శ్లో॥ నానాకేశ విశీర్ణ జీర్ణహృదయైః రక్షార్థిభి స్సోదరైః
సమ్యక్సేవిత పాదపద్మయుగళీం శ్రీచక్ర సంచారిణీమ్
మాతృప్రాపిత మాధవత్వ విభవాం అద్వైతసిద్ధిప్రదామ్
అంబాం హైమవతీశ్వరీం హృది భజే కారుణ్యరూపాం శివామ్||
జిల్లెళ్ళమూడి పుణ్యక్షేత్రంలో ప్రధానంగా ప్రప్రథమంగా దర్శించాల్సిన ఆలయం శ్రీ హైమాలయం.
అమ్మ ఆలయాన్ని కంచికామాక్షి మధురమీనాక్షి కాశీ విశాలక్షి ఆలయాలతోనూ, హైమాలయాన్ని వాసవీకన్యకాపరమేశ్వరి కన్యాకుమారి ఆలయాల తోనూ పోల్చవచ్చును.
శ్రీ స్వభానునామ సంవత్సర కార్తిక బ॥షష్ఠీ బుధవారం (17/18-11-1943) పునర్వసూ నక్షత్రాన హైమ అమ్మ గర్భవాసాన జన్మించింది.
సాధారణంగా జిల్లెళ్ళమూడి యాత్రికులకు కలిగే సందేహం ఏమిటంటే అమ్మగారికి ఆలయం నిర్మించారు. బాగుంది. అమ్మగారి అమ్మాయికి కూడా ఆలయం నిర్మించారేమిటి? అని. నిజమే. అందులో ఒక పరమ సత్యం, పరమార్థం, లోకకళ్యాణం అంతర్లీనంగా ఉన్నాయి.
ముందుగా మీకు నా మనవి ఏమంటే ‘అమ్మ’ని ‘అమ్మ గారు’ అనకండి, అనుకోకండి. మన కన్నతల్లిని ‘అమ్మా’ అని పిలుస్తాం, పరమేశ్వరి అయిన ‘అమ్మ’నూ అంతే – ‘అమ్మా’ అనే పిలుస్తాం, తలుస్తాం. మన ఇంటి దగ్గర ఉన్న అమ్మకూ జిల్లెళ్ళమూడిలో వెలిసిన అమ్మకూ తేడా ఏమిటి? ఇంటివద్ద ఉన్న తల్లికి శక్తి పరిమితం, దృష్టి పరిమితం, సంతానం పరిమితం. జిల్లెళ్ళమూడిలో ఉన్న తల్లికి శక్తి అనంతం, దృష్టి విశాలం, సంతానం చరాచర సకల సృష్టి.
మరొక సంగతి ‘అమ్మగారి అమ్మాయి’ అనికూడా భావించకండి. అమ్మ కుమార్తె ఏమౌతుంది? మన సోదరి.కనుక ‘హైమక్క’ అని తలపోద్దాం.
జిల్లెళ్ళమూడి రావడం అంటే పుట్టినింటికి రావడం. అక్కడ మనం దర్శించబోయే మనల్ని అనుగ్రహించబోయే దేవతలు పరాయి వాళ్ళు కారు. జగదీశ్వరి అమ్మ, జగత్పిత నాన్న, కన్యకాపరమేశ్వరి మన సోదరి. అది ఒక మహిమాన్విత అనురాగ రక్తసంబంధబాంధవ్యం, అపూర్వం, అపురూపం. వివరంగా తెలుసుకుందాం.
హైమక్కయ్య ఆదర్శ జీవన విధానం :
మల్లెలోని స్వచ్ఛతా, జాబిలిలోని సౌకుమా ర్యమూ, బంతిలోని ముగ్ధత్వమూ, గులాబీ లోని అందమూ, పారిజాతంలోని పరిమళమూ, తులసిలోని పవిత్రత సంగమించిన విశిష్టవ్యక్తిత్వమే హైమ. మానవిగా పుట్టి దేవతగా ఎదిగింది.
