అమ్మ నాన్నగారి చేయిపట్టుకొని జిల్లెళ్ళమూడిలో అడుగుపెట్టి పశువులపాకలోను పర్ణకుటీరంలోను సమంగానే కాపురం నిర్వహించింది. ‘ఇది యిలా కావా’లని లేని అమ్మకు ఎప్పుడు ఏది నివాసమో అదే ఇంద్రభవనం, చంద్రశాలా. ఆ రోజులలో కుక్కలూ పిల్లులే కాదు పందికొక్కులూ అమ్మ పరివారమే. 1968 లో హైమాలయ ప్రతిష్ఠ, 1969లో అమ్మ పెద్దకుమారుడు సుబ్బారావన్నయ్య వివాహం జరిగాక అమ్మ నివాసం అందరింటి మేడపైకి మారింది. అందరింటి ప్రధాన ద్వారం ఎదురుగా వేదిక వెనుకపక్క మేడపైకి వెళ్ళే మెట్లుంటాయి. మొదటి అంతస్థులో పది అడుగులు వేయకుండానే మరో మెట్లవరుస కనిపిస్తుంది. పరమపద సోపానమా అన్నట్లున్న ఆదారిని అనుసరించి పైకి చేరితే పైరుపచ్చలతో కళకళలాడుతూ ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నట్లు గ్రామీణ వాతావరణం కనువిందు చేస్తుంది.
విశాలమైన ప్రాంగణాన్ని ఆనుకొని పశ్చిమ దక్షిణాలను కలుపుతూ వరండా … వరండాలో దక్షిణాభిముఖంగా నడిస్తే కుడివైపున హాలు – ఎదురుగా చిన్నగది. ఆ గదికి పడమటివైపున కొద్దిపాటి ఖాళీ స్థలం. దాని పక్కనే సిమెంటుతో కట్టిన పెద్ద నీళ్ళతొట్టె. ఆ పక్కనే చిన్న వంటగది. వరండాకు తూర్పువైపున బాల్కనీ. ఆరోజులలో భక్తులు బాల్కనీలో కొబ్బరి కాయలు కొట్టుకొని అమ్మ దర్శనానికి వచ్చేవారు. ఇప్పుడా బాల్కనీ కొత్తగా నిర్మించబడ్డ సమావేశ మందిరంలో విలీనమయింది. గదికి దక్షిణాన విశాలమైన ప్రాంగణం. అమ్మనివాసానికి ఇరుప్రక్కలా ఉన్న సువిశాల ప్రదేశాలలో ఉత్తరం వైపున తెల్లవారుజామున అమ్మకు ‘సుప్రభాతసేవ’, సాయం సమయంలో ‘సంధ్యా వందనము’ అనునిత్యమూ జరుగుతూ వుంటాయి. దక్షిణంవైపున సాయంత్రం వేళ నుండి రాత్రి చాలా భాగం అమ్మ విశ్రాంతిగా మంచంపై కూర్చుని అందరింటి సభ్యులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడేవారు. అక్కడే అమ్మకు పాదపీఠం అమర్చి పూజచేసుకోవటం అరుదుగా జరిగేది. ఈ ప్రాంగణా లలో తరచుగా అమ్మ ఎవరితోనైనా సంభాషిస్తూ నడుస్తూ వుండేవారు. ఇది వాత్సల్యాలయ రేఖాచిత్రం.
1969 లో ఇది అమ్మనివాసంగా మారినపుడు చిన్నహాలు వంటగది మాత్రమే ఉండేవి. కొంతకాలం తర్వాత ఏ.సి. గది నిర్మించబడింది. ఇది సరిగ్గా పట్టుమని పదిమంది కూర్చొనటానికి సరిపోతుంది. కానీ అమ్మ దర్శనసమయంలో ఇది పుష్పకవిమానమే. కొన్ని సందర్భాలలో పాతిక ముప్పయిమంది కదలిక మెదలిక లేనంత ఒద్దికగా సర్దుకొని కూర్చోవటం అమ్మ బిడ్డలందరికీ స్వానుభవమే. 1985 జూన్ 12 వరకు అనంతమైన శక్తి పరిమిత రూపంతో మనమధ్య మసలినంత కాలం అమ్మ శ్రీచరణ స్పర్శతో పునీతమై అమ్మ వాత్సల్యానికి ప్రతిరూపమై ప్రతీకయై పతాకయై ప్రత్యక్షసాక్షియై విరాజిల్లిన అమ్మనివాసం అనంతర కాలంలో ‘వాత్సల్యాలయం’ అనే పేరుతో ప్రశస్తి గాంచింది.
