బ్రహ్మాండాన్వయ తత్పరా పరిణత ప్రజ్ఞాధురీణా శివా
శ్రీనాగేశ్వర పాదపద్మ యుగళీ చింతాసుధాస్వాదినీ
శ్రుత్యంతస్తవనీయ దివ్యచరితా శ్రీరాజరాజేశ్వరీ
భూయాదర్కపురీశ్వరీ శుభకరీ మాతా నసూయా సతీ
జిల్లెళ్ళమూడి రావాలనుకునే సోదరీ సోదరులు సామాన్యంగా అమ్మను గురించి విని, చదివి, లేక సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని, లేదా ఇతర సోదరులచే ప్రోత్సహింపబడి, ఆసక్తితోనో, భక్తితోనో, ఆర్తితోనో, జిజ్ఞాసతోనో వస్తారు. వారు రాగానే దర్శించాలనుకునేది ముందుగా అమ్మని. కాబట్టి అమ్మ చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం.
ఇంతవరకూ విశ్వచరిత్రలో “దుష్టశిక్షణ, శిష్ట రక్షణ” అవతార ధ్యేయంగా వచ్చినవారున్నారు గానీ, గుణభేదమే లేని, మంచీ చెడుల విచక్షణ పరిగణించని, “తల్లికి తప్పేకనపడదు” అనీ, “మీలో తప్పులు ఎంచటం మొదలుపెడితే” అది నాతప్పనీ, పాప పుణ్యాలకు మీరు బాధ్యులు కారు అని “అందరికీ సుగతే” అని ప్రకటించి, అభయమిచ్చిన వారెవరైనా వున్నారా? అని ప్రశ్నిస్తే చరిత్ర మౌనం దాల్చక తప్పదు.
అదీ ముఖ్యంగా అమ్మ అవతార ప్రత్యేకత.
సకల సృష్టిని తనలో, తనను సకలసృష్టిలో దర్శించి తాదాత్మ్యం చెందిన ఆత్మావలోకి; సకల కార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలనూ నడిపే సగుణమూర్తి; తరింప జేసే తల్లిగా అవతరించిన మానవసౌభాగ్యదేవత అమ్మ.
పరిపూర్ణ ప్రేమావతారం అమ్మ. ప్రేమ తత్త్వమే అమ్మ. ప్రేమించటం తప్ప మరొకటి తెలియని అమ్మ అవతారం న భూతో న భవిష్యతి. అమ్మ దృష్టిలో దుష్టులెవరూ లేరు.
మాతృతత్త్వ ప్రతిరూపమైన అమ్మ ఆంధ్రదేశం లోని పొన్నూరు పట్టణ సమీపంలోని మన్నవ గ్రామంలో, ఒక సామాన్య గృహాన, మన్నవ సీతాపతి శర్మ, రంగమ్మ దంపతులకు జన్మించింది. అమ్మ జననం 1923 మార్చి 28 బుధవారం, రుధిరోద్గారి నామ సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి, ఆశ్లేషా నక్షత్రం. జన్మించిన మూడు సంవత్సరాలకే తల్లిని కోల్పోయినా, బంధుజనుల నిరాదరణకు గురైనా, అవేవీ అమ్మ సహజ స్థితిని ప్రభావితం చెయ్యలేదు. ఆదిశక్తి, పరాశక్తి ‘అమ్మ’ గా అవతరించింది. అమ్మత్వానికి అనుగుణమైన ప్రేమ, వాత్సల్యం, క్షమ, సహనం మొదలైన ప్రధాన గుణాలతో ఆ శక్తి ‘అమ్మ’ గా ఈ అవనీతలంపై సంచరించింది. “నేనే మీ అందరినీ కని, మీ మీ తల్లులకు పెంపుడిచ్చాను” అని అమ్మే ప్రకటించింది. అమ్మ విశ్వజనీన మాతృత్వానికి ప్రతీక ఈ వాక్యం.
