అనంతోత్సవం అంటే : ప్రతి ఏటా జిల్లెళ్ళమూడిలో జూన్ 12, 13, 14 తేదీలలో మాతృశ్రీ అనసూయాదేవి (జిల్లెళ్ళమూడి అమ్మ) అనంతోత్సవాలు నిర్వహించ బడతాయి. వీటిని ఆరాధనోత్సవాలు అనీ అనవచ్చు.
దేశవిదేశాల్లో అసంఖ్యాక సోదరీ సోదరులు తమ మనోమందిరాల్లో అమ్మను వారి వారి ఇలవేల్పుగా, ఆప్తబాంధవిగా, ఆరాధ్యదేవతగా, విశ్వజననిగా ఆరాధిస్తున్నారు.
బాల్యం నుంచీ అమ్మ జాతి కుల మత వర్ణ విచక్షణ, లేకుండా అందరినీ కన్నబిడ్డలుగా ప్రేమిస్తోంది, ఆరాధిస్తోంది. మనుష్యులే కాదు, పశువులు-పక్షులు, క్రిములు-కీటకాలు, సకల సృష్టి అమ్మ సంతానమే.
ఆశ్రితజనపాలనం, శరణాగతరక్షణం వంటి పదాలకి అమ్మ దివ్యసన్నిధిలో చోటు లేదు. అమ్మకి మ్రొక్కిన వారు – మ్రొక్కనివారు, నమ్మినవారు – నమ్మనివారు అనే భేదం లేదు. అట్టి అకారణ కారుణ్యం, ఆశ్చర్యకర వాత్సల్యం రూపుదాల్చిన లీలామానుషవిగ్రహమే అమ్మ.
అమ్మ అంటే తొలి; ఆది, అనాది. “తల్లి అంటే తరింపజేసేది” అని తన అవతార పరమ ప్రయోజనాన్ని అమ్మ స్పష్టం చేసింది.
అవతారం అంటే జగత్కళ్యాణార్థం దివి నుంచి భువికి దిగివచ్చిన దైవీ సంపత్తి, అనంతశక్తి పరిమిత రూపంలో రావటం.
అమ్మ శరీరం పాంచభౌతికమైనది కాదు; పంచభూతాలను జయించినది. ఆద్యంతరహితమైన శక్తి అనంత విశ్వచోదక శక్తి జిల్లెళ్ళమూడిలో ఒక సామాన్య గృహిణిలా మనతో మనవలె నడయాడింది. తన దర్శన స్పర్శన సంభాషణాదులతో సందేహాల్ని నశింపజేసి, సమస్యలకి పరిష్కారాల్ని అందించి, మానవీయ విలువల్ని పెంచి పోషించి, “సర్వసమ్మతమే నామతం” అంటూ అన్ని మతాలను ఆదరించింది; అందరి అభిమతాలను గౌరవించింది. మార్గం, గమ్యం తానే అయి సత్యాన్వేషణ చేసింది; ఆచరణాత్మకంగా శాస్త్రసారాన్ని సుబోధకం చేసింది.
12-6-1985 తేదీన అమ్మ తన పరిమిత రూపాన్ని పరిత్యజించి అఖండమైన స్వస్వరూపంలోకి మహాభి నిష్క్రమణం చేసింది. 14-6-1985 తేదీన ఆలయ ప్రవేశం చేసి సకల జగదారాధ్యగా సుప్రతిష్ఠిత అయింది.
కనుకనే ప్రతి ఏటా జూన్ 12, 13, 14 తేదీలను అనంతోత్సవాలుగా నిర్విహించుకుంటున్నాం.
12-6-2014 తేదీన : ఆవరణంతా రంగురంగుల షామియానాలతో మామిడితోరణాలు – మంగళవాద్యాలతో వేదపాఠశాల విద్యార్థుల వేదనాదంతో ఉత్సవకళను సంతరించుకున్నది. కాగా –
ఒక వైపు గ్రీష్మతాపం, మరొకవైపు ప్రేమామృత పయోరాశి, సకల మానవాళి కంటి వెలుగు, జీవనజ్యోతి అయిన అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిన వియోగ దుఃఖం ముంచెత్తగా అందరి మేనులూ మనసులూ కమిలిపోయాయి, కన్నులు నీటికుండలయ్యాయి.
