వేదసమూహాన్ని ఋగ్యజుస్సామాధర్వణ చతుర్వేదములుగా వర్గీకరించి నట్టి, శ్రీమద్భాగవతం, మహాభారతం, అష్టాదశ పురాణాల్ని రచించినట్టి వ్యాసభగవానుని జన్మదినం ఆషాడపూర్ణిమ. కనుకనే ఏటా ఆషాఢపూర్ణిమను వ్యాసపూర్ణిమ లేక గురుపూర్ణిమగా నిర్వహించుకునే సంప్రదాయం చిరకాలంగా అనూచానంగా వస్తున్నది.
‘శంకరశంకరస్సాక్షాత్ వ్యాసోనారాయణోహరి’:- శంకరాచార్యులు సాక్షాత్ పరమేశ్వరుడేనని, వ్యాసమహర్షి సాక్షాత్ విష్ణువు అని ఆర్యోక్తి. బ్రహ్మసూత్ర రచనని వ్యాసభగవానులు ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి ఆషాఢ పూర్ణిమతో పూర్తి చేశారు. ‘శివాయ గురవేనమః’ అని కొందరు, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని మరి కొందరు శివకేశవులను గురుస్వరూపంగా ఆరాధిస్తారు.
‘గుశబ్దస్వన కారస్యాత్ రుశబ్దస్తన్నిరోధకః |
అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే ॥’
– అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడే గురువు.
మనకి అమ్మయే తల్లి, తండ్రి, గురువు, దైవం. కనుకనే అమ్మ శ్రీచరణ సన్నిధిలో వాత్సల్యాలయంలో ఎనిమిదేళ్ళుగా సోదరి మన్నవ సుబ్బలక్ష్మి కృషితో గురుపూర్ణిమను వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ ఏడాది 19-7-2016 తేదీ గురుపూర్ణిమ. ఏటా – అమ్మ పర్యంకానికి ఇరువైపులా ఆవునేతితో దీపాల్ని వెలిగిస్తారు; అమ్మను జ్యోతి స్వరూపిణిగా దర్శిస్తారు. దీవ్యతే ఇతి దైవః దైవం స్వయంగా ప్రకాశించేవాడు తదనంతరం అమ్మ చిత్ర పటాన్ని సుమమాలలతో అలంకరించి, అమ్మ పాదుకలను పుష్పపరంపరతో అర్చిస్తారు. అమ్మ, హైమ నామములను సంకీర్తన చేస్తారు. సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ, మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు పారాయణ నిర్వహిస్తారు. శ్రావ్యంగా హృద్యంగా అమ్మ మీద గీతాలను ఆలపిస్తారు. “అమ్మే నా గురువు – దైవం” అంశాన్నీ విపులీకరిస్తూ స్థానిక, స్థానికేతర సోదరీ సోదరులు శ్రీమాతృ గురువందనం చేస్తారు. అమ్మకి మంగళ హారతి నిచ్చి తీర్థ ప్రసాదాల్ని పంచుతారు.
“నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం |
అస్మదాచార్య పర్యంతాం వందేగురు పరంపరాం ॥ – బృందం వ్యాసపూర్ణిమ నాడు గురువందనం చేస్తారు. అంటూ శిష్య
కాగా అమ్మ “నేను గురువును కాను, మీరు శిష్యులు కాదు. నేను అమ్మను, మీరు బిడ్డలు” అంటుంది. అంతే కాదు, “మీరంతా అజ్ఞానంతో ఉన్నారు; మీకు జ్ఞానబోధ అవసరం – అని నేను అనుకోవటం లేదు” అంటుంది.
సో॥ శ్రీ విఠల రామచంద్రమూర్తిగారు ఒకనాడు అమ్మ శ్రీచరణాలను తన ఒడిలో పెట్టుకుని “అమ్మా! ఇవి బ్రహ్మ కడిగిన పాదాలు (బ్రహ్మాండఛ్ఛత్ర దండః) కదా!” అన్నారు. అందుకు అమ్మ “ఔను నాన్నా!” అని దయతో తక్షణమే అంగీకరించింది. క్షణం ఆగి మళ్ళీ ” మీరు రోజూ కడుగుతున్నారు కదా ! మీరు బ్రహ్మలే కదా!” అన్నది.
అమ్మ – హైమ జ్ఞాన స్వరూపాలు, దక్షిణామూర్తి తత్వాలు. ‘ఇదంతా నేనే’ – అనే విశ్వాంతరాత్మ అమ్మకి వీరు గురువు – వీరు లఘువు, వీరు పెద్ద వీరు చిన్న అనే భేదం ఎందుకుంటుంది ? సర్వం తానైన తల్లి దృష్టికి అంతరాలు ఎందుకుంటాయి ? ఒక సందర్భంలో ‘గురువు’ పదాన్ని నిర్వచిస్తూ అమ్మ “గుర్తు చెప్పిన వాడే గురువు” అన్నది. “ఉన్నది ఉన్నట్టు కనడమే లోచూపు”; “భ్రాంతి లేని వాక్యం బ్రహ్మ వాక్యం”; “చేతలు చేతుల్లో లేవు”; “సాధ్యమైనదే సాధన”; “మిధ్య ఏమీ లేదు, అంతా సత్యమే”; “నా దృష్టిలో జడమేమీ లేదు, అంతా చైతన్యమే సజీవమే” వంటి అమ్మ వాక్యాలు సత్యావిష్కరణ చేస్తాయి; అఖండ అపూర్వ జ్ఞాన సంపదని ఆదరంగా అందిస్తాయి.
సృష్టి రచనా కీలక రహస్యాన్ని విశదపరుస్తూ శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మ గారితో అమ్మ “సంకల్పరహితః అసంకల్ప జాతః” అన్నది – అంటే సృష్టి ఆవిర్భావానికి కారణం అకారణం అని విశదపరచింది. అట్టి జగద్గురువు అమ్మ శ్రీచరణాలను అర్చించి
‘నీవే తల్లియు తండ్రియు
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ అంటూ అమ్మను ప్రార్థించడమే గురుపూర్ణిమ నాడు మనం చేసే విశిష్ట ఆరాధన.