గడియార మ్మిది టిక్కు టిక్కు మనుచున్ కాలమ్ము సూచించుచున్
వడిగా ముందుకు సాగుచున్న దిదిగో! ప్రాజ్ఞుల్ సమీక్షింపరే!
జడతన్ వీడుచు చూపగా వలదె! ఉత్సాహమ్ము ప్రోత్సాహమున్
ఘడియైనన్ వృథ సేయరాదు మన యజ్ఞమ్మింక పాటింపగా.
చైత్రము చేర వచ్చినది, జాగును సేయగ న్యాయ మౌనొకో!
మిత్రములార! యిప్పుడిక మీనము మేషము లెక్క వేయ, కే
మాత్రము ఆలసింపక సమష్టిగ సన్మతితోడ నేర్పుతో
ఆత్రుత నొంది ఈ శతజయంతి ప్రణాళిక తీర్పగా దగున్.
మమత సమతల నెలవైన మాతృమూర్తి
చలువ వెన్నెల కురియు సౌజన్య కీర్తి
శతజయంతి మహోత్సవ సౌరభమ్ము
నేల నాలుగు చెరగుల క్రాల వలదె!
ఒక్క పంక్తిని లక్షల కోగిరమ్ము
ప్రేమతో పంచు తల్లి కీ వేళ నైన
ఎన్నియేన్ కృతజ్ఞతల నందింప వలదె!
కార్య రంగాన తడయక కదల వలదె?
ఒక్క మాటగా అందర మొక్క బాట
సాగవలసిన తరుణ మాసన్న మాయె
పసిడి పండుగకై మన బాధ్యతలను
నిర్వహింపగ విజయమ్ము నిశ్చయమ్ము.