‘కర్తవ్యం దైవమాహ్నికం’ అంటూ ముందుకు కదిలారు అందరూ. ఉదయం గం6-30 ని.లకు శ్రీ అనసూయేశ్వరాలయంలో 11మంది ఋత్విక్కులతో మూల విగ్రహరూపిణి అమ్మకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా అగ్రజులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, పిదప అమ్మ బిడ్డలంతా సభక్తికంగా ఈ క్రతువులో పాల్గొన్నారు.
అనంతరం ‘అన్నం బ్రహ్మేతి వ్యజానాత్’ (అన్నము పరబ్రహ్మ స్వరూపము) అంటూ బ్రహ్మవల్లిని పఠిస్తూ శివశ్రీ శివానందమూర్తిగారి సూచనమేరకు అన్నపూర్ణేశ్వరి అమ్మను అన్నంతో అభిషేకించారు. తర్వాత ఆ అన్నాన్నే, పాక్షికంగా ముస్తాబైన అన్నపూర్ణాలయ రమ్య హర్మ్యంలో, మహాప్రసాదంగా స్వీకరించారు. ఆ రోజు ప్రత్యేకత ఇదే! అమ్మ మనల్ని దగ్గరకు తీసికొని స్వహస్తాలతో గోరుముద్దలు తినిపించిన మధురానుభూతి మరల ఆక్షణాల్లో మైమరపిస్తుంది.
సాయంత్రం శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తి (గోపాలన్నయ్య) రచించిన ‘అమ్మ అందించిన తత్త్వదర్శనం’ గ్రంధము, వసుంధర అక్కయ్య రచించిన ‘మహోపదేశం’ తృతీయ ముద్రణ గ్రంధం – రెండు సాహిత్య ప్రసూనాలు అమ్మ శ్రీ చరణాలనలంకరించాయి. సభకు యస్.వి.జె.పి. అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ అధ్యక్షత వహించారు. వసుంధరక్కయ్య జ్యోతి ప్రజ్వలనం చేయగా, శ్రీ రావూరి ప్రసాద్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. గోపాలన్నయ్య గ్రంధాన్ని శ్రీ అన్నంరాజు చంద్రమోహన్, వసుంధరక్కయ్య గ్రంధాన్ని శ్రీ కఠవరం కృష్ణమూర్తి ఆవిష్కరించారు. “యశోదాదేవికి బాలకృష్ణుడు, అర్జునునికి శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహించినట్లు గోపాలన్నయ్యకి అమ్మ ఐచ్ఛికంగా విశ్వరూపసందర్శన భాగ్యాన్ని ప్రసాదించింది. అడగనిదే అవసరాన్ని గమనించి పెట్టేదే అమ్మ. అన్నయ్య జిజ్ఞాస, తృష్ణను గుర్తించి అమ్మ అనితర సాధ్యము అనన్య సామాన్యము అయిన జ్ఞానభిక్షను ప్రసాదించింది. గ్రంధం స్వీయ ఆధ్యాత్మిక అనుభవాల మూట – అనుభవ సంజనిత శాస్త్రం” – అని శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, డాక్టర్ బి.యల్. సుగుణ, డాక్టర్ యు. వరలక్ష్మి, శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం ప్రభృతులు ప్రస్తుతించారు. గ్రంధావిష్కర్త శ్రీ అన్నంరాజు చంద్రమోహన్ ఇది తన మహద్భాగ్యమని అమ్మకు కృతజ్ఞతాభి వందనములు సమర్పించారు.
