(గత సంచిక తరువాయి)
అమ్మ సన్నిధిలో ఎందరికో ఉపనయనాలు, వివాహమహోత్సవాలు, నామకరణాలు, కేశఖండనలు, అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, పుట్టిన రోజు పండుగలు, సీమంతపు వేడుకలు, షష్టిపూర్తి మహోత్సవాలు జరుగుతూనే ఉండేవి. వాత్సల్యాలయం అంటేనే నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్నట్లుండేది. అయితే ఆనంద వల్లకీ నిస్వనాలే కాదు, అక్కడ అశ్రులహరులూ దర్శనమిస్తాయి. పరమానందభరిత హృదయ స్పందనలతో పాటు ఆక్రందనలు మూగమనస్సుల ఆవేదనలు నివేదనలు నిరాశలు నిట్టూర్పులు విషాద గాధలు విచిత్ర కథలు వ్యధలు… ద్వంద్వాతీత అయిన అమ్మ మనకోసం దిగివచ్చి చేసే అనునయాలు, ఊరడింపులు, బుజ్జగింపులు, ఓదార్పులు, అభయ ప్రదానాలు, ఉపదేశాలు, సందేశాలు, సూచనలు, సమాలోచనలు, సలహాలు, సంప్రదింపులు బహుముఖాలుగా సాగేవి.
సాయం సమారంభ వేళ నుండి మలిసంజ వరకు వాత్సల్యాలయం దక్షిణం వైపున ఆరుబయట అమ్మ దర్శనం ఆహ్లాదకరంగా అనుభూతిప్రదంగా సాగేది. రాగరంజితమైన ప్రకృతి హేల పరిఢవిల్లే వేళ – ‘మాయా విలాస ధృత కాయా’ అంటూ మంద్ర గంభీర స్వరం దివ్యసీమలకు దారులు పరుస్తున్న వేళ… ఎదురుగా తెల్లని మెత్తని చీరతో దరహాస చంద్రికలతో రూపుదాల్చిన దివ్య సౌందర్యలహరి అమ్మ. అగమ్యమైన గమ్యాన్ని చేరుకోవాలని మనస్సు తహతహలాడేది. మలయ సమీరం కూడా సడి చేయని ఆ ప్రశాంత సుందర సంధ్యారోచిస్సులతో అమ్మ మృదువైన తన కరాంగుళుల కదలికతో ఏవో గణాంకాలను గుణిస్తున్నట్లు గ్రహగతులను నిర్దేశిస్తున్నట్లు అనిపించేవారు. కొంతసేపు ఒకింత రాజసంగా మంచంపై పడుకొని తలకింద చేయి పెట్టుకుని నీలాల నింగిలో దోబూచులాడుతున్న పున్నమి చంద్రుణ్ణి చూస్తూ తాదాత్మ్య స్థితిలో ఉండిపోయేవారు. వెన్నెల జడిలో తడిసి ముద్దవుతున్న సందర్శకుల మనస్సు ‘వెలుగులీనే అమ్మ ముఖచంద్రుడు గగన సరోవరంలో ప్రతిఫలిస్తున్నాడా?’ అన్న భావనకులోనై ఆనందడోలికలూగే సుమధుర సన్నివేశమది.
ఒకరిద్దరితో మొదలై సంధ్యావందనం ముగిసే వేళకు పదిమంది పాతికమందిగా మారి చీకటి వెలుగుల సంగమతీర్థంలో ఎందరున్నారో తెలియని ఏకాంతంలో ఎవరికి వారే నిశ్శబ్ద సాగరాన్ని మధిస్తూ అంతర్ముఖులై ‘మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వాన్ని అనుభూతితో అందుకుంటున్నట్లు అనిపించే ఆ క్షణాలు – అమ్మ అనుగ్రహ వీక్షణాలు, కాలవాహినిలో కరిగిపోని అమృతక్షణాలు.
