12-6-2018 నుండి 14-6-2018 వరకు 3 రోజులు అమ్మ 34 వ అనంతోత్సవములను జిల్లెళ్ళమూడిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివరములు :
12-6-2018 : జూన్ 12 తేదీ అంటే – అమ్మ శరీరత్యాగం చేసి మహాభినిష్క్రమణం చేసిన రోజు. నాటి కార్యక్రమములను ఉ॥గం 6.00లకు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు దంపతులు మూలవిగ్రహరూపిణి అమ్మకు మహారుద్రాభిషేకంతో ప్రారంభించారు. అనంతరం వాత్సల్యాలయ ప్రాంగణంలో ‘అమ్మ ఆరాధనోత్సవ సభ నిర్వహింపబడింది. శ్రీ బి. రామబ్రహ్మం, SVPJ అధ్యక్షులు, సభకు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఉపసభాపతి గౌ॥ శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. వారు తమ ప్రసంగంలో – “ప్రప్రథమంగా ఆకలే అర్హతగా కులమతవిభేద రహితంగా ఆకలిని రూపుమాపటానికి కంకణం కట్టుకున్న వాత్సల్యామృత మూర్తి అమ్మ. భయానక దివిసీమ ఉప్పెన – ప్రకృతి వైపరీత్య సందర్భముగా అసంఖ్యాకులు దుర్మరణం పాలైనారు. అమ్మ స్వయంగా వచ్చి వారి కన్నీరు తుడిచి ఆదరించింది. మనుషుల గురించే కాదు, సాగర గర్భంలోకి కొట్టుకు పోయిన లక్షలాది క్రిమికీటకాలు – పశుపక్ష్యాదుల గురించీ కంట తడి పెట్టింది” – అని అమ్మ విశ్వజనీన మాతృతత్వాన్ని శ్లాఘించారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సమర్థవంతంగా సభానిర్వహణ చేశారు. పిమ్మట శ్రీ అనసూయేశ్వరాలయంలో శ్రీ బుద్ధ ప్రసాద్ గారు అమ్మకు అన్నాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందరో సోదరీసోదరులు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు; అమ్మకి అన్నాభిషేకం చేస్తే లోకం యావత్తూ సుభిక్షంగా ఉంటుందని సద్గురు శ్రీ శివానన్దమూర్తిగారు 2005వ సంవత్సరంలో సూచించారు.
సా॥ గం. 6.00లకు అమ్మకు పుష్పార్చన, వేదపారాయణ నిర్వహించారు. రాత్రి గం. 9.30లకు వాత్సల్యాలయంలో ఆర్తితో, సార్ధనయనాలతో అమ్మ నామసంకీర్తన చేసి హారతి పట్టారు.
13-6-2018 : అమ్మలేని లోటు తీరనిది, ఎవరూ తీర్చలేనిది. (ఆ) వేదన అంతులేనిది, భరించలేనిది.
రెండవ రోజు కార్యక్రమములు ఉ॥గం. 6.00లకు అమ్మకు మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకంతో ప్రారంభమైనవి. గం. 9.30లకు విశాఖపట్టణం సో॥ శ్రీ రామకృష్ణానంద రచించి, గీతాలాపన చేసిన ‘మమతల కోవెల’ ఆడియో కాసెట్ ఆవిష్కరణ సభ జరిగింది. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ అధ్యక్షత వహించారు. శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు కాసెట్ను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌ|| శ్రీ వెంకటరామిరెడ్డి I. A.S., Commissioner for Stamps and Registration Dept., A.P., ప్రసంగిస్తూ శ్రీ రామకృష్ణానంద గానమాధుర్యాన్ని వియద్ధంగా ప్రవాహంలా పెల్లుబికే వాగ్ధాటినీ ప్రశంసించారు. శ్రీ వెంకటరామిరెడ్డిగారు ప్రభుత్వ అధికారి, సాహిత్యాభిమాని, ఆధ్యాత్మిక సంపన్నులు. SVJP సంస్థకు ఉదారంగా తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు.