సహనం అమ్మకు సహజం. ప్రేమ అమ్మ స్వభావం, బాల్యంలోనే అమ్మలోని ప్రత్యేకతను కొంతమంది గుర్తించినా, అమ్మలోని దివ్యత్వాన్ని మాత్రం చినతాతగారైన చంద్రమౌళి చిదంబరరావు గారు, మరిడమ్మ తాతమ్మ గారు మాత్రమే దర్శించగలిగారు.
అమ్మకు 13వ ఏట, మేనత్తగారైన బ్రహ్మాండం కనకమ్మ గారి పుత్రుడు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుతో వివాహం జరిగింది. తరువాత, అమ్మ జిల్లెళ్ళమూడిలో 1940 ప్రాంతాల్లో అడుగు పెట్టడం జరిగింది. నాన్నగారు జిల్లెళ్ళమూడి గ్రామకరణంగా వుండేవారు. ఆ రోజుల్లో వర్గ విభేదాలతో సతమతమవుతూ వున్న కుగ్రామం జిల్లెళ్లమూడి.
జిల్లెళ్ళమూడిలో జిల్లేడు చెట్లు ఆ రోజుల్లో ఎక్కువగా వుండేవట. జిల్లేడు వృక్షానికి ‘అర్కవృక్ష’ మని కూడా మరో పేరు. అందుకే జిల్లెళ్ళమూడి “అర్కపురి” గా కూడా ప్రసిద్ధి.
“జిల్లెళ్ళమూడి అమ్మ గా సుప్రసిద్ధమైన అమ్మ పుట్టింటివారి పేరు గానీ, మెట్టినింటివారి పేరు గానీ “జిల్లెళ్ళమూడి” కాదు.
దైవనిర్ణయాలు చాలా విచిత్రంగా వుంటాయి. ఎక్కడో ఏడుకొండల పైన శ్రీనివాసుడు కలియుగ దైవమై వెలిశాడు. దుర్గమమైన అరణ్యప్రాంతంలో శ్రీశైలంలో భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు కొలువైనాడు. అహెూబిలంలో నరసింహస్వామి, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ జనావాసాలకు దూరంగా వెలిశారు. వారి దర్శనం కోసం భక్తులు పడే తపనే తపస్సు.
జిల్లెళ్ళమూడిని అమ్మ తన స్థిరనివాసంగా ఎన్నుకోకపోతే, అటువంటి గ్రామం ఒకటుందని ఈనాటికి కూడా ఎవరూ గుర్తించలేనటువంటి, ఏ ఆధునిక వసతులూ లేనటువంటి, అతి చిన్న పల్లెటూరు. ఏ విధమైన ప్రచారం లేకుండానే, అమ్మ దివ్యత్వాన్ని అనేకమంది గుర్తించి క్రమంగా అమ్మ దర్శనార్థం రావడం 1950వ దశకం ప్రథమార్థంలో ప్రారంభమైంది.
అమ్మ సన్నిధిలో సహజవైరం మాని జంతువులు కూడా ప్రేమభావంతో తిరిగేవి. సాధారణంగా పిల్లి పిల్లలు కనపడితే కుక్కలు కొరికేసి చంపటం పరిపాటి. కానీ, కుక్కలు పిల్లిపిల్లలకు పాలివ్వటం, అమ్మ దర్శనం కోసం వచ్చే సోదరీ సోదరులతో కుక్కలు, పిల్లులు, గేదెలు, ఆవులు మొదలైన అనేక జంతువులు స్నేహభావంతో వుండటం అమ్మ సన్నిధిలో అతి సహజంగా జరిగిపోయేవి. జిల్లెళ్ళమూడిలో ఒక పెద్ద కుక్క వచ్చే పోయే యాత్రికులకు తోడుగా గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో వున్న ముఖ్య రహదారి ఏడవమైలురాయి వరకూ వెళ్ళి సాగనంపేది.