‘దయగల హృదయమే దైవ నిలయం’ కదా! అట్టి అతిలోక కారుణ్యానికి దైవీసంపత్తికి ఆలవాలం హైమ. తాను తిన్నా తినకపోయినా తనను బాధలు పట్టి పీడిస్తున్నా వాటిని ఈషణ్మాత్రమూ లెక్కచెయ్యలేదు. సదా సర్వదా పరహితార్థ లక్ష్యంగానే జీవించింది, తపించింది. కష్టాల ఊబిలో కూరుకుపోయిన వారిని, దుఃఖసంతప్తులను, మృత్యుముఖంలో విలవిలలాడే వారిని చూచి గౌతమబుద్ధునిలా హృదయం ద్రవించి రోదించేది. ఎదుటివాని కాలిలో ముల్లు దిగితే అది తన కంట్లో దిగినట్లు గిలగిలలాడేది; సర్వేశ్వరి అమ్మ పాదాల నాశ్రయించి వాళ్ళ కన్నీళ్ళు తుడిచి గట్టెక్కించమని ప్రార్ధించేది, పోట్లాడేది. ఆశ్రితజన వాత్సల్యం దీనజనావనతత్వం సముద్ధరణ వ్రతం దైవలక్షణం కదా! ఒకటి, రెండు ఉదాహరణలు:
1) శ్రీ రాజుపాలెపు శేషగిరిరావు, వారి తల్లి ఇరువురికీ మశూచి వచ్చింది. రోగం తీవ్రమై హద్దులు దాటింది. వైద్యులు ఆశ వదలు కొమ్మన్నారు. ఆ వార్త విని హైమక్కయ్య పరుగు పరుగున అమ్మ దరిచేరి అమ్మపాదాలు పట్టుకుని “అన్నయ్యని బ్రతికించు, బ్రతికించు” అని కన్నీరు మున్నీరుగా విలపించింది. నిస్వార్థమైన హైమ అభ్యర్ధనను నిండు మనస్సుతో అంగీకరించింది అమ్మ. నాటి రాత్రి అంతా అమ్మ గది మశూచి దుర్గంధ భూయిష్టం అయింది. అంటే ఆ రోగాన్ని అమ్మయే భరించిందా? మర్నాటి ఉదయానికి శేషగిరిరావు అన్నయ్య, వారి తల్లి గండంనుండి గట్టెక్కారు.
2) శ్రీ రావూరి ప్రసాద్ తన కన్నతల్లికి శాశ్వతంగా దూరమై తన తోడబుట్టిన వారితో కలిసి జిల్లెళ్ళమూడి వచ్చారు. హైమక్కయ్య చివాలున లేచి ఎదురేగి వాళ్ళని తన గుండెలకు హత్తుకుని ‘అమ్మ లేదని మీరు దిగులుపడకండి. మీకు అక్కను నేనున్నాను; మనందరికి అమ్మ ఉన్నది” అని ఆదరించి ధైర్యం చెప్పింది.
హైమ సాధన: అమ్మ సూచనతో నిష్ఠగా లలితా పారాయణ చేసేది, జపమాల సాయంతో నామ జపం చేసేది. “అమ్మా! నీవు తప్ప ఇంకేమీ లేకుండా ఉండగలనా!” అంటూ నిశ్చలమైన నిర్మలమైన అనన్యభక్తితో అమ్మ సాయుజ్యప్రాప్తి లక్ష్యంగా తపించింది. ‘తపసా బ్రహ్మ విజిజ్ఞా సస్వ’ తపస్సు ద్వారానే పరతత్వానుభవము ప్రాప్తిస్తుందనేది వేదసారం.
నిష్కామకర్మ, ఉపాసన, ఆరాధన, తపస్సు మున్నగు సాధనా మార్గాలకి హైమ ఆచరణ ఆదర్శం, మార్గం, గమ్యం, అనుసరణీయం. హైమ అంటే ప్రేమ, హైమ అంటే సత్యం, హైమ అంటే త్యాగం, హైమ నిత్యం.
హైమలోని దివ్యత్వాన్ని ముందుగానే అమ్మ సూచించింది:
హైమకి అనుదినం అనునిత్యం పరోపకార చింతయే. అలా ఒకనాడు కొందరి బాధలు, వెతలు మూటగట్టుకుని వెళ్ళి అమ్మకు ఏకరువుపెట్టింది. వాటిని తీసివెయ్యమని త్రికరణశుద్ధిగా మానవ ప్రతినిధిగా అభ్యర్థించింది. ఆ సమయంలో “హైమా! వాళ్ళ దుఃఖాన్ని పారద్రోలమని నువ్వు నాకు చెప్పకపోతే, నువ్వే వాటిని తీసెయ్యొచ్చు కదా!” అన్నది అమ్మ ఆశ్చర్యంగా. “నేనే తీసెయ్యగలిగితే, ఆ శక్తి ఉంటే నీదాకా వచ్చేదాననా?” అన్నది హైమ. వెంటనే అమ్మ, “ఏమో! జరగబోయేది అదేనేమో!” అన్నది. హైమలోని విశ్వశ్రేయః కామన, సర్వత్రా అనురాగం వంటి లోకోత్తర ఉత్తమ గుణపరంపరని చూసి మురిసిపోయింది అమ్మ. కారణంచేతనే హైమను ‘దేవత’గా ప్రతిష్ఠించాలని ఆనాడే అమ్మ సంకల్పించిందేమో!
హైమ సశరీరంగా ఉండగానే పలుసందర్భాల్లో అమ్మ హైమలోని వైశిష్ట్యాన్నీ, వైలక్షణ్యాన్నీ, ఔన్నత్యాన్నీ స్పష్టం చేసింది. ఒకసారి ఇంకొల్లు నుంచి కొందరు సోదరీసోదరులు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను తమ గ్రామమునకు ఆహ్వానించారు. వారి గ్రామంలో అమ్మను అర్చించుకోవటం ద్వారా వారి గ్రామస్థులకు అమ్మ దివ్య దర్శన ప్రసాద స్వీకరణ భాగ్యాలను కలిగించాలని వారి సత్సంకల్పం. కాగా ఆ సమయంలో హైమ పరుచూరులో శ్రీ తంగిరాల సత్యనారాయణ, శ్రీమతి దమయంతి దంపతుల ఇంట్లో ఉన్నది. సత్యనారాయణ గారి కుటుంబంతో హైమ ఒక ఆత్మీయతాను బంధాన్ని కలిగి ఉంది. శ్రీమతి దమయంతి గారిని ‘అమ్మా! అని సంబోధించేది, సమ్మానించేది.
