సామాన్య గృహిణిగా, ఒక మాతృమూర్తిగా మన మధ్య నడయాడింది. మాయా మర్త్యాంగనా కృతిః.

అందరం ‘అమ్మ’ నుంచే జన్మ నెత్తాం. తిరిగి మాతృగర్భంలోనే లీనమవుతాం. అనంత సాగర సదృశ చైతన స్వరూపం. కనుక అందరికీ అన్నిటికీ అమ్మయే అసలైన అమ్మ జన్మదాత.

సృష్టిలో సహస్రముఖాల విరాజిల్లే ధర్మం – మాతృ ధర్మం. సృష్టి మనుగడకి ఆధారం మాతృప్రేమ. ఆ బంధం సముద్రానికి – తరంగానికి, చెట్టుకి – కాయకి, కాయకి-బీజములకు, జగన్మాతకి – జగత్తుకి మధ్యనున్న రక్తసంబంధ బాంధవ్యం.

జగత్తే తల్లి స్వరూపం !!!

జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!