శ్రీ కొండముది లక్ష్మీప్రసాద్ ప్రసంగిస్తూ శ్రీ చలం, వెస్టర్లండ్ వంటి మహనీయులను గుర్తుచేశారు. రచయిత శ్రీ గోపాలన్నయ్య సముచిత రీతిలో కృతజ్ఞతలు తెలియచేశారు. శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ హుందాగా రసవత్తరంగా సభను నిర్వహించారు. శ్రీ రావూరి ప్రసాద్ సుమధురంగా భావస్ఫోరకంగా పద్యపఠనం చేసి సాహిత్యసరస్వతిగా కొలువుదీరిన అమ్మను సంగీత సరస్వతిగా అర్చించారు. వేదికను అలంకరించిన వారందరినీ యస్ విజెపి అమ్మ ప్రసాదంగా నూతన వస్త్రాలతో సత్కరించారు. యస్విజెపి ప్రధానకార్యదర్శి శ్రీ వై.వి. శ్రీరామమూర్తి వందన సమర్పణ చేశారు.
సాయంత్రం గం.6-30 ని.లకు రాగరంజితములు అనురాగభరితములైన నానావిధ పరిమళ పుష్పాలతో భక్తిశ్రద్ధలతో అందరూ అమ్మ శ్రీ చరణాలను అర్చించారు.
రాత్రి గం.10-30ని.లకు వాత్సల్యాలయంలో అమ్మ అతిలోకదివ్యతత్వాన్నీ కళ్యాణగుణవైభవాన్నీ ఆర్తత్రాణ పరాయణత్వాన్ని కీరిస్తూ ‘నీ నామమే పావనం’, ‘కొమ్మపై కోయిలై’ వంటి గీతాలను గానం చేస్తూ అమ్మ పావన నామాన్ని అనుసంధానం చేస్తూ ఆర్తితో ఆవేదనలనే నివేదన చేశారు. జ్యోతిస్వరూపిణి అమ్మకు మహాహారతిని సమర్పించి కళ్ళకు హత్తుకున్నారు.
13-6-14వ తేదీన : ఉదయం గం.6-30ని.లకు శ్రీ అనసూయేశ్వరాలయంలో యధావిధిగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. 12,13,14 తేదీల్లో మూడురోజులూ జట్లు జట్లుగా అహోరాత్రములూ ఉత్సాహంగా అమ్మ నామ సంకీర్తన నిర్వహించారు. యాగశాలలో శ్రీవిశ్వజననీచరితమ్ పారాయణ హోమము ఇత్యాది వేదవిహితకర్మలను ఆచరించారు.
గం. 10.30ని.లకు సోదరి డాక్టర్ బి. యల్. సుగుణ చొరవతో ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా శ్రీ అనసూయేశ్వరాలయంలో సామూహిక అంబికాలక్షనామ పారాయణ జయప్రదంగా సాగింది. శ్రీ అంబికాసహస్ర నామస్తోత్రం సాగరసదృశం, అమ్మ అనర్ఘకళ్యాణ గుణరత్నాలకు ఆలవాలం. ఆ పావన నామ తారాతోరణ శోభ అనిర్వర్ణనీయం; సకలార్ధసాధకం.
సాయంత్రం గం. 5.00ని. లకు అమ్మతత్త్వచింతన సదస్సు నిర్వహించబడింది. శ్రీ ఎమ్. దినకర్ అధ్యక్షత వహించగా, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం ‘నిను పూజింతుము ఈశ్వరీ’ ! కనికరించు కామేశ్వరీ ! అంటూ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ప్రధాన వక్తలు శ్రీ వి. ధర్మసూరి, శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ మన్నవదత్తాత్రేయశర్మ.
సో॥ శ్రీ టి.టి. అప్పారావు ప్రసంగిస్తూ అమ్మ యోగేశ్వరేశ్వరి అనీ, తన సంకల్పమాత్రం చేతనే పశుపక్ష్యాదులకు సైతం యోగసాధనలో ఉన్నతస్థితులను అనుగ్రహించినదనీ, గోపాలన్నయ్య వంటి భాగ్యశాలురకు విశ్వరూప సందర్శన భాగ్యాన్ని అనుగ్రహించినదనీ విశదీకరించారు.
