“బహుశ్యాం ప్రజాయయేతి” అని, దైవం అనేకంగా అనంతంగా సృష్టించాలని సంకల్పించి ప్రధమంలో స్పందించాడు.
అదే లక్షణం చరాచర జీవులకీ వచ్చింది. ‘ధర్మ ప్రజా సంపత్యర్ధం’, ‘ప్రజాయై గృహమేధినాం; ధర్మబద్ధంగా సంతానం కోసం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం ‘అత్మావై ‘పుత్ర నామాని’ అన్నట్లు బిడ్డల్ని కనడం తన కంటిపాపల్లా ప్రాణాధికంగా ప్రేమించడం, పోషించడం – ‘కడుపుతీపి’ అనిపించుకుంటుంది.
అమ్మ, “నాకు ఉదరం మధురం (కడుపుతీపి ఎక్కువ)” అనటంలో అర్థం ఇదే. పాకితే పరమాన్నం, బోర్లపడితే బొబ్బట్లు, నవ్వితే నువ్వుఉండలు. గడపదాటితే గారెలు, అడుగులేస్తే అరిసెలు, పలుకులకు చిలుకలు… సంతోషంగా పంచిపెట్టడం తన ఆనందాన్ని పదిమందికీ పంచటమే కదా!
‘పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నట్లు ప్రతిభా పాటవాలు, విద్వత్తు, సంపద, కీర్తి ప్రతిష్ఠలపరంగా తమకంటే తమ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు ఉవ్విళ్లూరతారు. మా రోజులు గడిచిపోయాయి. మా పిల్లలు మా కంటే బాగుంటే అదే. పదివేలు’ అని ఆశించటం సహజం. కడుపుకి మెతుకు, కంటికి కునుకు కరవైనా, కరచరణాద్యవయవాలు పూర్వంలా శక్తివంతంగా పనిచేయటానికి మొరాయించినా ఊపిరి ఉన్నంతకాలం సంతాన శ్రేయోభివృద్ధులకోసం, కూడుగూడులను ఏర్పాటు చేయటం మనుష్యులేకాదు. పశుపక్ష్యాదులూ చేస్తాయి.
విశ్వజనని అమ్మ విషయం వేరే చెప్పాలా ? అమ్మ అన్నం ఎప్పుడూ ఎలాగూ తినదు. గ్లాసెడు మజ్జిగ త్రాగు, అమ్మ !” అని బ్రతిమలాడితే “పొద్దుపోయిన తర్వాత బిడ్డ లెవరైనా వస్తారేమో! ఉంచు” అని అన్నది. “నా పోలికే మీకందరికీ వచ్చింది” అని అంటుంది అమ్మ. జగన్మాత అమ్మకి సకలజీవకోటిపై ఉండే అనంతవాత్సల్యాన్ని, మమకారాన్ని రుచిచూపించటం కోసమే మనుష్యులకి సంతానాన్ని ఇచ్చింది అనిపిస్తుంది. వాస్తవానికి అమ్మ మనందరికి జ్యేష్ఠపుత్రిక; తొలిచూలి ఆడపిల్ల. అన్నయ్యల్ని ‘నాన్నా!’ అనీ, అక్కయ్యల్ని ‘అమ్మా!’ అనీ నోరారా పిలుస్తుంది. త్రికరణశుద్ధిగా భావిస్తుంది. ఆ పిలుపులోని మాధుర్యం మనందరికీ అనుభవమే. అది దివ్యమూ, అవ్యక్తమధురమూ. తల్లి ఉంటే అన్నానికీ, తండ్రి ఉంటే ధనానికి లోటు ఉండదు అని అంటారు. కానీ తల్లిదండ్రులకి అన్నమూ, ధనమూ బిడ్డలే. ఈ సత్యాన్నే. అమ్మ, తల్లికి బిడ్డ సొమ్ము” అని నిర్వచించింది.
గృహస్థులు ఇల్లు కట్టుకుని, శ్రమించి తమ సంతానాన్ని సంరక్షిస్తారని అనిపిస్తుంది. కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమంటే వాళ్ళ గుండెల్లోనే గూడుకట్టుకొని పెంచుకుంటారు. పసివాళ్ళు తొలిసారి అడుగులు వేసేది. నేలమీద కాదు, అమ్మనాన్నల గుండెలమీద, నడకలు నేలమీద కాదు – అరచేతుల మీద..
పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబుసేకొనుము’ అని నిండుసభలో దుష్యంతుని ముందు శకుంతల రక్తసంబంధ మాధురీ మహిమను విప్పి చెప్పింది. ‘కుక్షిస్థాజాండభాండ అయినా అమ్మ తనను దర్శింపవచ్చిన అనుంగుబిడ్డలను తన ఒడిలోకి తీసికొని ఆ పుత్ర (పుత్రికా) గాత్ర పరిష్వంగ సుఖంతో పరవశించేది, పరవశింపచేసేది.
ఇక్కడ అమ్మకి సహజం – మనకి విశేషం అయిన అంశం. జన్మదినం, వివాహం, గృహప్రవేశం వంటి శుభసందర్భాల్ని పురస్కరించుకొని అమ్మ దరిచేరితే, అమ్మ మనకంటే సహస్రాధికంగా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మరి అనారోగ్యం, కష్టనష్టాలు, ఆప్తులను కోల్పోయి గంపెడు దుఃఖంతో చేరితే అమ్మ కన్నులు శోకసాగరాలే అవుతాయి. బాధాపరితప్త అమ్మ హృదయంలో అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి. అమ్మను ఓదార్చేవారే లేరు. అది అమ్మ శరీరంలో ఉన్నపుడు మన కళ్ళకి కనిపించిన సత్యం.
