‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ॥ ‘ అనేది గీతాసారం; జగద్గురువు శ్రీకృష్ణపరమాత్మ హామీ.
కానీ అమ్మ “చేతలు చేతుల్లోలేవని” పురుషకారాన్ని పూర్వపక్షం చేసింది.
“నువ్వు చేస్తున్నానని ఎంతగా అనుకొన్నా, ఆ శక్తి అనుకోనిదేదీ చేయించనిదీ, నువ్వు అనుకోలేవు చేయ లేవు” అని వివరించింది. కనుకనే మ్రొక్కిన వారికీ – మ్రొక్కని వారికీ, ఆస్తికులకూ నాస్తికులకూ, శిష్టులకూ దుష్టులకూ… అందరికీ సుగతేనని విస్పష్టంగా అపూర్వంగా చాటి చెప్పింది అమ్మ మాత్రమే చరిత్రలో.
‘గురువు’ అనే పదానికి సంఘంలో కొన్ని పర్యాయపదాలు ఉన్నాయి; ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు… మొదలైనవి. ఉప, సమీపే అధ్యయతి ఇతి ఉపాధ్యాయః (Learning with the children) విద్యార్థులతో నేర్చుకునేవాడు. ఉపాధ్యాయుడు. గురుముఖతః (వేదములను) చదివించేవాడు అధ్యాపకుడు. ‘ఆ ఆచార్య’ ఆచార్యుడు అంటే చేసి చూపేవాడు (one who demonstrates).
గుశబ్దస్త్వంధ కారసాత్ రు శబ్దస్తన్నిరోధకః ||
అంధకార నిరోధత్వాత్ గురురిత్యభి ధీయతే ॥
అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించేవాడు గురువు. జిజ్ఞాసువులను సమాధాన పరచటంలో అనేక పద్ధతులను వారి వారి స్థితులను బట్టి ఎన్నుకుంటుంది అమ్మ. Heuristic Method, Analytical Method, Socratic Method లేదా రసామృతమూర్తి శ్రీదక్షిణామూర్తి భగవానుని పద్ధతి. సోదాహరణంగా వివరిస్తాను..
- Heuristic Method : (విద్యార్థిచేతనే విషయాన్ని గుర్తింప చేయటం)
ఒకసారి నేను మామిడి పండ్ల ముక్కలు ట్రేలో ఉంచి అమ్మకు నివేదించాను. సాధారణంగా అమ్మ ఏమీ తినదు. నాడు నా అదృష్టం. రెండు ముక్కలుతిన్నది. ఎలా ఉన్నాయి? తియ్యగా ఉన్నాయా? పుల్లగా ఉన్నాయా?’ అని అడిగాను. “నాకు ఈ రుచులు తెలియవు, నాన్నా! నువ్వు పెట్టావు. బాగుంది. అంతే” అన్నది అమ్మ. క్షణకాలం నాకు శబరి, విదురుల స్థితిని అనుగ్రహించింది; పదార్ధాన్ని కాకుండా పరమార్థాన్ని దర్శింపచేసింది.
ఒకసారి అమ్మ మూడేళ్ళ పిల్లవానికి వలె అన్నం తినిపిస్తోంది. కూర అన్నం పెడుతూ “కారంగా ఉందా?” అని అడిగింది. ‘అవునమ్మా’ అన్నాను. వెంటనే “అయినా ఈ మమకారం ముందు ఈ కారం ఎంత?” అన్నది మనోజ్ఞంగా, మహోన్నతంగా, తన వాత్సల్యాన్నే గోరుముద్దలు చేసి తినిపిస్తోంది అమ్మ. కాగా నా కళ్ళకి కారం, అమ్మ కళ్ళకి మమకారం కనిపిస్తోంది. నా కళ్ళు తెరచుకున్నాయి. వెంటనే ‘నీ మాతృవాత్సల్య సంపూరితంబైన ఈ పట్టెడన్నంబు సంతృప్తికరము’, అని అంజలి ఘటించాను.
2 Analytical Method (విశ్లేషణ ద్వారా బోధించడం)
ఒకసారి ఇజ్రాయెల్ నుంచి ఒక క్రైస్తవ సోదరుడు వచ్చాడు. ‘మేము క్రీస్తుని దేవుడు అని నమ్ముతాం. కానీ క్రీస్తు తాను దేవుని కుమారుడనని చెప్పారు. మీ గురించి మీరేమంటారు?’ – అని ప్రశ్నించాడు. అందుకు అమ్మ, “నాకంటే పైన ఒకరు ఉన్నారని నేను అనుకోవటం లేదు” (మత్తః పరతరం నాన్యత్ కించిద ధనంజయ – అన్నట్లు) అన్నది.
