శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి యైన మాతృశ్రీ అనసూయాదేవి పాదారవిందములకు సహస్రాధిక ప్రణామములనర్పిస్తూ….
చండీ సప్తశతిలోని
యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా,
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః. –
ప్రార్థన అనుసరించి ఈ కలియుగంలో సకల చరాచర ప్రాణులకు తల్లినని చాటి చెప్పినవారు ఒక్కరే. వారే మాతృశ్రీ అనసూయామహాదేవి. గుంటూరుజిల్లా పొన్నూరు తాలూకా మన్నవ గ్రామమున పుణ్యదంపతులను శ్రీ మన్నవ సీతాపతిశర్మ రంగమ్మ దంపతులకు 28.3.1923 తెల్లవారుజామున అనేకానేక దివ్యానుభూతులను కలుగజేయుచూ లోకాన అవతరించి బాపట్ల మండలం రేటూరు గ్రామమున పుణ్యదంపతులగు బ్రహ్మాండం సుబ్బారావు కనకమ్మ గార్ల కుమారుడు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారిని వివాహమాడి జిల్లెళ్ళమూడిలో అడుగుబెట్టి జిల్లెళ్ళమూడి అమ్మగా లోకప్రసిద్ధి గాంచిన తల్లి అనసూయాదేవి.
“జగతః పితరౌ వందే అనసూయానాగేశ్వరా”
అట్టి జగన్మాత అనసూయాదేవికి జగత్పిత నాగేశ్వరరావు గారికి నమస్కరించుచున్నాను. “జిల్లెళ్ళమూడి రావడం ఎన్నడూ వృథా కాదు నాన్నా” అన్నది అమ్మమాట. “తోలు నోరు కాదు కదా తాలు మాట రావటానికి “జిల్లెళ్ళమూడి వచ్చిన వారెందరో ఎన్నో ప్రయోజనాలను పొందారు. వారిలో నేనూ ఒకడిని. “అచటి మెతుకు కొరుకు బ్రతుకు తెరువు దొరుకు…” అన్నపూర్ణాలయంలో మెతుకు కొరికినంత మాత్రమునే బ్రతుకు తెరువు దొరుకుతుంది అన్న కవి వాక్యము అసత్యము కాదు నిత్య సత్యము. అందుకు ఉదాహరణ నేనూ నా కుటుంబము.
‘జిల్లెళ్ళమూడి ఎవరైనా రావచ్చు కాని ఆకలితో ఏ ఒక్కరూ వెళ్ళరాదు” అనేది అమ్మ సిద్ధాంతం. అందుకనే అమ్మ 15.8.1958న అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది. కోట్ల ప్రాణుల ఆకలిని తీరుస్తున్నది. ‘ఈ కలిలో నాకాకలి లేదు” అని చాటి చెప్పిన మహాతల్లి. అమ్మ దర్శనార్థం 24 గంటలలో ఎప్పుడు ఎవరు ఎందరు వచ్చినా ముందుగా భోజనం చేసి రమ్మనేది. పిల్లల కడుపాకలి ఆ తల్లికి తెలియకుండా ఉంటుందా?
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తనను చేరవచ్చిన వారు ‘ఆర్తోజిజ్ఞాసురర్థార్థి’ అని విభజించాడు. అమ్మ వద్దకు చేరిన వారు కూడా ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థ కాముకులు ఎవరికి ఏది కావాలో వారి స్థాయిని బట్టి వారి కందించినది.
“పంచడంలో హెచ్చుతగ్గులుండవచ్చునేమో కానీ పెట్టడంలో అందరికీ సమానమే” అంటుంది. అమ్మ. “అందరికీ సుగతే” అని అందరికీ సుగతిని అనుగ్రహిస్తున్నది అమ్మ. అమ్మ తనను చూడవచ్చిన వారందరికీ అన్నప్రసాదమే కాకుండా వస్త్ర ప్రసాదం కూడా పెట్టేది. కాస్త కలిగిన బిడ్డలు అమ్మా ఇవన్నీ మాకెందుకమ్మా ఎవరైనా లేనివారికిస్తే బాగుంటుందన్న బిడ్డలతో “ఈ పెట్టుకోవడం మీకు నేర్పడం కోసమే నాన్నా. “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అని ప్రవచించింది. ఈనాటికీ ఆ సంప్రదాయాన్ని, అనుసరిస్తున్న బిడ్డలు జిల్లెళ్ళమూడిలోనే గాక హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్టణం, విజయనగరం, పార్వతీపురం యస్.కోట, పాలకొండ, రాజాం, సాలూరు, ముదిగల్లు వంటి ప్రదేశాలలో పలు ప్రజాప్రయోజన కార్యక్రమాలు నిర్వహించి అమ్మ కృపకు పాత్రులవుతున్నారు. అమ్మ సిద్ధాంతమును పాటిస్తున్నారు. వారున్న ప్రదేశాన్ని జిల్లెళ్ళమూడిగా మారుస్తున్నారు.
అమ్మ గర్భశుక్తి ముక్తాఫలీభూతా, అర్కపురీ ప్రథమ పూజార్హా హైమవతీదేవి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. అర్థకాముకలమైనట్టి మనబోటి వారి కోర్కెలను తీర్చే కల్పవల్లి చల్లనితల్లి శ్రీహైమవతీదేవి. కుసుమ కోమలమైన మనస్సు కలిగిన హైమక్క ఎవరికి ఏ బాధ కలిగినా తనకే వచ్చినట్టుగా విలవిల లాడిపోయేది. వారి కాబాధ లేకుండా చేయమని అమ్మను వేడుకునేది. ‘నీవే తగ్గించవచ్చుగా’ అన్న అమ్మమాటకు నాకాశక్తి లేదనేది. రవి అన్నయ్యచే ‘చిన్మాత’గా పిలువబడిన హైమక్కకు అమ్మే దైవత్వమిచ్చి మన పాలిట కల్పవల్లిగా నిల్పినది.