విషసర్పాలైన పాములు అనేకం తిరుగుతూ వున్నా ఎవరికీ హాని చేసేవి కావు. ఇప్పటికీ జిల్లెళ్ళమూడిలో అనేకమైన పాములు తిరుగుతూ వుంటాయి. మనం వాటిని చూసి భయపడుతున్నా, అవి ఎవరినీ ఏమీ చేయటం చూడలేదు. అనేకమంది సోదరీ సోదరులు నిష్కల్మషమైన, స్వచ్ఛమైన అసాధారణ ప్రేమాభి మానాలతో మసలుతూ వుండేవారు. ఆ విధంగా అమ్మ నివాసం అలనాటి ఋష్యాశ్రమ వాతావరణంతో విరాజిల్లుతుండేది.
జిల్లెళ్ళమూడిలో ముందుగా దర్శించవలసినవి ఆలయాలు. అమ్మ, నాన్నగారు కొలువైయున్న ఆలయం శ్రీ అనసూయేశ్వరాలయం. ఏ ఇతిహాసంలోనూ, ఏ పురాణ కథలలోనూ ఆలయంలో కొలువుదీరిన దైవమే తన ఆలయానికి పునాదివేసి, నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించి, అణువణువునూ తన పావన స్పర్శతో పునీతం చేసి, ఆ ఆలయంలో ప్రతిష్ఠింపబడిన సంఘటన వుందో లేదో తెలియదు గాని, అమ్మ ఆలయం ప్రత్యేకత అది..
అమ్మ ఆలయ ఆవిర్భావం వెనుక ఆసక్తికర చరిత్ర వుంది. అమ్మ జిల్లెళ్ళమూడి ప్రవేశించిన కాలానికి ఆ గ్రామంలో ఏ ఆలయమూ లేదు. ఒకసారి ఒక సాధువు రాత్రి సమయంలో జిల్లెళ్లమూడి వచ్చాడట. ఆకలితో వున్న అతనికి అమ్మ ఆహారం అందజేస్తే, ఆలయంలేని వూరిలో తను భోజనం చేయనని చెప్పాడట. సహజ సహనమూర్తి అయిన అమ్మ సహించలేనిదంటూ ఏదైనా వుంటే అది బిడ్డలు ఆకలితో వుండటమే. అందుకని సత్యస్వరూపిణి అయిన అమ్మ అసత్యమాడటానికి కూడా వెనుకాడక, ఆ చీకటిలో ఏదో ప్రదేశాన్ని చూపి అదే ఆలయమని చెప్పి ఆయనకు అన్నం పెట్టిందట.
తదనంతర కాలంలో ఏ ఆలయమూ లేని జిల్లెళ్ళమూడిలో అమ్మ ఆలయం, మహిమాన్వితమైన హైమాలయం ఆవిష్కృతం కావటం చారిత్రక సత్యం. కాకపోయినా భూత, భవిష్యద్వర్తమానాలనే కాలభేదాలు సామాన్యులమయిన మనకు గాని, సర్వం వర్తమానమయిన అమ్మకు కాదుకదా!
అమ్మ ఆలయం శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయానుగుణంగా వుంటుంది. ప్రధాన ఆలయం అంతా రాతి కట్టడం. అమ్మ ఆలయం సుమారు 1956 వ సంవత్సరంలో ప్రారంభించబడి 1970 దశకం చివరికి దాదాపు పూర్తి అయి ప్రతిష్ఠకై వేచివుండేది. మొదట అందరూ అది రామాలయమనుకున్నారట. “ఈ ఆలయంలో ఏ దేవుడిని పెడతావమ్మా” అని అమ్మను అడిగితే “ముష్టి దేవుడ్ని పెడతాను” అన్నదట. మరి సమస్త భువనాధీశ్వరుడైన ఆ పరమేశ్వరుడు ఆదిభిక్షువేకదా!
శ్రీ లక్ష్మీకాంతానందయోగి గారు చేబ్రోలు సమీపంలోని రెడ్డిపాలెంలో “ఆనందాశ్రమం” నిర్వ హిస్తూండేవారు. వారు గాయత్రీ ఉపాసకులు. అమ్మను వారు గాయత్రీ మాతగా దర్శించిన మహానుభావులు. వారు ఒకసారి జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు నిర్మాణంలో వున్న ఆలయం (అప్పుడు ఒక పాక మాత్రమే వుండేది) చూసి అమ్మను “మీరు కట్టించు దేవాలయమునం దే ప్రతిష్ఠ చేయనెంచిరి?” అని అడుగుతారు. దానికి అమ్మ “పంచాయతనము” అని సమాధానమిస్తుంది.