నేడు శ్రీ అనసూయేశ్వరాలయంలోకి వెడితే తక్షణం ప్రశాంతత కలుగుతుంది; అనునిత్యం అప్రయత్నంగా స్వర్గ సౌఖ్యాల్ని ధిక్కరించే ఆనందంతో మనస్సు పరవశిస్తుంది; మరి ఒక్కొక్కసారి అకారణంగా దుఃఖం పెల్లుబికి అమ్మ అన్నారు. పాదాల్ని అభిషేకిస్తాయి. నిజం ఏమంటే ఆ సంక్షుభిత హృదయస్పందనలు, ఆ అశ్రుధారలు మనవి కాదు; అమ్మవి. సంభవించనున్న అశుభాల్ని, ఆపదల్ని వీక్షిస్తూ, మన ప్రమేయం లేకుండా కలిగే నిరుపమానసహానుభూతి (Empathy) అది.
ఆక్షణాల్లో… అవ్యాజకరుణారసార హృదయ అమ్మ దుర్భరమనోవేదనకి అవధులు ఉండవు. ఈ సన్నివేశాన్ని పురస్కరించుకొని సో॥శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారు, “జగమేలే పరమాత్మ! ఎవరితో మొరలిడుదువు ?” అని ప్రశ్నిస్తే, “నాతో నేనే” అని సమాధానమిచ్చింది. మరొక సందర్భంలో, “నా మీద నాకే జాలి వేస్తోంది” అన్నది. ఎందువలన ?
తానే వివరించింది, “చెయ్యటం చేతుల్లో ఉన్నప్పుడు బాధ ఉండదు. మాట ఉండదు. ప్రతీదీ ఒకేసారి నిర్ణయమై ఉంటుందిగా. మారేదయితే, మారటానికి వీలున్నదయినా ఆ స్థితిని నిర్ణయమని అనరు. నిర్ణయమంటే తప్పనిసరిగా జరిగేది-” అని.
సర్వసృష్టికారిణిగా తాను ఏర్పరచుకున్న విధి విధానాల్ని ధిక్కరించలేదు; అడకత్తెరలో పోకచెక్కలా బిడ్డల హృదయాలు నలిగి పోతూంటే, కళ్ళతో చూసి భరించలేదు. తన కన్నీళ్ళని తానే తుడుచుకుంటుంది. మరి “అమ్మ” కదా! గుడిలో ఉన్న, గుడిలో ఉన్నా, రాయి కాదు కదా !!
మన అమ్మ ప్రేమామృతరసార్ణవ తరంగోద్ధృతిలో కొట్టుకు పోయి వక్తవ్యాంశాన్ని మరిచాను.
ప్రాణాధికంగా పెంచుకున్న బిడ్డ, ‘Flesh of Flesh’, ‘Blood of Blood కళ్ళముందే అదృశ్యమై కడుపులో చిచ్చుపెడితే ఆ వేదన దుర్భరం. వారిని ఎవరు సమాధానపరచగలరు ? ఎలా సముదాయించగలరు? కనుకనే పుత్రవియోగవేదనా శబలీకృత హృదయులు సో॥ కేశవశర్మగారు అమ్మతో “అమ్మా! నిన్ను ఇంకేమీ కోరను”
ఆ నిస్సహాయస్థితిలో ‘దేవునికేం ! హాయిగ ఉన్నాడు. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు’ అని నిమ్మరాలు వలకటం సహజం, నహేతుకం. “అనుభవిస్తున్నదే సత్యం” అని అమ్మ దానిని సమర్థిస్తుంది. కాగా ఈ నిష్ఠురవచనాలు అమ్మపరంగా అంటే అవి అర్థరహితములు.
గర్భశోకాన్ని అమ్మ అనుభవించింది. ఒక హైందవస్త్రీ తన తనువుకంటే, కడుపుచీల్చుకు పుట్టిన బిడ్డలకంటే మిన్నగా పెనిమిటిని ఆరాధిస్తుంది.
భర్తృవియోగ దుఃఖాన్ని అమ్మ అనుభవించింది. దుఃఖాన్ని దిగమ్రింగి సంతోషాన్ని పంచటమే అమ్మ నిజతత్త్వం, నిజమైన తత్వం. విశ్వకళ్యాణకారక మహాయజ్ఞంలో తన కంటి వెలుగునే కన్నబిడ్డనే కర్పూరహారతి పట్టింది; తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది. పరమశివుని లోకభీకర హాలాహల స్వీకరణం కంటే కఠోరమైనది, హృదయ విదారకమైనదీ ఈ చర్య, ఈ త్యాగం.
అమ్మ హృదయం సహస్ర సహస్ర చ్ఛిద్ర కార్తీక మహాదీపప్రభాభాస్వరం. ముందుగా అమ్మ, తర్వాత నాన్నగారు ఆలయ ప్రవేశం చేసి ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ‘సహధర్మచారిణి’గా స్వధర్మాన్ని అక్షరాల ఆచరణాత్మకంగా నిరూపించిన నిత్యసుమంగళి, సహనదేవత, మనుష్యజనతా భాగ్యరూపిణి అమ్మ.
నాడు సో॥ కేశవశర్మగార్కి నేడు సో॥ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ (అమ్మ వరప్రసాద్) గార్కి, నానాకేశ విశీర్ణ జీర్ణ హృదయాలకి… చల్లని నీడపట్టు, OASIS అమ్మ మమతల గర్భగుడే.