ఆ సందర్భంలో ఇంకొల్లు నుంచి వచ్చిన భక్త బృందంతో అమ్మ “నాకు రావటం వీలుపడదు. పరుచూరులో ఉన్న హైమని తీసుకొని వెళ్ళి నా బదులుగా పూజ చేసుకోండి” అని సూచించింది. అంటే – హైమకీ తనకీ భేదం లేదని స్పష్టం చేసినట్లే కదా! తరువాత కాలంలో హైమ, తను బింబ ప్రతిబింబాలని విశదపరచింది. ఈ సందర్భాలన్నీ హైమాలయ ప్రాదుర్భావానికి నాంది. హైమాలయం అమ్మ అవతార లక్ష్యానికి ప్రతిరూపం, అనంతశక్తికి నిదర్శనం, జగత్కళ్యాణ కారక మహత్సంకల్పం.
హైమాలయం – మహిమాలయం
శ్రీ కీలకనామ సంవత్సర (5-4-1968) చైత్ర శుద్ధ సప్తమీ శుక్రవారం నాడు హైమ శరీరత్యాగం చేసింది. ‘స్వసుఖ నిరభిలాషః ఖిద్యతే లోకహేతోః’ అన్నట్లు తన సుఖాన్ని పరిత్యజించి లోకకళ్యాణం కోసం పరితపించి తుది శ్వాస విడిచింది హైమ. “ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అందరు చల్లగా హాయిగా వుండాలని నేను నీకు నమస్కారం చేసుకుంటానమ్మా!” అనేది హైమ వ్రతం. కనుకనే హైమకి అమ్మ ప్రాణం పోసింది, దైవత్వాన్నిచ్చింది, ఆలయ ప్రవేశం చేయించింది, ముమ్మూర్తులా తన ప్రతిబింబంగా దేవతగా ప్రతిష్ఠించింది.
హైమను గురించి అమ్మ చెప్పిన మాటలే మనకి ప్రమాణం. “హైమ నిజానికి నిజం”
“మనకి హైమ మీద కంటే హైమకి మన మీద ప్రేమ ఎక్కువ; హైమ ప్రేమకు మన ప్రేమకు పోలిక ఏమిటి?”
“హైమాలయం వద్ద) నిరంతరం నామం చెయ్యండి, ఇది తపస్సాధకులకు నిలయం అవుతుంది” అని. హైమాలయంలో అడుగిడినంతనే ఎల్లలు లేని శాంతి, ఆనందం, చల్లదనం – మేనుకు మనస్సుకు.
హైమను అర్చించుకునే విధానం అమ్మ స్వయంగా చేసి చూపింది. హైమ పాలరాతి విగ్రహాన్ని ఆపాదమస్తకము ప్రేమతో నిమిరి, గళసీమలో పుష్పహారాన్ని వేసి, శిరస్సుపై పాదాలపై పూలు చల్లి, నోటికి నివేదన అందించేది; అనుదినం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లలితా సహస్రనామ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తరశత నామ పూర్వకంగా అర్చనలు ప్రారంభించింది. అందులో అనురాగం ఉన్నది, ఆరాధన ఉన్నది. అమ్మకు బిడ్డలూ దేవుళ్ళే, దేవుళ్ళూ బిడ్డలే.
‘వరాల దేవత’గా హైమ ప్రతిష్ఠ అనంతరం తనను పూజించడానికి వచ్చిన వారిని హైమకు మొక్కుకోమని, హైమాలయంలో ప్రదక్షిణలు ఆచరించమని, హైమకు నివేదనలను తమ తమ అవేదనలను, అభ్యర్థనలను సమర్పించమని సద్యః ఫలప్రాప్తికి అది రాచబాట, తరణోపాయమని అమ్మ సూచించింది. ఆ విధంగా క్షిప్రప్రసాదిని అయిన హైమను నమ్ముకొని దీక్షగా అర్చించుకున్నవారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము, అభ్యుదయము కలిగినవారు శ్రీ వై.వి.సుబ్రహ్మణ్యం, శ్రీమతి నక్కా శకుంతలమ్మ, శ్రీరాచర్ల లక్ష్మీనారాయణ, శ్రీమతి రావూరి శేషప్రభావతి వంటి వారు అనేకులు. ప్రేమ, కరుణ కలిసి ఒక రూపంగా అవతరిస్తే అది హైమ. కరుణాంత రంగ హైమ ఇష్టకామ్యార్థ సిద్ధిని ప్రసాదించటంతో హైమాలయం కల్పవృక్షం కామధేనువు అని అనేకులకు అనుభూతమైంది.
(సశేషం)