ఈ సంగతి కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావు గారు తన డైరీలలో వ్రాసుకున్నారు. ఆ డైరీ ప్రతులు ఇప్పడు “మాతృశ్రీ డిజిటల్ సెంటర్” లో భద్రపరచి వున్నవి.
అలయం నిర్మాణంలో వున్న కొన్నాళ్ళు నామయోగి కీ.శే. కాసు రాధాకృష్ణరెడ్డి రాత్రిపూట పడుకునేవాడు. రాధాకృష్ణ రెడ్డి పుట్టుగుడ్డివాడు. సంగీత విద్వాంసుడు. కర్ణాటక, హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో నిష్ణాతుడు. అవిశ్రాంతంగా అమ్మ నామం చేసేవాడు. ఆయన జీవన విధానమే విశిష్టంగా వుండేది. ఆయన ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో గర్భాలయం నుండి ఆయనకు ప్రణవనాదం, వేద ఘోష వినపడుతుండేవట. ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం జరగకపోయినా ప్రతి సంవత్సరం మే నెల 5న, అమ్మ కళ్యాణోత్సవ సందర్భంగా ఆలయంలోపల, వెలుపల, పైన అమ్మ, నాన్నగారితో కలిసి దర్శనమిస్తూ వుండేది. ఆలయం పైనుండి అమ్మ, నాన్నగారు పసుపు, కుంకుమ, పూలు వెదజల్లేవారు. కిందనున్న భక్తులు దివినుండి రాలే మంగళభరిత వర్షధారలవలె అమృతాశీస్సుల వలె వాటిని స్వీకరించి పరవశించేవారు. అమ్మ, నాన్నగారు కలిసి కొబ్బరి కాయలు, గుమ్మడి కాయలు పగులగొట్టేవారు. మే 5 అమ్మ, నాన్నగార్ల కళ్యాణోత్సవం గనుక వారిద్దరూ అలా దర్శనమిస్తున్నారనుకునే వారు గాని, దాని ప్రాముఖ్యత తరువాత కాని అర్థం కాలేదు. 1981 ఫిబ్రవరి 16న నాన్నగారి శరీర త్యాగానంతరం ఫిబ్రవరి 17న గర్భాలయ కుడిభాగాన నాన్నగారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది.
నాన్నగారిని ఆలయంలో ప్రతిష్ఠచేయడం ఒక దేవరహస్యం. నాన్నగారిని ఆలయంలో ప్రతిష్ఠించు తారని అంతవరకూ ఎవరూ ఊహించలేదు. కేవలం అమ్మకు భర్త అయినందువలననే ఆయనకు దైవత్వం అపాదింపబడి, అలయంలో ప్రతిష్ఠింపబడి, పూజలందు కుంటున్నారని ఎవరైనా భావించితే అంతకన్నా పొరపాటు వుండదు. ఇక్కడ నాన్నగారిని గురించి కొంత వివరించవలసిన అవసరం వుంది.
వ్యక్తమైన పరాశక్తి అమ్మ అయితే, అవ్యక్తమైన పరమశక్తి నాన్నగారు. వెరసి లోకానికి ఆధారమైన వారు. ఇద్దరైన ఒక్కరు. ఒకరు లేక మరొకరు లేరు. వ్యక్తమైన అమ్మలోని దివ్యత్వాన్ని ఎంతో మంది దర్శించారు, స్తుతించారు, ఆరాధించారు. నాన్నగారి దివ్యశక్తి ప్రభావం అప్రకటితం. గోప్యం. అత్యంత సాధారణంగా కనిపిస్తూ, మనలో ఒకరుగా మసలిన నాన్నగారి దివ్యప్రభావం అసాధారణమైన అంతర్దృష్టి వుంటేకాని అందరానిది.
దానికి అమ్మ ప్రకటన, ప్రవర్తనే ఆధారం.
(సశేషం)