(గత సంచిక తరువాయి)
అమ్మ తన చిన్నతనంలోనే నాన్నగారిని జీవిత భాగస్వామినిగా నిర్ణయించుకొన్నది. సాక్షాత్తూ నాగేంద్రుడే నాన్నగారు అని అనేక సందర్భాలలో ప్రకటించింది. “వాడే నాకాధారం. వాడి ఆకారమే నేను” అని తన చిన్నతనంలోనే లక్ష్మణాచార్యులు గారికి వ్యక్తపరచింది. ఆ సన్నివేశం ఒక్కసారి పరిశీలిద్దాం.
చిదంబరరావు తాతగారికి సన్నిహితులు శ్రీ లక్ష్మణాచార్యులు గారు. వారింటికి నిత్యమూ వచ్చి పోతూ వుంటారు. వారు నృసింహెపాసకులు. గంభీరమైన విగ్రహం.
వారు అమ్మను “బాలాత్రిపుర సుందరీ!” అని సంబోధిస్తూ వుండేవారు. వారు ఒక రోజు అమ్మతో “అమ్మా! నాకు 60 సంవత్సరాలు వెళ్ళిపోతున్నవి. నీ లీలలన్నీ చూస్తానో చూడనో? నిన్ను నేను మీ అమ్మ పోయిన రోజు నుండి గమనిస్తూ వున్నాను. ఇటీవల ఒక రోజున స్వప్నంలో నీవు కనిపించావు. నీ యదార్థం వివరించావు. చివరకు నీవు నా తండ్రి నరసింహస్వామిగా సాక్షాత్కరించావు.” అంటారు.
అమ్మను వారింటికి తీసుకు వెళతారు. ఆ రోజు ఏకాదశి. ఆ రాత్రి వారు అమ్మను ఆరాధించుకుని, తిరిగి ఇద్దరూ చిదంబరరావు గారింటికి దాదాపు పన్నెండు గంటల సమయంలో వెళుతూ వుండగా దారిలో పెద్ద త్రాచు ఇద్దరి మధ్యనా నిలుచుని కనపడుతుంది. సర్పం హఠాత్తుగా ఆచార్యులుగారి నిలువునా లేచి తోకమీద నిలబడి వారి వంకనే చూస్తూ వుంటుంది. వారు భయకంపితులైపోతారు. అరగంట తరువాత వారు కళ్ళు తెరచి చూడగా పాము అమ్మను చుట్టుకొని వున్నట్లుగా కనపడుతుంది. వారు అమ్మ పాదాలపై పడి “నేను పాము అంటే భయం లేని వాడిని, ఈ పామును చూస్తే ఎందుకింత భయం కలిగింది? ఇది పాము కాదేమో! అయినా నిన్ను చుట్టవేసుకుందేమిటమ్మా?” అని అడుగుతారు.
ఇక్కడ అమ్మ ఒక పరమరహస్యం వెల్లడిస్తుంది.
“పాము కాదు నాయనా! నాగేంద్రుడు. నాగేంద్రుడే నన్ను చుట్టుకుని వున్నాడు. నేను నాగేంద్రుడ్ని చుట్టించుకున్నాను. ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై వస్తాడు. వాడే నాకాధారం. వాడి అకారమే నేను” అని వివరిస్తుంది.
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లైతే, అమ్మ తన గురించి, నాన్నగారి గురించి స్పష్టంగా వెల్లడించింది.
“ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడు” అని తెలియ చేసింది. పరమేశ్వరుడిని చుట్టుకుని వున్న నాగేంద్రుడు వాసుకి. అలాగే పాలకడలిలో విష్ణుమూర్తి పవ్వళించి, ఆయనకు ఆధారమైన నాగేంద్రుడు వేయిపడగల ఆదిశేషుడు. నాగేంద్రుడు చుట్టుకుని వున్న రూపం పరమశివుడు. నాగేంద్రుడు ఆధారమైన రూపం శ్రీమహావిష్ణువు. నిజానికి ఈ ఇద్దరూ ఒకటే. “శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే” అని కదా వేద వాక్యం! ఆ రూపమే అమ్మ. అమ్మకు ఆధారమైన నాగేంద్రుడే నాన్నగారు. వీరిరువురూ ఏకమై కొలువున్న ఆలయమే “అనసూయేశ్వరాలయమ్”.