ఇప్పటికీ అమ్మవాడిన మంచం, తలగడలు, పాదుకలు పాదపీఠంతో సందర్శకులకు అలనాటి వైభవానికి సంకేతంగా కనిపిస్తుంది. ఆ రోజులలో అమ్మ మంచంపై కూర్చొని ఎందరికో దర్శనం ఇచ్చేవారు. కొన్నిసార్లు హాలులో సింహాసనం పైనా, మరికొన్నిసార్లు వరండాలోనూ దర్శనం కొనసాగేది. ఏ.సి. గదికి ఉత్తరంవైపున ఉన్న ద్వారానికి ఎదురుగా వరండాలోను ఆరుబయటా జనబాహుళ్యం వుండి వరుసగా వచ్చి అమ్మను దర్శించుకునేవాళ్ళు. వాత్సల్యాలయానికి దక్షిణాన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఇటీవలికాలంలో ధ్యానమందిరం రూపుదిద్దుకుంది. మెట్లెక్కి పైకి రాగానే ఎడమవైపున ఉన్న తలుపు తెరిస్తే హాలుకు వంటగదికి మధ్య చిన్న జాగా. ఏసి గది నిర్మించక ముందు అమ్మ ఇక్కడే మంచం వేసుకొని పడుకునేవారు. దానికి పక్కనే స్నానాలగది. అమ్మ దినచర్యలో స్నానానికి ప్రత్యేకస్థానం వుంది. సాధారణంగా అమ్మ రోజూ కనీసం అయిదారుసార్లు స్నానం చేసేవారు. ఒక్కొక్క స్నానం వందబిందెల నీళ్ళతో గంటసేపు జరిగేది. అన్నపూర్ణాలయం నుండి వేడినీళ్ళు గుండిగలతో పైకి తెచ్చేవారు. నీళ్ళ తొట్టి నుండి కొందరు బిందెలతో నీళ్ళు అందించేవారు. గజేంద్రమ్మక్కయ్య, కృష్ణవేణి అక్కయ్య, అడవులదీవి సుశీలక్కయ్య, కాత్యాయని అక్కయ్య, బ్రహ్మాండం శేషక్కయ్య మొదలైనవారు స్నాన సమయంలో సేవలు అందించేవారు. అమ్మ స్నానానికి ఒక నిర్దిష్ట సమయం ఉండేది కాదు. అర్ధరాత్రి అపరాత్రి కూడా అమ్మ స్నానం కొనసాగేది. ఒక్కొక్కప్పుడు 103 డిగ్రీల జ్వరంతో శారీరక రుగ్మతలతో బాధపడుతూ కూడా అమ్మ స్నానం చేయగానే పుచ్చపువ్వులా మెరిసిపోతూ ఉల్లాసంగా ఎన్నో ఉత్సవాలు చెరగని చిరునవ్వుతో నిర్వహించేవారు. అమ్మను దేవతా మూర్తిగా సేవించుకునే బిడ్డల దృష్టిలో అమ్మ స్నానం అంటే రుద్రాభిషేకమే. ఏదో అవ్యక్తమైన ప్రత్యేకతా పరమార్థం అమ్మ స్నాన ఘట్టానికి ఉన్నదనేది అందరికీ అనుభవమే.