జీవన సమరంలో సమస్యల వలయంలో అలసి సొలసిన, దారి తెన్నూ కానరాని బాటసారులకు సేదతీర్చే చలువ పందిరి వాత్యల్యాలయం; దారీ తెన్నూ కానరాని దంపతుల నైరాశ్యోపహత జీవితంలో వెలుగులు నింపే వేగుచుక్క వాత్సల్యాలయం; కొత్త ఊసులతో కొంగొత్త ఆశలతో జీవన ప్రాంగణంలో అడుగుపెడుతున్న నవదంపతులను జిలుగు వెలుగుల తోరణాలతో కలకూజితాలతో స్వాగతించే ఆమని వాత్సల్యాలయం; ఆత్మీయులను కోల్పోయి బ్రతుకు భారమైన శోక సంతప్త హృదయాలను ఆదరించి అనునయించే అమ్మ ఒడి వాత్సల్యాలయం. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు. కొందరైతే కలతలతో కన్నీటితో కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడేవారు మరికొందరు; జీవితానికి అర్థమూ పరమార్థమూ ఏమిటనే జిజ్ఞాసతో తపించేవారు కొందరైతే అన్నీ ఉన్నా చెప్పుకోలేని వెలితితో పరితపించే అభాగ్యులు ఎందరో…! అందరినీ అక్కున చేర్చుకొని లాలించి పాలించే మమతల గర్భగుడి వాత్సల్యాలయం.
“మీరు నా బిడ్డలే కాదు నా అవయవాలు” అని మనతో తాదాత్మ్యాన్ని ప్రకటించిన అమ్మ ముందుగా తన ఆశయాలకు అనుగుణంగా తన బిడ్డలను తీర్చిదిద్ది తన సందేశాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం చేసింది. అలాంటి ఒకటి రెండు సన్నివేశాలను స్మరించుకుందాం –
– డా. పులుమాటి వెంకట నారాయణ గారు, శ్రీమతి సుగుణ దంపతులు మహబూబ్ నగర్ వాస్తవ్యులు. చిరకాలంగా అమ్మ పట్ల అచంచల విశ్వాసం గలవారు. వారికి అయిదుగురు కుమారులు. ఒక కుమారుణ్ణి కోల్పోయి పుత్రశోకంతో పుట్టెడు దుఃఖంతో అమ్మ దర్శనానికి వచ్చారు. వారి కుటుంబానికి సన్నిహితుడైన ఒక పేద పిల్లవాడు వారికి తోడుగా జిల్లెళ్ళమూడి వచ్చాడు. అమ్మ సన్నిధిలో విలపించి విలపించి పొంగులు వారే దుఃఖం నుండి కాస్త తేరుకున్న తర్వాత అమ్మ ఆ దంపతులను అక్కున చేర్చుకుని చేసిన ఉపదేశంI “మీరు కోల్పోయిన బిడ్డను మీవెంట వచ్చిన పిల్లవాడిలో చూసుకోండి” అని. అమ్మ మాట అంటే వారికి వేదమే. ఆ దంపతుల చిత్తశుద్ధి అటువంటిది. శిరసావహించారు. అంతే కాదు. తరువాతి తరం కూడా మేం అయిదుగురం అన్నదమ్ములమని కలిసి మెలిసి గడపటం విశేషం. స్వంత అన్నదమ్ములే విభేదాలతో వైషమ్యాలతో తలలు పట్టుకుంటున్న ఈ కాలంలో మూడు తరాలపై చెరగని ముద్ర వేసిన అమ్మప్రభావం నేటి సమాజంలో నమ్మశక్యం కాని నిజమేకదా!
ఒకరోజు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు అమ్మ దర్శనానికి వెళ్ళారు. వాత్సల్యాలయంలో అమ్మ ఒక్కరే ఉన్నారు. వారు అమ్మ సన్నిధిలో కూర్చుని ఉండగా ఒక కుటుంబం అమ్మ దర్శనానికి వచ్చారు. వారు అమ్మకు ప్రణమిల్లి పురాణేతిహాసాలకు సంబంధించిన ఒక ధర్మ సందేహం అడిగారు. అప్పుడు అమ్మ శ్రీమన్నారాయణ మూర్తి గారిని చూపించి ” బాగా చదువుకున్నాడు. మంచి వక్త. ఆయనని అడగండి” అన్నారు వారితో. అది విన్న మూర్తిగారు నవ్వి ‘నేను వక్తనయితే నీవు ప్రవక్తవుకదమ్మా!’ అన్నారు వినయంగా. అసలు విషయం పక్కన బెట్టి ఇంతకూ వక్తకు ప్రవక్తకు తేడా ఏమిటో చెప్పమన్నారు అమ్మ. అసంకల్పితంగా అన్నారే కాని అంతలోతుగా అర్థాన్నీ ఆలోచించని మూర్తిగారి మనస్సు చురుకుగా పనిచేయటం ప్రారంభించింది. “విస్తారమైన విషయాన్ని సంక్షిప్తరూపంగా సూత్రప్రాయంగా చెప్పేవాడు ప్రవక్త; సంక్షిప్తరూపాన్ని విస్తృతంగా విశద పరచి వ్యాఖ్యానించి చెప్పేవాడు వక్త” – అని చెప్పి సద్య: స్ఫురణ కలిగించిన అమ్మకు కైమోడ్పులు సమర్పించారు. ఇలాంటి సన్నివేశాలలో ప్రశ్నించి, సరికొత్త ఆలోచనకు ప్రేరణతానై నిలిచి స్ఫురణే దైవమని నిరూపించిన అమ్మ అనుగ్రహానికి ప్రబల సాక్ష్యం వాత్సల్యాలయం.
