మత్తకోకిలములు
భళ్ళుమంచును తెల్లవారెను భక్తకోటియు మేల్కొనెన్
గుళ్ళలోపల గంటలన్నియు గొప్పగా నినదించె, దో
సిళ్ళ నిచ్చెలతల్ సుమంబులు చిత్కళా! నినుఁగొల్వ జి
ల్లెళ్ళమూడి మదంబ! రాగదె! శ్రీగిరి భ్రమరాంబవై!
తాతయైన చిదంబరార్యుడు ధన్యుడై నినుపెంచే సం
ప్రీతిగాఁ బరతత్వ బోధలు విస్తరింప ధరిత్రి! శ్రీ
మాత! త్వద్వచనామృతమ్మున మానవాళి తరింప వి
ఖ్యాతుడయ్యెను నీకతంబున నాతడుం బ్రథముండుగా
చంద్రమౌళి మహాన్వయంబది సంద్రమట్లుగఁ బర్వపుం
జంద్ర బింబము నీదు మోమని సంతసంబునఁబొంగ; దే
వేంద్ర తుల్య నృపాళి త్వత్పద పీఠి నౌదలఁదాల్పగా
సాంద్ర సత్కరుణా తరంగిణి! సాగిరావె! సనాతనీ!
నోరులేని మృగాళి పూరియునోచకున్నవి మేతకున్
బోరున విలపించు దిక్కటి బుజ్జి పాప లనాథలై
భారమై మము వీడె సంతని బాధ చెందెడు వృద్ధులున్
జేరదీయవె దర్శనంబిడి చిన్మయీ! శుభకామినీ!
శోభలీనుచు భావదేవుని సుందరంబగు వీటిలో
వైభవంబుగ హర్షమే సుమ వర్షమై తనరంగ నీ
ప్రాభవమ్మున పట్టణంబిది స్వర్గమై యలరారగా
శోభకృత్రియ నామవై పొడసూపవే! లలితాంబవై