గోదావరీ పుష్కరాల సమయంలో చీరాలనుండి డా॥ సుబ్బారావు గారు బుద్ధిమంతుడన్నయ్య, వెంకయ్య గారు మొ॥ సోదర బృందం అమ్మసన్నిధిలో పుష్కర స్నానం చేయాలని సంకల్పించారు. అన్ని నదులూ అమ్మ పాదాల్లోనే ఉన్నాయని వారి భావన. కార్యక్రమం ప్రారంభం కాగానే అందరింటి సభ్యులు వారి వెంట కళాశాల అధ్యాపకులూ …. క్రమంగా జనసందోహం పెరిగింది. స్నానాలగది పక్కనే నిండుగాఉన్న నీళ్ళ తొట్టిలోకి అమ్మ దిగి నిలుచున్నది. అందరూ వరుసగా వస్తే గ్లాసుతో నీళ్ళు తీసుకొని అమ్మ ఒక్కొక్కరికీ స్నానం చేయించింది. కొందరు అమ్మను ఆతొట్టిలోనే పూలదండలతో అలంకరించారు. మరికొందరు పూలతో పూజించుకున్నారు. రంగురంగుల పూలతో రమణీయంగా మారిన నీళ్ళల్లో ‘క్షీరసాగర సముద్భవ’ అయిన లక్ష్మీదేవివలె అమ్మ కనువిందు చేసింది. ఉత్సాహం వెల్లివిరిసిన ఆ ఉత్సవం మరపురాని ఒక మధురస్మృతి.
వరండాకు పశ్చిమంగా ఒకప్పుడు అమ్మ దర్శనం ఇచ్చిన హాలువుంది. అందులోకి వెళ్ళగానే అమ్మ అధివసించిన సింహాసనం కనిపిస్తుంది. గాజు తలుపులు అమర్చిన అలమరలలో అమ్మ వాడిన వస్తువులు-అమ్మ కరకమలాలను అలంకరించిన గాజులు, కప్పు సాసర్లు వైద్యసేవలను అందించిన పరికరాలు వంటివి భద్రపరచపడి ఉంటాయి. అవి గతించిన చరిత్రకు మౌన సాక్ష్యాలుగా దర్శనమిస్తాయి. హాలులోనుండి పశ్చిమంగా రెండడుగులు వేస్తే వంటగది. నిరంతరం అమ్మసన్నిధిలో కాలంగడిపే ఆంతరంగికులైన సోదరులకు సుదూర ప్రాంతాలనుండి దర్శనానికి విచ్చేసిన వారికి కాఫీలు, టీలు, పాలు అవసరాన్ని బట్టి ఫలహారాలు సిద్ధంచేసే రసవతి ఆ వంటిల్లు. అమ్మ మనసెరిగి వర్తించే ఇల్లాలు శ్రీమతి వసుంధరక్కయ్య, కొంతకాలం శ్రీమతి అన్నపూర్ణక్కయ్య ప్రధాన బాధ్యతను నిర్వహించేవారు. వంటింటి పడమటివైపు గోడకు చిన్న కిటికీ ఉండేది. ఆ యెదురుగా పశువుల కొట్టం వుండేది. అమ్మ పైనుంచి వాటి బాగోగులను పరిశీలిస్తూ పర్యవేక్షణ సాగించేది. ఆ గవాక్షం కర్మసాక్షిలా అమ్మ ఫాలనేత్రంలా భాసించేది. ప్రశాంత సుందర వినీల గగనసీమలో అమ్మ తన కటాక్ష వీక్షణాలతో దిగంతాలను స్పృశిస్తూ … సర్వాధ్యక్షగా సుమేరుశృంగమధ్యస్థయైన శ్రీమన్నగరనాయికగా దర్శనమిచ్చేది.
ముక్కోటి పర్వదినాన తొలిజామువేళ మంచు తెరల మధ్య అమ్మ శంఖచక్రాలను కిరీటాన్ని ధరించి ఊర్ధ్వపుండ్రాలతో పీతాంబరధారిణియై సాక్షాత్తు వైకుంఠనాథుడే దిగివచ్చి నిలిచాడా అన్నట్లు దర్శన మిచ్చేవారు. అర్చకస్వామిగా మారిన రామకృష్ణన్నయ్య ప్రత్యేక నీరాజనం సమర్పించేవారు. అందరింటి సోదరులందరూ ముక్తకంఠంతో “పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తవ దర్శనమ్ ధన్యతమం ధన్యతమం మాతర్మమ జీవనమ్” అంటూ భక్తిపరవశు లై ఆలపించిన గీతం ఈనాటికీ గుండెలలో ప్రతిధ్వనిస్తూ తనువు పులకాంకితం అవుతుంది.