1985 జూన్ 2 వ తేదీన అమ్మ తన మహాప్రస్థానానికి శ్రీకారం చుట్టుకొని అందరింటి సభ్యులను అందరినీ పిలిపించి జాగ్రత్తలు చెప్పి పేరు పేరునా వీడ్కోలు చెప్పిన ఉద్విగ్నభరిత మహెూపద్రవ ఘట్టానికి సజీవ సాక్ష్యం వాత్సల్యాలయం. “నిర్ణయానికి నిర్ణయించిన వాడూ బద్ధుడే” అంటూ తన నిర్ణయానికి తాను కట్టుబడి బిడ్డలతో ముడిపడిన మమతానుబంధం తెంచుకోలేక అమ్మ అనుభవించిన మానసిక సంఘర్షణకు ప్రత్యక్ష సాక్ష్యం వాత్సల్యాలయం. 12 రాత్రి అంతిమశ్వాస వదిలిన మహాప్రళయానికి, అమ్మ మహాభినిష్క్రమణానికి మౌనసాక్ష్యం వాత్సల్యాలయమే. శివుడు హాలాహలాన్ని తన కంఠంలో దాచుకున్నట్లు ఆ గదిగోడలు ఆ బాధామయ దృశ్యాలను గర్భస్థం చేసుకున్నాయి. ‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో’ – అని కొడాలి సుబ్బారావు గారు వర్ణించినట్లు సర్వసాక్షియైన ఆ వాత్సల్యాలయం గోడలు గుండె బరువు తీరేలా మౌనంగా ఎంత రోదించాయో అమ్మకే ఎరుక.
ఇప్పటికీ మనం వాత్యల్యాలయంలోకి అడుగుపెడితే రాముడు లేని అయోధ్యలా, కృష్ణుడు లేని ద్వారకలా దర్శనమిస్తుంది. అదే మంచం, అదే తలగడలు తెల్లని ఆస్తరణంతో వెలవెల పోతూ కనిపిస్తాయి. పక్కనే పాదపీఠం; దానిపైన ఎంతోకాలం అమ్మ శ్రీ చరణాలను శిరసావహించిన పవిత్ర పాదుకలు. మంచం పక్కన దక్షిణపు గోడను ఆనుకొని దరహాస ప్రభలతో అమ్మ చిత్రం- సజీవంగా అమ్మ సింహాసనాన్ని అధిష్ఠించినట్లే వుంటుంది.
చిత్రమేమిటంటే అది చూపుతోనే మనను చూసి నవ్వుతుంది. పలకరిస్తుంది. మనరాకకు పులకరిస్తుంది. “భోం చేశావా చేసిరా” అంటుంది. ప్రేమార్ధమైన ఎన్నో రసవత్తర భావాలకు మూలకందమై మనలో ఎన్నో తలపుల మెలపులకు రేకులు తొడుగుతుంది. ప్రశాంత చిత్తంతో ఉండగలిగితే ఒక్క క్షణమైనా చాలు. ఆ మౌన సందేశం గుండెలను కరిగిస్తుంది, మన చేయి పట్టి నడిపిస్తుంది. ‘మనస్సు లయమయ్యే చోటు ఆలయం’ కదా! వాత్సల్యామృత ధారలతో మనస్సును లయం చేసి దివ్య పథంలో నడిపించే అమ్మ సన్నిధికి ‘వాత్సల్యాలయం’ అన్నపేరు అన్ని విధాలా అన్వర్థమే. అర్కపురి చరిత్రలో వెలుగులీనే అందరింటికి మణిమకుటం వాత్సల్యాలయం.
వాత్సల్య ప్రఫుల్లమైన అమ్మ అంతరంగమే వాత్సల్యాలయం. ఒక దృక్పథంతో పర్యాలోచన చేస్తే అణువణువునా వాత్సల్యాన్ని నింపుకున్న అమ్మే వాత్సల్యాలయం.
వాత్సల్యాలయం అమ్మ నివాసం కాదు. ఏది అమ్మకు నివాసమో అంటే ఎక్కడ అమ్మ ఉంటే అది వాత్సల్యాలయం.d