సో॥ శ్రీ మన్నవదత్తాత్రేయశర్మ ప్రసంగిస్తూ – ‘ఊహాతీతమహాశక్తి అయిన అమ్మకు శరీర ధారణ నిమిత్త మాత్రమే. అమ్మ అన్నికాలాల్లో నిజదివ్య దీధితులతో మహోజ్వలంగా ప్రకాశిస్తుంది. ఎందరో అదృష్టవంతులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించి తన వద్దకు చేర్చుకుంటున్నది. అమ్మ రక్షణ సహజంగా, అనవరతంగా, అయాచితంగా పొందుతున్నాం’ అని సోదాహరణంగా వివరించారు. శ్రీ విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు సో॥ వి. ధర్మసూరి ప్రసంగిస్తూ 2022-23 సంవత్సరం ‘మాతృశ్రీ శతజయంత్యుత్సవ సంవత్సరము. అందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను నేడే సిద్ధం చేసికొని ఆచరణలో పెట్టాలి. కొన్ని సూచనలు-
- అమ్మ నామ మంత్ర మహాయజ్ఞం; అమ్మ నామాన్ని అక్షర లక్షలు చేసి మంత్రసిద్ధిని పొందాలి. ఈ 9 ఏళ్ళకాలంలో 100 కోట్లు అమ్మ నామం జపం చేయాలి.
- 108 ప్రాంతాల్లో అమ్మ మహాప్రసాదవితరణ చేపట్టాలి. ఆ సందర్భంగా అమ్మ సినిమా ప్రదర్శన, అమ్మ సాహిత్య విక్రయశాలల నిర్వహణ, అమ్మ తత్త్వచింతన సదస్సుల నిర్వహణ చేపట్టాలి.
- ఏటా నాలుగు పర్యాయములు శ్రీ అంబికా లక్షనామ పారాయణ నిర్వహించుకోవాలి.
- 7 వ మైలు దగ్గర నుంచి ప్రారంభించి రోడ్డుకి ఇరువైపులా నీడనిచ్చు 108 మొక్కలను నాటి పోషించాలి-అని అన్నారు.
యస్ విజెపి అధ్యక్షులు శ్రీ దినకర్ అన్నయ్య మాట్లాడుతూ 2022-23 సంవత్సరము ‘అమ్మ శతజయంతి ఉత్సవ సంవత్సరము’ నిర్వహణ పరంగా అందరి నుంచి సలహాలను స్వీకరించి సత్వరమే ఆచరించడానికి ఉపక్రమిద్దాం’ అన్నారు.
సోదరి శ్రీమతి బ్రహ్మాండం శేషు మాట్లాడుతూ.. ‘శ్రీఅనసూయేశ్వరాలయంలో మన కంటికి కనిపిస్తున్నది ఒక కృష్ణశిలా విగ్రహం. కానీ అది వాస్తవము కాదు. అనురాగరూప రక్తమాంసాదులతో కరచరణాద్యవయవాలతో మీదు మిక్కిలి చల్లని మనస్సుతో మన కన్నతల్లే కొలువై ఉన్నది’ అంటూ ఎన్నో సందర్భాలను ఉదహరించి శ్రోతల ఆనంద ఆశ్చర్యాల నడుమ ఒక వాస్తవాన్ని ఆవిష్కరించింది. శాంతిమంత్రపఠనంతో సభ ముగిసింది.