“పాతివ్రత్యమంటే పతిని ఆధారం చేసుకుని పంచభూతాలనూ జయించట” మన్నది అమ్మ వాక్యం. “పాతివ్రత్యానికి పరాకాష్ఠ, భర్త కూడా భార్యని ‘అమ్మా’ అని పిలవటమే” అని కూడా అన్నది. ఈ రెండు వాక్యాలూ అమ్మ తన జీవితం ద్వారా నిరూపించి చూపించింది.
అమ్మ మనకు దేవత అయితే నాన్నగారు అమ్మకు దేవుడు. ఈ భావనలో అమ్మకు ఏ క్షణంలోనూ ఏమరుపాటు లేదు. నిత్యం తన మంగళసూత్రాలను అభిషేకించి ఆ తీర్థం తీసుకునేది. అల్లంత దూరంలోనే నాన్నగారి అడుగుల సవ్వడిని గుర్తుపట్టి చెప్పేది. “అమ్మ పరధ్యానంగా వున్నది” అని ఎవరో అంటే, “పరధ్యానం కాదు నాన్నా! పతిధ్యానం” అని సవరించేది. “మేనత్త కొడుకూ ఒక మొగుడేనా?” అని ఎవరో హాస్యమాడితే “మొగుడని ఎవరనుకుంటున్నారూ? దేవుడను కుంటుంటేనూ!” అని ప్రతి సమాధాన మిచ్చింది.
ఆ ఆలయానికి “అనసూయేశ్వరాలయం” అని నామకరణం అమ్మే చేసింది. దాని అర్థం “అనసూయా సమేత నాగేశ్వర” ఆలయం అనిగానీ, “నాగేశ్వర సహిత అనసూయ” ఆలయమని గానీ కావచ్చు. ఏది ఏమైనా సమయాచార తత్పరులకు అది పరమగమ్యం.
నాన్నగారిని ఆలయంలో ప్రతిష్ఠించిన తరువాత ఆలయ నిర్మాణ లక్ష్యం దాదాపు అవగతమయినట్లే. భవిష్యత్తులో అమ్మ కూడా నాన్నగారి సరసన అక్కడ కొలువుతీరుతుందని చెప్పకనే చెప్పినట్లయింది.
ఆ ఆలయంలో పూజా విధానం అమ్మ నిర్దిష్టంగా తెలియజేసింది. ప్రతి ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అమ్మచే “అపర శంకరాచార్యు” లనిపించుకున్న పండిత శ్రేష్ఠులు డా. పన్నాల రాధాకృష్ణశర్మగారు రచించిన “అంబికా సహస్రనామం” “త్రిశతి” “అంబికా ఖడ్గమాల” “అంబికా అష్టోత్తర శత” నామాలతో అర్చన జరుగుతుంది.
అమ్మ ఆలయ ప్రవేశం 1985 జూన్ 14వ తేదీన జరిగింది. జూన్ 12 రాత్రి పది గంటల ముప్పై నిముషాలకు అమ్మ శరీరత్యాగం చేసింది. ఆ సమయంలో అన్నపూర్ణాలయంలో భోజనం చేస్తున్న సోదరులు కీ.శే. యార్లగడ్డ భాస్కరరావు అన్నయ్యకు విమానం వస్తున్న శబ్దం స్పష్టంగా వినపడిందట. ఆ సమయంలో ఆయనకు అది ఏమిటో అర్థం కాకపోయినా, తరువాత ఆయనకు ఎప్పుడో అమ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. తన శరీరత్యాగ సమయంలో విమానం వస్తుందని అమ్మ ఆయనకు చెప్పింది. భాస్కరరావు అన్నయ్య ఒక ముని. పరమ సాత్విక జీవితం గడిపిన ఒక యోగి. అమ్మ స్వయంగా తన జీవితచరిత్రను చెపుతుండగా అక్షరబద్ధం చేసిన తపస్వి.
