విశ్వజనని సేవ విద్యార్థులెల్లరు
నిత్యనూతనముగ నిర్వహింప
వాడవాడలందు వైభవోపేతమై
‘పసిడిపండుగ’ యిది పరిఢవిల్లె
అర్కపురమునందు ఆదిత్య తేజస్సు
అమ్మ యనెడి పేర అవతరించె
పంచిపెట్టుట యను భాస్కర దీప్తులు
నాల్గు దిక్కులందు వెల్గె నేడు
మనసు బంగార మగునట్లు మనెడు వేళ
మాట బంగారమగునట్టి బాట నడువ
పసిడిపండుగ విభవమ్ము పరిఢవిల్లె
చేతలెల్లను పసిడియై చేవచూప
సేవానిరతియు, సమధిక
ధీవైశాల్యంబు, కార్యదీక్షావిధియున్
భావావేశము, భక్తియు
‘మా’ విద్యార్థుల స్వభావ మాధుర్యంబుల్ (మా=మాతృశ్రీ)
“విద్యార్థులారా!
మీ మాటలు మీ చేతు
మీ మానస మందిరమున మేలగుతలపుల్
శ్రీమాత పదమ్ముల ని
ష్కామముగ సమర్పణమ్ము స్వర్ణోత్సవమే
విద్యార్థుల సంకల్పము
సద్యోగంబై నిలిచెను, సాగును నిరతం
‘బాద్యంబగు తల్లి’ కరుణ
హృద్యంబై కురియుగాక! నెడతెగకుండన్
అమ్మతతత్వమెరిగి ఆచరింపగ నెంచు
ఛాత్రులారా! మీకు జయము జయము!
గురుతు చూపిన యట్టి గురువుల మరువని
ఛాత్రులారా! మీకు జయము జయము!
చదువు నొసగినట్టి ‘శారద’ నర్చించు
ఛాత్రులారా! మీకు జయము జయము!
స్వర్ణోత్సవారంభ సంరంభ శుభవేళ
ఛాత్రులారా! మీకు జయము జయము!
సాటివారి సేవ చదువుల సారమ్ము
తీరు తెలిసికొనిరి మీరు నేడు
విశ్వజనని కొఱకు విశ్రాంతి వీడిన
ఛాత్రులార! మీకు జయము జయము!