రచయితను, వారి రచనను పరిచయంచేస్తూ డా॥ బి.ఎల్. సుగుణ ‘ఈ గీత రచన సూత్రంవంటింది. లోగడ వారు రచించిన అమ్మవాక్యాల వ్యాఖ్యాన గ్రంథం వీటికి భాష్యం వంటిది’ – అని అభివర్ణిస్తూ అమ్మ అతిలోక మధురమాతృప్రేమ – మహత్తత్వాలు వారి రచనలో ఎలా ప్రకాశిస్తున్నాయో వివరించారు. కాసెట్ ఆవిష్కరించిన శ్రీ రవి అన్నయ్య తన ప్రసంగంలో – “లోగడ శ్రీ రామకృష్ణానంద అమ్మ వాక్యాలకు సంతరించిన వ్యాఖ్యానము అమ్మతత్వానికి వాస్తవచిత్రణ – అని ప్రశంసించారు.
పరిశుద్ధ ప్రేమమయి, అమృతమయిగా అనేకులచే సమ్మానింపబడే ‘అనంతపురం అమ్మ విచ్చేసి తమ మౌనం ద్వారానే అందరికీ శుభాశీస్సుల్ని అందించారు. శ్రీ రామకృష్ణానంద రసస్ఫోరకంగా గీతాన్ని ఆలపించారు. యాగశాలలో శ్రీ చింతలపాటి నరసింహదీక్షితశర్మగారు రచించిన ‘విశ్వజననీ చరితమ్’ హోమాన్ని నిర్వహించారు. సా॥ గం. 6.00లకు శ్రీమతి బి.ఎల్. సుగుణ కృషితో అమ్మాలయంలో సామూహిక అంబికా లక్షనామపారాయణ స్థానికులు మరియు కళాశాల విద్యార్థినీ విద్యార్థుల సహకారంతో నిర్విఘ్నంగా నిర్వహించారు. అదే సమయంలో హైమాలయంలో కొవ్వూరు సోదరులు శ్రీ శ్రీనివాసరావుగారి ఆధ్వర్యంలో షిర్డీసాయి భక్తబృందం వారు అన్నమాచార్య కీర్తనలు, బాబావారిపై కీర్తనలు మనోరంజకంగా గానం చేసి శ్రోతలను ముగ్ధుల్ని చేశారు.
14-6-2018 : జగద్రక్షణార్థం తన మహత్సంకల్పం మేరకు అమ్మ ఆలయప్రవేశం చేసిన రోజు.
ఉ॥ గం. 7లకు అమ్మకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అమ్మ అభిషేకప్రియ. శ్రీ ఎం. దినకర్, శ్రీ వి. ధర్మసూరి, శ్రీ జె.వి.బి. శాస్త్రి, శ్రీమతి వసుంధర అక్కయ్య, శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ కె. ప్రసాదవర్మ ప్రభృతులు ఇందు అనురక్తితో పాల్గొన్నారు.
సా॥ గం. 7లకు శ్రీ ఎన్. లక్ష్మణరావుగారు, శ్రీ వల్లూరు పార్థసారధిరావు గారు సంయుక్తంగా ప్రారంభించిన వార్షిక ఉత్సవం ధ్యానాలయంలో చల్లని చలువరాతి అమ్మ విగ్రహానికి పరిమళ పుష్పపరంపరతో పూలంగి సేవ నిర్వహించారు. సో॥ శ్రీ ఈమని కుమారశాస్త్రి నెల్లూరు నుంచి తెచ్చి అలంకరించిన గజమాలలు చేకూర్చాయి. – పుష్పమాలలు అనంతశోభను ఆనందాన్ని
పరిమిత రూపంతో సామాన్య గృహిణివలె మన మధ్య మనవలె మసలిన మానవతా మాధవత్వ మధుర సమ్మేళన మనోహర మూర్తి అమ్మ తన అవతార పరిసమాప్తి చేసి ఆలయ ప్రవేశం చేసిన సందర్భంగా నిర్వహించే ఆరాధనోత్సవములు – ఈ అనంతోత్సవములు.
లోకాస్సమస్తా స్సుఖినో భవన్తు