1985 జూన్ 12 న అమ్మ అవతార పరిసమాప్తి జరిగింది. మరునాడు అమ్మ భౌతిక దేహం భక్తుల దర్శనార్థం వుంచబడింది. జూన్ 14వ తేదీన అమ్మను వేదోక్తంగా “అనసూయేశ్వరాలయం” లో ఎడమవైపున నాన్నగారి సరసన ప్రతిష్ఠించటం జరిగింది.
1987 మే నెల 5వ తేదీన అమ్మ కృష్ణశిలా విగ్రహం ఆలయంలో ఆగమశాస్త్ర విధి విధానంలో ప్రతిష్ఠింపబడింది.
అమ్మ గతంలోనే హైమాలయం లో తెల్లని పాలరాతితో చెక్కిన హైమ విగ్రహం ప్రతిష్టించాలని, తన విగ్రహం నల్లటి గ్రానైట్ రాతిలో రూపుదిద్దుకోవాలనీ నిర్దేశించింది. ఆ ప్రకారమే అమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించటం జరిగింది.
ఇంతటి నేపథ్యం కలిగిన అమ్మ ఆలయం లోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. అడుగు పెట్టేముందు హైమక్క దర్శనం చేసుకోవాలి. ఇది అమ్మ హైమక్కయ్యకి ఇచ్చిన వాగ్దానం, నిర్దేశించిన విధానం. కనుక మనమంతా ఆచరించవలసినదే. కరుణామయి హైమను తలచుకుంటేనే హృదయం ఉప్పొంగుతుంది.
మున్ముందుగా ధవళ కాంతులతో హిమకర శిలామూర్తియై, ప్రత్యంగము నుండీ ప్రసరిస్తున్న కాంతి సమూహంతో, చిన్ముద్రబూనిన కరద్వయంతో, స్వచ్ఛమైన అంతఃకరణానికి దర్పణంవలే మనోహరమైన మందహాసంతో, కరుణ కురిపిస్తూ, “నానాక్లేశ విశీర్ణజీర్ణ హృదయులైన” సోదరులకు చూపులతోనే సౌజన్యాన్నీ, శాంతిని ప్రసాదించి, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే కనుదోయితో, అంజలి ఘటించకుండా వుండలేని ఆ కారుణ్యవారాన్నిధిని దర్శించి అమ్మ ఆలయం లోకి కుడిపాదం మోపి ప్రవేశించగానే, వాగర్థముల వలే ఒక్కటైనా రెండుగా కనిపించే అనసూయా నాగేశ్వరుల కళ్యాణమూర్తులు దర్శనమిస్తాయి.
ఇదే మణిద్వీపం. అమ్మ శ్రీమాత. ఆమె నివాసం మణిద్వీపం. ఆ మణిద్వీపమే శ్రీచక్రం. “శ్రీచక్రరాజ నిలయా” అని వ్యాసులవారు లలితా సహస్రంలో, “శ్రీచక్రాధీశ్వరీ, మాతా, శ్రీమదర్మపురీశ్వరీ!” అని పన్నాలవారు అంబికా సహస్రంలో చెప్పారు. గర్భాలయమే చింతామణిగృహం.
ప్రదక్షిణ పూర్వకంగా అడుగులు వేయగానే ఇక్షుకోదండధారిణియై, పాశాంకుశాలతో బాలా త్రిపురసుందరి దర్శనమిస్తుంది. ప్రక్కనే “మేరుప్రసార శ్రీచక్రం”.