ఒక క్షణం ఆగి, “నా కంటే క్రింద ఎవరో ఉన్నారని కూడా నేను అనుకోవటం లేదు” (మీరు నా బిడ్డలే కాదు, నా అవయవాలు అన్నట్లు) అని వివరించింది.
“నిజమైన కమ్యూనిజం అద్వైతం” అనీ
“కూతురినీ కోడలినీ ఒకేలా చూడటం అద్వైతం” అనీ కంటికి కనిపించని సత్యాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది.
- Socratic Method (ప్రశ్నించుట ద్వారా సత్యావిష్కరణ చేయడం).
ఒక సోదరుడు ‘వేదములు పౌరుషేయాలా? అపౌరుషేయాలా?’ అని ప్రశ్నించారు. అందుకు అమ్మ, “నాకివేమీ తెలియవు, నాన్నా! మీరంతా నా బిడ్డలు అనుకుంటున్నాను. మిమ్మల్ని దగ్గరకు తీసికోవాలనీ ఏదన్నా పెట్టుకోవాలనీ ఉంటుంది” అన్నది. గౌతమ బుద్ధుడూ అలాగే అనేవారట. ప్రక్కనే ఉన్న పాలకొల్లు గోపిగారు ‘వేదమాతవు నువ్వు చెప్పకపోతే మాకు ఎవరు చెపుతారు?” అని వినమ్రంగా అర్ధించారు. అపుడు అమ్మ ఆసోదరుని, “వేదం అంటే ఏమిటి, నాన్నా?” అని ప్రశ్నించింది. ‘వేదం అంటే తెలుసుకోవటం’ అని వారు అన్నారు. “అది తెలిసినపుడు ఈ ప్రశ్న (పౌరుషేయాలా అపౌరుషేయాలా అనేది) ఉండదు కదా! అన్నది జ్ఞాన స్వరూపిణి అమ్మ. కృష్ణయజుర్వేదీయ ఆశీర్వచన మంత్రంలో ‘వేదవిది బ్రాహ్మణః’ అని ఒకటికి రెండుసార్లు ఉద్ఘాటించబడింది. వేదం అంటే చదవడం, చెప్పడం మాత్రమే కాదు; తెలుసుకోవడం.
- శ్రీ దక్షిణామూర్తి భగవానుని ‘మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వ’ పద్ధతి నేను జిల్లెళ్ళమూడిలో ఉన్నప్పుడు ఎప్పుడూ అమ్మ మంచం ప్రక్కనే చాపవేసుకుని పడుకునే వాడిని. ఒకనాటి తెల్లవారు ఝాము సమయం. గం. 4.00లు కావచ్చు. అమ్మ లేచి కూర్చున్నది. తాను వాత్సల్యయాత్రలో భాగంగా మద్రాసు, కంచి, కలవై, తిరువణ్ణామలై… వెళ్ళిన విశేషాన్ని వరుసగా వివరిస్తోంది. అంతరాత్రివేళ తాను విశ్రాంతి తీసుకోకుండా ఈ అల్పునికి అంత సుదీర్ఘంగా పనిగట్టుకొని వివరించాలా? చతుర్దశ భువనాల్ని పరిపాలించే జగన్మాతకి అత్యవసరమైన వేరే పన్లేమీ లేవా? ఈ భావాన్ని Aristotle ఇలా అద్భుతంగా వివరించారు:
The Sun, with all those planets revolving around it and dependent upon it, can still ripen a bunch of grapes as if it has nothing else in the universe to do అని, విశేషాలు చెబుతూ చెబుతూ ఒక్కసారి – ఆగి “నాన్నా! లలితా సహస్రనామాల్లో ‘స్వభావమధుర’ అనే నామం ఉన్నదికదా! దాని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించింది. ‘రామకృష్ణ అన్నయ్య నిన్ను స్వరూపలలిత, స్వభావ మధుర అని వర్ణిస్తాడు కదా! అట్లే ఆ లలితాదేవి రూపం కోమలంగాను, మనస్సు మధురంగాను ఉంటుంది అని అర్థం ఏమో!’ అన్నాను.
