1984 ఫిబ్రవరి 17 వ తారీఖున అమ్మ అన్నపూర్ణాలయంలో వున్న వేదిక పైనుండి దాదాపు 200 మందికి తులసిమాలను ప్రసాదించింది గాయత్రీ మంత్ర పునశ్చరణ దీక్ష మొదలు పెట్టించటానికి. ఆగష్టు 8 నుండి 12 దాకా గాయత్రీ మంత్రంతో హోమం జరిపించింది. ఆ మంత్రదీక్ష తీసుకుని హోమం చేసుకున్న అదృష్టవంతులలో నేను ఒకడిని.
అనేక సంవత్సరాల తరువాత ఏరోజు అమ్మ మన చేత హోమం చేయించిందో 2013 లో మళ్లీ అదే రోజు హోమం చేయాలన్న కోరిక కలిగింది. శ్రీ బి.జి.కె శాస్త్రిగారు, రెండు లక్షలు గాయత్రీ మంత్రంచేసి, హోమంలో యజమానిగా కూర్చున్నారు. 8నుంచి 12వరకు 5 రోజులు గాయత్రీ. చాలావైభవంగా జరిగింది. పూర్ణాహుతి రోజు శ్రీ శాస్త్రిగారు అమ్మకు పట్టుచీర సమర్పించుకున్నారు. 5 రోజులు హోమానికి కావాల్సిన ఖర్చు అమ్మ నాచేత, శాస్త్రిగారి చేత పెట్టించింది. నిజానికి అమ్మ మంత్ర దీక్షని స్త్రీ పురుషులందరికీ ప్రసాదించింది. ఆసక్తి వున్న ఆడవాళ్లచేత అమ్మ యజ్ఞోపవీతధారణ చేయించింది. అమ్మనించి దీక్ష తీసుకున్న వాళ్లలో అన్ని కులాల వాళ్లే కాదు. అన్యమతస్తులు కూడా ఉన్నారు. Terry, Richards క్రిష్టియన్లు, నాకంటే చాలా శ్రద్దగా గాయత్రీ మంత్రోపాసన చేశారు. 1984 ఏప్రిల్ 12 అమ్మ నామంతో హైమ నామంతో హోమం చేశారు. మళ్లీ ఈ సంవత్సరం కూడా పూర్ణాహుతి రోజు అమ్మ హైమల నామాలతో హోమం చేశాము. 29 సంవత్సరాల తరువాత పునరుద్ధరించబడిన ఈ కార్యక్రమంలో ఒక వింత జరిగింది.
పూర్ణాహుతి రోజునాడు 3 హోమగుండాల ఏర్పాటు చేయవలసి వచ్చింది. మోహనకృష్ణ గారు, రుక్మిణి అక్కయ్య ఒక హోమగుండం వద్ద కూర్చున్నారు. మోహన కృష్ణగారు అన్నారు. “ఈరోజు హోమంలో సరిగ్గా 21మంది కూర్చున్నారు అని. 21సంఖ్య మాకు జిల్లెళ్ళమూడిలో పరమ పవిత్రమైనది. ఎందుకంటే అమ్మనామం 21 అక్షరాలు.
జిల్లెళ్లమూడిలో ప్రతి ఏకాదశనాడు, ఆశ్లేషా నక్షత్రం నాడు, పూర్ణిమనాడు, ఏకాహం జరుగుతుంది. ఊళ్లో దాదాపు 60మంది ఈ ఏకాహాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. కాండముది రవి ద్వారా వాళ్లందరికీ కబురు చేశాము. మధ్యాహ్నం 11.30 గంటలకు హోమగుండాలు ఏర్పాటు చెయ్యడం కోసం ఎంతమంది ఉన్నారో చూడమన్నాము. సరిగ్గా 21 మంది వచ్చారు. కాకతాళీయమేనా! వసంత నవరాత్రులలో 9రోజులు చండీహోమం చేశాము. భగవతి, సుబ్బలక్ష్మి అక్కయ్యగారు బి.జి.కె శాస్త్రిగారు, అన్ని రోజులూ హోమం చేసుకో గలిగారు. ప్రతి సంవత్సరం గాయత్రీ హోమం, వసంత నవరాత్రుల్లో చండీహోమం జరిగితే చూడాలని, అనేకమంది ఉబలాట పడుతున్నారు.
జూన్ 14 జిల్లెళ్ళమూడిలో మూల విరాట్కు సహస్రఘటాభిషేకం జరుగుతుంది. నేను 1981లో వివాహానంతరం నా ధర్మపత్నితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్నాను. అమ్మ అడిగింది. “ఇంతకంటే పెద్ద గర్భగుడి ఎక్కడైనా చూశావా?” అని. ద్రాక్షారామంలో వుందేమో! ” అన్నాను “ఎక్కడా లేదు” అంది. అనసూయేశ్వరాలయం గర్భగుడిలో ఒక గొప్ప విశేషం ఉంది. దక్షిణాది దేవాలయాల పద్ధతిలో అభిషేకాలూ పూజలూ జరుగుతాయి. అమ్మ ఆ దేశానుసారం ఆ గర్భగుడిలో ప్రవేశానికి అందరూ అర్హులే. 14.6.2013న జరిగే కుంభాభిషేకంలో, సహస్ర ఘటాభిషేకంలో కూడా అందరూ పాల్గొనవచ్చు. రండి. మంచి వర్షాలు కురవాలని అమ్మకి చేసే ప్రార్ధనలో అందరం పాలుపంచుకుందాం.