ఈ శ్రీచక్రం అట్టడుగు భాగాన్ని ‘భూపుర’ ప్రస్తారము అనీ మధ్యభాగాన్ని కైలాస ప్రస్తారము అని, శిఖరభాగాన్ని మేరు ప్రస్తారము అని అంటారు. శిఖరభాగంలో ఉన్న అమ్మకే ‘సుమేరు శృంగ మధ్యస్థా’ అని లలితా సహస్రంలో చెప్పిన పేరు. భూపుర ప్రస్తారంలో వశిన్యాది వాగ్గేవతలు, కైలాస ప్రస్తారంలో సప్త మాతృకలు, మేరు ప్రస్తారంలో షోడశకళలుగా జరిగింది. ఉన్న నిత్యాదేవతలు ఉంటారని శ్రీచక్ర సంప్రదాయం తెలియచేస్తోంది.
ఈ సంప్రదాయానికి అనుగుణంగానే, సప్తమాతృకా మూర్తులు గర్భాలయం చుట్టూ కొలువై యున్నారు. ఈ సప్తమాతృకా మూర్తులు మన శరీరంలోని సప్తధాతువులకు అధిష్టాన దేవతలు. మనశరీరంలోని చర్మము, రక్తము, మాంసము, మేద, అస్థి (ఎముకలు), మజ్జ, శుక్లము అనే సప్తధాతువులను అమ్మ అయా రూపాలలో పోషిస్తుంది. శుక్ల శోణితాలు కలయికతో నిర్మాణమయే మానవ శరీరం సప్తమాసానంతరం పూర్ణ రూపాన్ని సంతరించు కుంటుంది. ఆయా మాసాల గర్భస్థ శిశువులకు సప్తమాతృకా మూర్తులు పోషక శక్తులు.
సప్తమాతృకా మూర్తుల దర్శనానంతరం సుమేరుశృంగమధ్యస్థ, శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరీ అయిన అనసూయేశ్వరి సర్వాలంకరణ శోభితయై వాత్సల్య సుధాధారలను వర్షిస్తూ దర్శనమిస్తుంది.
అమ్మ శిలారూపంలో ఆలయంలో కొలువై వున్నా, అక్కడ వున్నది సజీవశిల్పం. ఈ విషయంలో అనేకమందికి అనుభవాలు ప్రసాదించింది అమ్మ. సామాన్యంగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసం, నేత్రోన్మీలనం మొదలైన క్రతువులు నిర్వహిస్తారు. అప్పుడే ఆ విగ్రహం సంపూర్ణ తేజోవంతమై నిత్యపూజా కార్యక్రమాలకు అర్హత సంపాదించుకుంటుంది.
కానీ అమ్మ విగ్రహం ప్రతిష్టాకార్యక్రమానికి పూర్వమే చైతన్యవంతమే నని ఈ రచయితకి అమ్మ ప్రసాదించిన వ్యక్తిగత అనుభవం. విగ్రహం తీసుకు వస్తున్న సమయంలోనే ఆ విగ్రహాన్ని స్పర్శించిన వారికి అది కఠినమైన శిలగా కాక సజీవమైన రక్తమాంసాది ధాతు నిర్మితమైన శరీర స్పర్శగా అనుభవమివ్వటం
అమ్మ విగ్రహ ప్రతిష్ఠానంతరం అనేకమంది విగ్రహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించటం, నిత్య సేవలలో అలసత్వం వలన జరిగిన లోపాలను అమ్మ స్వప్నంలో దర్శనమిచ్చి తెలియజేయటం వంటి అనుభవాలు భక్తులకు కోకొల్లలు.
అమ్మ సమతామూర్తి. అది మమతల గర్భగుడి. “అందరికీ సుగతే” అని ప్రకటించింది అమ్మ. అది అందుకోవటమే మనవంతు. ఇవ్వటానికి అమ్మ ఎప్పుడూ సిద్ధమే!
జయహెూ మాతా!!