14–6–14 తేదీన : ‘ఆపోవా ఇదగ్ం సర్వం’ అని అంటుంది వేదం; ప్రాణములు, ప్రాణులు, వేదములు, నక్షత్రాలు, అగ్ని, వాయువు, సత్యం… సర్వం జలము అని అభివర్ణిస్తుంది. కనుకనే ఏటా అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తేదీ (జూన్ 14)న అమ్మ మూలవిరాట్క సహస్ర ఘటాభిషేకం నిర్వర్తిస్తున్నాం. ఉదయం గం. 7-00లకు మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక మంత్రాలు, కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ ఉపనిషత్తులు, అరుణం పారాయణలతో వేదనాదం ప్రతిధ్వనిస్తుండగా సోదర సోదరీమణులందరూ శుచిర్భూతులై మంత్ర పూత జలభరిత ఘటములతో సార్ద్ర హృదయాలతో ‘అమ్మా! సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలి; దేశం సస్యశ్యామలం కావాలి, ఆకలి మంటతో ఎవరూ అలమటించకూడదు – అందరూ కడుపునిండా తినాలి’ అనే విశ్వశ్రేయః కామనతో ప్రేమవర్షిణి అమ్మను అభిషేకించారు.
సాయంత్రం గం. 6-00లకు అమ్మనామ సంకీరన చేసి రాగనీరాజనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రావూరి ప్రసాద్ సమర్థవంతంగా నిర్వహించారు.
సోదరి శ్రీమతి ఎల్. విజయ ‘ఎంత మంచిదాన వోయమ్మా!’ ‘లాలిశ్రీ మాతృమూర్తి!’ ఇత్యాది గీతాల్ని: సోదరి శ్రీమతి ఎమ్.బి.డి.శ్యామల ‘తక్కిన వేల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు’ ఇత్యాది గీతాల్ని, శ్రీ రావూరి ప్రసాద్ ‘గుండెలలో గుడికట్టానమ్మా’, ‘అమ్మా! నీ పాదాలకు వందనం’ వంటి గీతాల్ని మృదుమధురంగా ఆలపించారు. ‘నేనూ పాడాలి. పాడగలను’ అనే ఆత్మవిశ్వాసాన్ని శ్రోతలలో పెంపొందించారు. ఈ సంగీత విభావరికి కీబోర్డు సహకారాన్ని చి. ఏకా రాజా; డోలక్ సహకారాన్ని శ్రీ పి.సుబ్రహ్మణ్యంగారలు అందించారు. వారందరికీ అమ్మ ఆశీఃపూర్వకంగా నూతన వస్త్రాలనిచ్చి సత్కరించారు శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు; పిమ్మట వందన సమర్పణ చేశారు.
రాత్రి గం. 7-00లకు ఈ ఏడాది కూడా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ వల్లూరి పార్ధసారధిరావు, వేదవతి దంపతులు ధ్యానమందిరంలో పూలంగిసేవను కడువైభవంగా భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ‘ఆకంఠ పాద సుమనోమాలామగ్నసువిగ్రహ’ అన్నట్లు అమ్మ శిరస్సుపై పుష్పకిరీటం, శరీరమంతా మరుమల్లె మాలలతో ముంచెత్తి వేశారు.
ఆ అలంకారం వీక్షిస్తే ‘మల్లెపూవుల పాన్పున స్థిరముగా పవళించు కొంతదనుక’ అనే అభ్యర్థనకు క్రియారూపాన్ని దర్శింపచేశారు. ముందుగా శ్రీ లలితాసహస్రనామ పారాయణని సామూహికంగాచేసి, ‘నీ చరణములే శరణంబు’ అంటూ శరణాగతిని చాటి, 32 మంది సువాసినులు 32 జ్యోతులను వెలిగించి స్వయంప్రకాశ మానమూర్తి అమ్మకు మంగళహారతి పట్టారు; అనంతరం తీర్థప్రసాద వితరణ కావించారు.
‘రాగనీరాజనం’ వీనులవిందుగాను, ‘పూలంగిసేవ’ కన్నులవిందుగాను రంజింపచేశాయి. ఇక విందుభోజనం నిమిత్తం అన్నపూర్ణాలయానికి బయలుదేరబోతూండగా నింగి నుంచి అమ్మ ఆశీఃపూర్వకంగా చల్లనిగాలివీచి, వర్షపుజల్లును కురిపించింది.