విజయదశమి పర్వదినాన జరిగే ‘శమీ పూజ’ వంటి విశేష కార్యక్రమాలు, రాజుబావ ‘అనుభవ సారం’ వంటి గ్రంథావిష్కరణలు, సంకీర్తన, నాదనీరాజనం వంటి సంగీత కార్యక్రమాలు ఉత్తరం వైపు ప్రాంగణంలో సంధ్యావందనం ముగిశాక ప్రారంభమై సమయానుకూలంగా రాత్రివరకు కొనసాగేవి. ‘మధురభారతి’ శ్రీమల్లాప్రగడ శ్రీరంగారావు గారి లలితా సహస్రనామ వ్యాఖ్యాన ప్రవచనం, లక్ష్మణ యతీంద్రులవారి ‘క్వణత్కింకిణి’ కావ్యగానం, ‘సరస్వతీ పుత్ర’ శ్రీపుటపర్తి నారాయణాచార్యులుగారి ‘శివ తాండవం’ కావ్యగానం, శ్రీసముద్రాల శేషాచార్యులు గారి ‘తిరుప్పావై’, శ్రీమద్రామాయణం ఎన్నో – ఎన్నెన్నో ఆపాతమధురాలు ఆలోచనామృతాలు అయిన అక్షరార్చనలు అమ్మ సన్నిధిలో శ్రోతల హృదయాలలో సంస్కార బీజాలను నిక్షిప్తం చేసేవి. మధ్యమధ్య అధ్యాపక మిత్రుల ప్రశ్నోత్తరాలు. ‘నాకేమీ తెలియదు నాన్నా’ అంటూనే చిరునవ్వులు చిందిస్తూ అమ్మచేసే మృదుమధురమైన ముక్తాయింపులూ!! ఎన్నని చెప్పగలం? ఏమని చెప్పగలం! ఆనాటి జీవితమే ఒక అనుభవాల సంపుటి.
అమ్మ దర్శనానికి రాష్ట్రం నలుమూలలనుండి ఇతర రాష్ట్రాలనుండి సందర్శకుల రాకతో విదేశీ సోదరులతో మాతృశ్రీ కళాశాల విద్యార్థులతో అందరిల్లు అన్నపూర్ణాలయం నిండుగా వరదగోదారిలా కళకళ లాడిన కాలమది. ఆ రోజులలో ఎందరో ప్రముఖులు రాజకీయ నాయకులు, సామాజిక సంస్కర్తలు, బహుభాషావేత్తలు, పరిశోధకులు, తత్త్వ సందర్శకులు, శాస్త్రవేత్తలు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, యతీశ్వరులు, అవధాన సరస్వతులు, పండితులు, కవులు గాయకులు కళాకారులు అమ్మను దర్శించుకున్నారు. తమ తమ ప్రతిభావిశేషాలను కళా నైపుణ్యాలను అమ్మ సమక్షంలో ప్రదర్శించి ఆశీస్సులను అందుకున్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి (పూర్వాశ్రమంలో శ్రీ ప్రసాదరాయ కులపతి గారు) శ్రీ పూర్ణానంద స్వామిజీ, శ్రీయుతులు కృష్ణభిక్షు, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, శ్రీ వీరమాచనేని ప్రసాదరావు గారు, శ్రీ పేరాల భరతశర్మ గారు, శ్రీ సంపత్కుమార్ బృందం, శ్రీమొసలికంటి తిరుమలరావు గారు, శ్రీశ్రీశ్రీ ప్రణవా నంద, శ్రీ అవధూతేంద సరస్వతీ స్వామిజీ వారిలో కొందరు మాత్రమే.
(సశేషం)