అందుకు అమ్మ, “స్వభావం అంటే తన భావం. దైవానికి తన భావమే తనకి మధురం. (భగవంతుడు) తన ఇష్టప్రకారమే మనల్ని నడిపిస్తూ, మన ఇష్టప్రకారం నడుస్తున్నట్లు అనిపిస్తాడు. ఇదే ‘స్వభావమధురం’ అని నేను అనుకుంటున్నాను” – – అని గంగాఝరిలా వడివడిగా చెప్పింది. అంతట ఒక క్షణం ఆగి “అర్థం అయిందా?” అని అడిగింది. నిజంగా అర్ధం కాలేదు. అన్నాను. కొన్ని సెకన్లు నా కళ్ళలోకి చూసి “ఇపుడు అర్థమైందా?” అని అడిగింది. వెంటనే ‘అర్థమైందమ్మా!’ అని అన్నాను. ఆ మాటే
మాటలతో నిమిత్తం లేకుండా ప్రత్యక్ష జ్ఞానప్రసార (Direct transmission of Wisdom) పద్ధతి ఇది. అనేకులు అనేకానేక సందేహాలతో అమ్మ వద్దకు రావడం, అడగకుండానే ఆదివ్యసన్నిధిలో వారి సందేహాలు లయం కావడం ఒకపరిపాటి.
పూజ్యసోదరులు సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు కొన్నాళ్ళు జిల్లెళ్ళమూడిలో ఉన్నారు. రోజూ అమ్మ శ్రీచరణ సన్నిధిలో కొంత సేపు ప్రసంగించేవారు. పిమ్మట వారూ, సో॥ శ్రీ విఠాల శ్రీరామచంద్రమూర్తిగారూ, నేనూ కాలేజీ వరకూ వాహ్యాళికి వెళ్ళే వాళ్ళం రోజూ,
విప్లవాత్మక ప్రవచనం అని నేను సంభావన చేసే అమ్మ వాక్యాలు. ‘శరీరం ఆత్మకాకపోలేదు. నాదృష్టిలో జడం ఏమీలేదు; అంతా చైతన్యమే; సజీవమే. భర్త అంటే శరీరం కాదు. భావన. మానవుని నడకకి ఆధారం నవగ్రహాలు కాదు, రాగద్వేషాలు…’ను వారితో చర్చించే వాడిని. వారు అంతా విని ‘నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ శాస్త్రం ఒప్పుకోదు’ అనే వారు. చివరకు ఈ ఉదంతాన్ని అమ్మతో ప్రస్తావించాను. వెంటనే అమ్మ చిరునవ్వుతో “నాన్నా! ఇవన్నీ మాటలే కదా! మాటలు కాకుండా ఉంటే ఎంతైనా ఉన్నది” – అన్నది ఉపనిషద్వాణి అమ్మ.. ‘యతో వాచోనివర్తంతే అప్రాప్యమనసాసహ’ – అనేది నిగమాగమసారం.
తర్వాత కాలంలో ఆచార్యుల వారి శ్రీమతి స్వర్గస్థురాలైంది. ఆ సందర్భంలో వారికి “శరీరం ఆత్మకాకపోలేదు’ అనే అమ్మ వాక్యం అనుభవంలో అవగతమైందని అన్నారు. కనుకనే అమ్మ అంటుంది “అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది. కానీ శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు” అని. ఈ అర్థంతోనే శ్రీ రాజుబావగారు
‘చదువు సంధ్యలు లేని తల్లి చదువు సంధ్యలు చెప్పు తల్లి’ అని అమ్మను ప్రార్థించారు. అంతర్ముఖసమారాధ్య అయిన అమ్మ (ఉపనయనం) జ్ఞాననేత్రాన్ని ఇచ్చి, లోచూపుని ప్రసాదించి, సత్స్వరూపాన్ని దర్శింప చేస్తుంది. ఇదే మహాభారతంలో ధృతరాష్ట్రమహారాజు పొందిన భాగ్యవిశేషం విశ్వరూప సందర్శనం.
“ప్రజ్ఞానమే కాదు, అజ్ఞానమూ,
అన్నమే కాదు, అశుద్ధమూ;
వెలుతురే కాదు, చీకటీ బ్రహ్మే – అనీ, గురువుకి శిష్యుడూ పరబ్రహ్మ స్వరూపమే, వైద్యునికి రోగి నారాయణ స్వరూపుడే, భర్తకు భార్య దేవత” సాంప్రదాయ బద్ధమైన న్యాయాల్ని న్యాయంగా తిరగవేసి సంపూర్ణ తత్త్వాన్ని దర్శింప చేసి, ఆధ్యాత్మిక చింతనలో ప్రప్రధమంగా సామ్యవాదాన్ని ప్రవేశపెట్టిన మహాప్రవక్త అమ్మ..
జగత్కర్త, జగద్ధర్త, జగద్గురువు అమ్మ